స్వాధీనం చేసుకున్న వస్తువులను తీసుకెళ్తున్న పోలీసు సిబ్బంది
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగు రోడ్డు సమీపంలో వెలుగుచూసిన ఐదు మృతదేహాల ఉదంతం వెనుక రెండోరోజు కూడా మిస్టరీ వీడలేదు. ఈ ఘటనపై సైబరాబాద్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మీర్జాగూడ శివారు ఇంద్రారెడ్డి కంచెలో లభ్యమైన మూడు మృతదేహాలతోపాటు కారులో లభించిన బాలుడి మృతదేహంపై ప్రభాకర్ రెడ్డి వేలిముద్రలు ఉన్నట్టు క్లూస్‌టీమ్ ధ్రువీకరించినట్టు తెలిసింది. ఘటనాస్థలిలో లభించిన వాటర్ బాటిల్స్‌తోపాటు థమ్సప్ బాటిళ్లపైనా అతడి వేలిముద్రలు ఉన్నట్టు గుర్తించారు. ‘‘వాటర్ బాటిళ్లు, థమ్సప్‌లో విషం కలపడం వల్లే అది సేవించిన ప్రభాకర్ రెడ్డి భార్య మాధవి, ఆయన పిన్ని లక్ష్మి, ఆమె కుమార్తె సింధుజ చనిపోయారు. దీంతో ప్రభాకర్‌రెడ్డి కారును ఆపి రోడ్డుపక్కనే ఉన్న పొదల్లో వారిని పడేశాడు.
ఘటనా స్థలిలో పాదముద్రలు కూడా ఒకరికి మించి ఎక్కువ లేవు. ఆ తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో ఓఆర్‌ఆర్ అండర్‌పాస్ బ్రిడ్జ్ కింద కారులో చనిపోయి పడి ఉన్న వశిష్ట్ రెడ్డి మృతదేహంపై కూడా ప్రభాకర్ రెడ్డి వేలిముద్రలు ఉన్నట్టుగా తేల్చారు. కారులో లభించిన వాటర్‌బాటిళ్లపై కూడా అతడి వేలిముద్రలు ఉన్నాయి’’ అని సైబరాబాద్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నలుగురికి విషమిచ్చి, వారు చనిపోయాక ప్రభాకర్‌రెడ్డి కూడా విషం తాగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు రామచంద్రాపురం మండలం అశోక్‌నగర్‌లో ప్రభాకర్ రెడ్డి అద్దెకు ఉన్న ఇంట్లో పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. ల్యాప్‌టాప్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
మృతురాలు లక్ష్మి తన భర్త రవీందర్‌రెడ్డికి తెలియకుండా ఇతరుల నుంచి రూ.80 లక్షలు తీసుకొని ప్రభాకర్‌రెడ్డికి ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలిలోని ఇండియా ఇన్ఫోలైఫ్ బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన స్టాక్ మార్కెట్ లావాదేవీలపైనా ఆరా తీశారు. అతడి డీమ్యాట్ ఖాతాను సీజ్ చేయాలంటూ బ్యాంక్‌కు నోటీసులు జారీచేశారు. ప్రభాకర్‌రెడ్డి బాబాయి కొండాపురం రవీందర్‌రెడ్డి నివాసానికి కూడా నార్సింగి పోలీసులు వెళ్లినట్లు తెలిసింది. కాగా, ప్రభాకర్ రెడ్డి వద్ద స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టామంటూ కొందరు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యను కలిశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
స్థానికంగా వివాదాలు లేవు..
రెండేళ్లుగా ఇంట్లో అద్దెకు ఉంటున్నా.. ప్రభాకర్‌రెడ్డి ఎన్నడూ ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల్లో ఉన్నట్లు కనిపించలేదని ఇంటి యజమాని పేర్కొన్నారు. అప్పుడప్పుడూ తల్లిదండ్రులు, ఒకరిద్దరు సమీప బంధువులు మాత్రమే వచ్చేవారని.. మిత్రులు కూడా పరిమితంగానే వచ్చేవారని వెల్లడించారు. రవీందర్‌రెడ్డి కుటుంబంతో మాత్రం ప్రభాకర్‌రెడ్డి సన్నిహితంగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment