సాక్షి, విశాఖపట్నం: కచ్చితమైన వాతావరణ అంచనాల్లో భారత వాతావరణ విభాగానికి (ఐఎండీకి) ప్రపంచ దేశాల్లో పేరుంది. ఇప్పుడు తాజాగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఐఎండీ మరింత ముందుకెళ్తోంది. వాతావరణ సమాచారాన్ని విస్తృతం చేయడంపైనా దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రాడార్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది.
ప్రస్తుతమున్న రాడార్ కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు కొత్త రాడార్ కేంద్రాలను కూడా ఏర్పాటుచేస్తోంది. తూర్పు తీర ప్రాంతంలో అత్యదిక సామర్థ్యం కలిగిన ఎస్–బ్యాండ్ డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు విశాఖపట్నం, మచిలీపట్నం, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్నాయి. వీటి పరిధి 500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది.
ఆయా కేంద్రాల పరిధిలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల స్థితిగతులు, వాటి తీవ్రత, ప్రభావం, గమనం, గాలుల తీవ్రత, వర్షపాతం వంటి వాటిని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా అంచనావేస్తూ ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తాయి. వాయుగుండాలు, తుపానులు తీరానికి ఎంత దూరంలో ఉన్నాయో, ఎంత ఎత్తులో ఉన్నాయో, ఎక్కడ తీరాన్ని దాటుతాయో గుర్తిస్తాయి. అంతేకాదు.. రాడార్ కేంద్ర స్థానం నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాల తీరుతెన్నులనూ రికార్డు చేస్తాయి.
స్వదేశీ పరిజ్ఞానంతోనే..
ఈ నేపథ్యంలో.. ఐఎండీ ఇప్పుడు కోల్‌కతా, చెన్నై సహా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న డాప్లర్ రాడార్ పరికరాలు, యంత్ర సామగ్రికి బదులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్ర పరికరాలను అమర్చనున్నారు.
ప్రస్తుతం నడుస్తున్న డాప్లర్ రాడార్ స్టేషన్లు విదేశీ టెక్నాలజీతో ఏర్పాటుచేసినవే. అయితే, ఆధునీకరణలో భాగంగా ఏర్పాటయ్యేవి మాత్రం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే ఉండనున్నాయి. వీటిలో సింగిల్ యాంటెన్నాలకు బదులు డ్యూయెల్ పోలరైజ్డ్ యాంటెన్నాలు ఏర్పాటుచేస్తారని భావిస్తున్నారు. త్వరలో పాతవాటి స్థానంలో కొత్తవి అమర్చనున్నారు.
ఇవీ ప్రయోజనాలు..
ప్రస్తుతమున్న డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు ప్రతి గంటకూ వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నాయి. ఆధునీకరణలో భాగంగా కొత్త యంత్ర పరికరాలను ఏర్పాటుచేస్తారు. వీటితో ఇకపై నిరంతరం రాడార్ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఫలితంగా అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. అంతేకాదు.. వాతావరణ పరిస్థితులను బట్టి మరింత కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి వినియోగించుకుంటారు.
రెండు దశాబ్దాల క్రితం నాటివి..
నిజానికి.. విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వాటిలో పనిచేస్తున్న యంత్ర పరికరాలకు అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తవి అమరిస్తే మరి కొన్నేళ్లపాటు అవాంతరాల్లేకుండా కచ్చితత్వంతో కూడిన వాతావరణ సమాచారం నిరంతరం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment