radar system
-
చైనాకు చెక్.. పుతిన్‌తో భారత్ భారీ ఒప్పందం
ఢిల్లీ: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహాకారంపై చర్చించారు. రష్యా స్నేహితులకు భారత్ అన్నివేళలా అండగా నిలుస్తుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో రష్యాతో భారత ప్రభుత్వం భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది.రష్యా పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ఒప్పందంపై చర్చించారు. రాడార్ వ్యవస్థకు సంబంధించిన భారీ రక్షణ ఒప్పందాన్ని రష్యాతో భారత్ కుదుర్చుకుంది. సుమారు నాలుగు బిలియన్ డాలర్ల ఖరీదైన ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ వార్నింగ్ రాడార్ వ్యవస్థ వోరోనెజ్ రాడార్(Radar Voronezh)ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్నది. ఆ ఒప్పందానికి చెందిన సంప్రదింపులు తుది దశలో ఉన్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.దేశ రక్షణ విషయంలో కేంద్రం టెక్నాలజీని పెంచే ఉద్దేశంతో ముందడుగు వేసింది. మిస్సైల్ బెదిరింపుల్ని గుర్తించి, ట్రాక్ చేసేందుకు సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే రాడార్ వ్యవస్థ కొత్త టెక్నాలజీపై ఫోకస్ పెట్టింది. అయితే, అల్మాజ్-ఆంటే కార్పొరేషన్ కంపెనీ వోరోనేజ్ రేడార్లను ఉత్పత్తి చేస్తున్నది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్స్, రేడార్ల ఉత్పత్తిలో ఆ సంస్థ అగ్రస్థానంలో ఉన్నది.Russia is talks to sell gigantic radar to india.Almaz-Antey’s Voronezh radar detects missiles, aircraft, and threats up to 6,000–8,000 km, supporting Russia’s missile defence network. pic.twitter.com/AmCWaX01Rs— Abhimanyu Manjhi (@AbhimanyuManjh5) December 10, 2024ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిపణుల కదలికల్ని రాడార్లతో పసికట్టేందుకు ఈ కొనుగోలు చేపట్టనున్నారు. అధునాతన రాడార్ వ్యవస్థ చైనా, దక్షిణ, మధ్య ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఎక్కడి నుంచి అయినా ముప్పును గుర్తించగలదు. దాదాపు 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను వోరోనేజ్ రాడార్ వ్యవస్థ గుర్తిస్తుందని అధికారులు అంటున్నారు. కొన్ని దేశాల వద్దే ఉన్న ఇలాంటి టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా సొంతం చేసుకోనున్నట్లు రష్యా చెబుతోంది.ఇక, ఇటీవల అల్మేజ్-ఆంటే బృందం భారత్‌లో పర్యటించింది. మేకిన్ ఇండియాలో భాగంగా సుమారు 60 శాతం రాడార్ వ్యవస్థను భారతీయ కంపెనీల ఉత్పత్తులతోనే నిర్మించనున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గలో దీన్ని ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ అడ్వాన్స్డ్ డిఫెన్స్ , ఏరోస్పేస్ సౌకర్యాలు ఉన్నాయి. -
వాతావరణ సమాచారం ఇక నిరంతరం
సాక్షి, విశాఖపట్నం: కచ్చితమైన వాతావరణ అంచనాల్లో భారత వాతావరణ విభాగానికి (ఐఎండీకి) ప్రపంచ దేశాల్లో పేరుంది. ఇప్పుడు తాజాగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఐఎండీ మరింత ముందుకెళ్తోంది. వాతావరణ సమాచారాన్ని విస్తృతం చేయడంపైనా దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రాడార్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రస్తుతమున్న రాడార్ కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు కొత్త రాడార్ కేంద్రాలను కూడా ఏర్పాటుచేస్తోంది. తూర్పు తీర ప్రాంతంలో అత్యదిక సామర్థ్యం కలిగిన ఎస్–బ్యాండ్ డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు విశాఖపట్నం, మచిలీపట్నం, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్నాయి. వీటి పరిధి 500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఆయా కేంద్రాల పరిధిలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల స్థితిగతులు, వాటి తీవ్రత, ప్రభావం, గమనం, గాలుల తీవ్రత, వర్షపాతం వంటి వాటిని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా అంచనావేస్తూ ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తాయి. వాయుగుండాలు, తుపానులు తీరానికి ఎంత దూరంలో ఉన్నాయో, ఎంత ఎత్తులో ఉన్నాయో, ఎక్కడ తీరాన్ని దాటుతాయో గుర్తిస్తాయి. అంతేకాదు.. రాడార్ కేంద్ర స్థానం నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాల తీరుతెన్నులనూ రికార్డు చేస్తాయి. స్వదేశీ పరిజ్ఞానంతోనే.. ఈ నేపథ్యంలో.. ఐఎండీ ఇప్పుడు కోల్‌కతా, చెన్నై సహా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న డాప్లర్ రాడార్ పరికరాలు, యంత్ర సామగ్రికి బదులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్ర పరికరాలను అమర్చనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న డాప్లర్ రాడార్ స్టేషన్లు విదేశీ టెక్నాలజీతో ఏర్పాటుచేసినవే. అయితే, ఆధునీకరణలో భాగంగా ఏర్పాటయ్యేవి మాత్రం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే ఉండనున్నాయి. వీటిలో సింగిల్ యాంటెన్నాలకు బదులు డ్యూయెల్ పోలరైజ్డ్ యాంటెన్నాలు ఏర్పాటుచేస్తారని భావిస్తున్నారు. త్వరలో పాతవాటి స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. ఇవీ ప్రయోజనాలు.. ప్రస్తుతమున్న డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు ప్రతి గంటకూ వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నాయి. ఆధునీకరణలో భాగంగా కొత్త యంత్ర పరికరాలను ఏర్పాటుచేస్తారు. వీటితో ఇకపై నిరంతరం రాడార్ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఫలితంగా అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. అంతేకాదు.. వాతావరణ పరిస్థితులను బట్టి మరింత కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి వినియోగించుకుంటారు. రెండు దశాబ్దాల క్రితం నాటివి.. నిజానికి.. విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వాటిలో పనిచేస్తున్న యంత్ర పరికరాలకు అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తవి అమరిస్తే మరి కొన్నేళ్లపాటు అవాంతరాల్లేకుండా కచ్చితత్వంతో కూడిన వాతావరణ సమాచారం నిరంతరం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
‘రష్యా’కే టోకరా వేశాడు..
న్యూ ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయాన్నే మోసగించి 42,500 అమెరికన్ డాలర్లు( రూ.28 లక్షలు) కొట్టేశాడో మోసగాడు. కార్యాలయంలో రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా పనులు చేజిక్కించుకున్న గుంటూరు జిల్లాకు చెందిన కోరే రంగబాబు...ముందుగా డబ్బులు తీసుకుని పనులు చేయకుండా తప్పించుకోవడంతో రష్యన్ కార్యాలయ సెక్రటరీ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన నగర పోలీసులు గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో రంగబాబును గుర్తించి పట్టుకున్నారు. గచ్చిబౌలి: న్యూఢిల్లీలోని రష్యన్ రాయబారి కార్యాలయంలో రాడార్ ఏర్పాటుకు ఆన్లైన్లో పనులు చేజిక్కించుకున్న వ్యక్తి మొత్తం డబ్బులు తీసుకుని పరారు కాగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని డబ్బు రికవరీ చేసినట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో వివరాలు వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని రష్యన్ రాయబారి కార్యాలయంలో ఎస్ఐఆర్ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ఏర్పాటు కోసం 2016 మే నెలలో ఆన్లైన్ టెండర్లు పిలిచారు. సరూర్‌నగర్‌లోని కేఆర్‌బీ జీఈఐఓ సర్వీసెస్ సీఈఓగా వ్యవరిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన కోరే రంగబాబు ఆన్లైన్ రాడార్ ఏర్పాటు టెండరు దాఖలు చేసి 42,500 అమెరికన్ డాలర్లు(రూ.28 లక్షలు)లకు కోట్ చేసి పనులు దక్కించుకున్నారు. మొత్తం డబ్బు తన ఖాతాలో జమ చేస్తేనే పనులను ప్రారంభిస్తానని చెప్పడంతో రష్యన్ ఫెడరేషన్ రాయబార కార్యాలయం సదరు మొత్తాన్ని రంగబాబు అకౌంట్లోకి బదిలీ చేసింది. జీఎస్టీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరికొంత డబ్బు కావాలని కోరగా, రష్యన్ అధికారులు అంగీకరించలేదు. దీంతో అతను పనులు ప్రారంభించకపోగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో సదరు కార్యాలయం సెక్రెటరీ ఇగోర్ బోల్డిరేవ్ 2017 సెప్టెంబర్ 29న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేయగా, సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హుడా కాలనీలో అతడికోసం గాలించగా ఆఫీస్ ఖాళీ చేసి వెళ్లినట్లు గుర్తించారు. గుంటూరులోని మారుమూల ప్రాంతంలో రంగబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు తీసుకున్న మొత్తాన్ని రష్యన్ ఫెడరేషన్ రాయబారి అకౌంట్లోకి జమ చేయించినట్లు తెలిపారు. దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా రంగబాబు వ్యవహరించాడని కేసును దర్యాప్తు చేసిన డీసీపీ వెంకటేశ్వర్ రావు, ఏసీపీ వేణుగోపాల్, సీఐ రంగస్వామిలను సీపీ అభినందించారు. డబ్బు తిరిగి అకౌంట్లో జమ కావడంతో కోర్టులో కేసు ఉపసంహరించుకోనున్నట్లు తెలిపారు. చాలా మంది వద్ద డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడటం గొడవ చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వడం రంగబాబుకు పరిపాటేనని పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు ప్రశంస... సీపీ మహేశ్ భగవత్‌తో పాటు రష్యన్ ఫెడరేషన్ రాయబారి కార్యాలయం సెక్రెటరీ ఇగోర్ బోల్డిరేవ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రష్యన్ ఫెడరేషన్ రాయబారి నికోలాస్ కుదసెవ్ అభినందనలు తెలిపిన లేఖను చదివి వినిపించారు. తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేసిన తీరును ప్రశంసించినట్లు ఆయన పేర్కొన్నారు. -
రాజధానిలో రాడార్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: జపాన్‌లో పరిశోధన చేసిన అత్యాధునిక రాడార్ వ్యవస్థను ఏపీ రాజధాని అమరావతిలో నెలకొల్పడానికి ఆ దేశానికి చెందిన సుమితోమో కార్పొరేషన్‌లోని తోషిబా గ్రూపు ముందుకు వచ్చింది. గురువారం అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మీపార్థసాథిని ఈ బృందం అధికారులు కలుసుకున్నారు. ముందుగా లక్ష్మీపార్థసార«థి తోషిబా అధికారులకు రాజధాని అమరావతి భౌగోళిక వైవిధ్యం, అక్కడి సహజ వనరులు, రాజధాని బృహత్తర ప్రణాళికలను వివరించారు. అనంతరం తోషిబా ప్రతినిధులు భారీ వర్షాలను ముందే గ్రహించి వాటిని అదుపు చేయగల అత్యాధునిక సాంకేతిక పద్ధతితో రూపొందించిన రాడార్ వ్యవస్థలోని ప్రధాన అంశాలను చైర్‌పర్సన్‌కు వివరించారు. ఈ వ్యవస్థను మన వాతావరణానికి అనుసంధానం చేయవచ్చని వివరించారు. అలాగే రాడార్ ఏర్పాటుకు సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తామని ప్రతిపాదించారు. దీనిపై లక్ష్మీపార్థసార«థి సంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలోని కొండవీటి వాగు వరద ముంపు నివారణకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. -
‘బరాక్ 8’ విజయవంతం
ముంబై: యుద్ధ నౌకల్లో ఉపయోగించే మరో క్షిపణిని భారత నేవీ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే 70 కిలోమీటర్ల పరిధి(రేంజ్) ఉన్న బరాక్ 8 క్షిపణిని ‘ఐఎన్ఎస్ కోల్‌కతా’ నౌకలో పరీక్షించింది. దీన్ని భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధిపరిచాయి. ఉపరితలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే క్షిపణుల్లో ఇది అత్యంత పరిధి కలిగి ఉందని నేవీ అధికారులు పేర్కొంటున్నారు. అరేబియా మహా సముద్రంలో మంగళవారం, బుధవారం రెండు క్షిపణులను విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపారు. దీంతో పాటు క్షిపణులను గుర్తించి, ప్రమాదాలను పసిగట్టే రాడార్ వ్యవస్థను కూడా అభివృద్ధిపరిచారు. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా 250 కిలోమీటర్లకు పైగా పరిధిలో వందలాది శత్రు క్షిపణులు, అనుమానాస్పద విమానాలు, డ్రోన్లను ఒకేసారి గుర్తించవచ్చు.