పొందూరు పోలీసులు పట్టుకున్న ఖైనీలు, గుట్కా మూటలు(ఫైల్)
జలుమూరు: జిల్లాలోని టెక్కలి, తిలారు, శ్రీకాకుళం, పొందూరు తదితర రైల్వే స్టేషన్ల కేంద్రంగా అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. మూటల ముసుగులో గుట్కాలు, ఖైనీలు, బట్టలు, కంచు, ఇత్తడి పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది.
గత నెలలో నరసన్నపేట మండలం జమ్ముకూడలిలో పోలీసులు సుమారు రూ.3 లక్షల విలువ చేసే గుట్కాలు పట్టుకున్నారు. అలాగే శ్రీకాకుళం(ఆముదాలవలస) స్టేషన్, టెక్కలి, రాజాం, టెక్కలి రైల్వే స్టేషన్, పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో సుమారు రూ.5 లక్షల విలువల చేసే గుట్కాలు పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు.
ఈ అక్రమ రవాణపై విజిలెన్స్ అధికారులు కూడా ఎప్పటికప్పడు తనిఖీలు నిర్వహిస్తున్నా.. పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. టెక్కలి రైల్వేస్టేషన్ గుణుపూర్, ఒడిశా ప్రాంతాల నుంచి రవాణాకు అనుకూలంగా ఉండడంతో ఈ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.
దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన లక్షలాది రూపాయలను సుకాన్ని చెల్లించకుండా వ్యాపారులు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎనెన్నో రాయితీలు పొందుతూ చెల్లించాల్సిన పన్నులు దిగమింగి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు.
వాస్తవానికి వీరు విలువ ఆధారిత ఎక్స్‌జ్ సుంకం(వ్యాట్), కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్‌డీటీ), జీఎస్‌టీ తదితర పన్నులు, సుంకాలు చెల్లించాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల నిబంధనలను అనుసరించి వీటిలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి.
పలాస, టెక్కలి రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు, అధికారుల తాకిడి ఎక్కువగా ఉండడంతో గుట్కాల అక్రమ వ్యాపారదారులు తిలారు స్టేషన్ అనుకూలంగా మార్చుకున్నారు.
దీంతో బుడితి, నరసన్నపేట, కోటబొమ్మాళి, టెక్కలి వ్యాపారులు సిండికేటుగా మారి దేశంలో వివిధ ప్రాంతాలు నుంచి ఈ అక్రమ దిగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. తిలారు స్టేష్‌న్ నుంచి ఆగే రైలు నుంచి చడీచప్పుడు కాకుండా సరుకులు ఆయా ప్రాంతాలకు తరలించడం అక్రమ లావాదేవీలపై అనుమానాలకు బలం చేకూరుస్తుంది.
ఎక్కడికైనా రవాణా!
ఈ ఆక్రమ వ్యాపారం వెనుక భారీ నెట్ వర్క్ నడుస్తోంది. ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కలకత్తా, ఒడిశాలో ఉన్న దళారులు నుంచి అక్రమంగా మన రాష్ట్రలోకి చేరుతుందని నరసన్నపేటకు చెందిన ఓ మాజీ వ్యాపారి తెలిపాడు.
ఇలా తిలారుకు చేరిన కంచు, ఇత్తడి, గుట్కాలు, బట్టల మూటలు వేర్వేరు ప్రాంతాల్లో నిల్వ ఉంచుతారు. స్టాక్ పాయింట్లకు చేరిన సరుకులను ఇక్కడి వ్యాపారులు వారికి అనుకూలంగా ఉన్న వివిధ వాహనాలు ద్వారా గమ్య స్థానాలకు చేర్చుకుంటారు.
దీనికి మాత్రం ఆయా వ్యాపారులు సరుకులు తెచ్చేందుకు పెట్టిన పెట్టుబడులు ప్రకారం తీసుక వెళ్తారు. ఇక తిలారు స్టేషన్‌లో రాత్రి సమయంలో 7 నుంచి 10 వరకూ ఆటోల వరకు వీటి తరలింపులకు సిద్ధంగా ఉంచుతారు.
భారీ నెట్‌వర్క్
రైలు నుంచి సరుకులు ఆటోలో చేర్చేందుకు బుడితి, సారవకోట వెళ్లాలంటే జోనంకి, కృష్ణాపురం మీదుగా అడ్డదారిలో చేర వేస్తారు. అలాగే తిలారు స్టేషన్ వెనుక భాగం వైపుగా ఎఫ్‌సీ గొడౌన్ నుంచి రావిపాడు, ఏనేటి కొత్తూరు మీదుగా నరసన్నపేట తరలిస్తారు.
ఇక టెక్కలి, కోటబొమ్మాళి ప్రాంతాలకు రావిపాడు, తుంబయ్యపేట, రామినాయడుపేట, నిమ్మాడ మీదుగా రవాణా చేస్తారు. దీనికి ముందుగా ద్విచక్ర వాహనాలపై వెళ్లి జన సంచారం, తనిఖీలు లేవని నిర్ధారించిన తరువాత మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకున్న తరువాతే ఈ తతంగం పూర్తి చేస్తారు.
ఈ విషయమై రైల్వే సిబ్బందిని ప్రశ్నించగా.. రైలు బండిని నుంచి వచ్చిన సరుకులకు ఉన్న రశీదులు మాత్రమే చూస్తామని, తరువాత వారికి పార్శిల్ అప్పచెబుతామని, ఈ అక్రమ రవాణా విషయం తమ పరిధిలోకి రాదని తేల్చి చెబుతున్నారు.
దీనిపై నరసన్నపేట డిప్యూటీ సీటీఓ అనసూయ వివరణ కోరగా.. గుట్కాలు విక్రయాలు తమ పరిధిలోకి రావని తెలిపారు. అవి దొరికినా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగిస్తామని స్పష్టంచేశారు. బట్టలు, ఇతర వ్యాపార సామగ్రిపై తినిఖీలు నిర్వహించి పట్టుబడితే అపరాధ రుసుం విధిస్తామని పేర్కొన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తనిఖీలు ఒకటి రెండు రోజుల్లో ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment