హత్యకు గురైన శంకర్
కోర్టులు కన్నెర్ర చేసినా, హెచ్చరికలు ఇచ్చినా, ఉరి శిక్షలు విధించినా రాష్ట్రంలో పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. తిరునల్వేలి జిల్లా వీరనల్లూరులో పరువు హత్య చోటు చేసుకుంది. తన ప్రియుడ్ని కిరాతకంగా కుటుంబీకులు హతమార్చిన సమాచారంతోప్రియురాలు మనో వేదనతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనఇరు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతను రేపింది.
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఇటీవల కులాంతర ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారితీస్తున్న విషయం తెలిసిందే. పెద్దల పరువుకు, కుల చిచ్చుకు ఎందరో యువతీ, యువకులు హత్యలకు గురయ్యారు. కొన్ని వెలుగులోకి రాగా, మరికొన్నింటిని చాప కింద నీరులా తొక్కేస్తున్నారు. ఇటీవల కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్నందుకు, ధర్మపురిలో ఇలవరసన్, ఓమలూరులో గోకుల్ రాజ్, ఉడుమలైలో శంకర్.. ఇలా ఎందరో అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. అలాగే, తిరునల్వేలిలో తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడ్ని మాయ మాటలు చెప్పి ఇంటికి పిలిపించి మరీ ఓ కుటుంబం దారుణంగా కడతేర్చింది. ఈ పరువుహత్యలను మద్రాసు హైకోర్టు సైతం తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. పరువు హత్యల కట్టడి లక్ష్యంగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చే రీతిలో ఆదేశాల్ని హైకోర్టు ఇచ్చింది. అలాగే, కొన్ని పరువు హత్యలపై కన్నెర్ర చేస్తూ నిందితులకు ఉరిశిక్షలు సైతం విధించింది. అయినా, హత్యల పరంపర మాత్రం ఆగడం లేదు. గత వారం కృష్ణగిరి జిల్లా çహొసూరులో పరువు హత్య జరగ్గా, ప్రస్తుతం తిరునల్వేలిలో మరో పరువు హత్యచోటు చేసుకుంది.
మూడేళ్లుగా ప్రేమ
వీరనల్లూరు వెల్లకులి గ్రామానికి చెందిన ఇసక్కి శంకర్ కలకాడులోని సహకార బ్యాంక్‌లో ఉద్యోగి. వెల్లకులికి చెందిన దళవాయి కుమార్తె సత్యభామ(21) ప్రేమలో పడ్డాడు. కొంత కాలం ఆమె చుట్టూ తిరిగి, ప్రేమను గెలిచారు. ఈ ఇదరివీ వేర్వేరు కులాలైనా, ఈ జంట మాత్రం తాము ఒక్కటే అన్నట్టుగా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. మూడేళ్లుగా సాగుతూ వచ్చిన ఈ ప్రేమ వ్యవహారం దీపావళి సందర్భంగా ఇంటి పెద్దల చెవిన పడింది. బీకాం మూడో సంవత్సరం చదువుతున్న సత్యభామను కాలేజీకి పంపించకుండా కుటుంబీకులు ఇంటికి పరిమితం చేశారు. దీంతో ప్రేమికుల మధ్య దూరం ఏర్పడింది. పెద్దల్ని ఎదిరించి ఈ జంటపెళ్లికి సిద్ధ పడింది. ఇది గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. శంకర్ కుటుంబీకులు సత్యభామను తమ కోడలుగా చేసుకునేందుకు సిద్ధపడ్డా, దళవాయి మాత్రం శంకర్‌ను అల్లుడిగా చేసుకునేందుకు అంగీకరించలేదు.
ఇరు కుటుంబాల మధ్య ఈ ప్రేమ జంట కారణంగా గొడవలు జరగడంతో వ్యవహారం గ్రామ పంచాయతీ పెద్దలకు చేరింది. ఇరు కుటుంబాలతో పెద్దలు మాట్లాడారు. అయితే, శంకర్‌కు ఉద్యోగం ఉన్న దృష్ట్యా, ఆలోచించాలని దళవాయికి పెద్దలు హితబోధ చేశారు. కులం వేరు కావడంతో తొలుత దళవాయి నిరాకరించాడు. చివరకు గ్రామ పెద్దల హిత బోధతో మెట్టుదిగాడు. అయితే, తన కుమార్తె చదువు పూర్తయ్యాకే వివాహం అంటూ అందర్నీ నమ్మ బలికి పెద్దల పంచాయితీని సుఖాంతం చేశాడు.
మరణంలో ఏకమయ్యారు
తండ్రి మాటల్ని నమ్మిన సత్యభామ రోజు కళాశాలకు వెళ్లి వచ్చేది. అయితే, తనలోని కుల గజ్జి దళవాయిని వీడలేదు. పథకం ప్రకారం శంకర్‌ను మట్టుబెట్టేందుకు సిద్ధం అయ్యాడు. తన సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకుల్ని ఏకం చేశాడు. వారు పథకం ప్రకారం మంగళవారం శంకర్‌ను మట్టుబెట్టేందుకు సిద్ధం అయ్యారు. ప్రతిరోజు పని ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో శంకర్‌కు తామరభరణి నదిలో స్నానం చేసే అలవాటు ఉండడంతో పథకాన్ని అక్కడే అమలుచేయడానికి సిద్ధం అయ్యారు. శంకర్ స్నానం చేయడానికి సిద్ధం అవుతున్న సమయంలో చుట్టుముట్టిన ఆ కిరాతకులు కత్తులు, వేట కొడవళ్లతో నరికి చంపేశారు. శంకర్ మరణించాడని ధ్రువీకరించుకుని అక్కడి నుంచి ఉడాయించారు. రాత్రి పది గంటల సమయంలో శంకర్ మృతదేహం నదీ తీరంలో పడి ఉన్న సమాచారం వీర నల్లూరు, వెల్లంకులి పరిసరాల్లో ఉద్రిక్తతకు దారితీసింది.
పథకం ప్రకారం దళవాయి కుటుంబం శంకర్‌ను హతమార్చిందన్న ఆగ్రహంతో రెండు సామాజికవర్గాల మధ్య వివాదం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ రెండు గ్రామాల్లో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. దళవాయి ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. అయితే, ప్రేమించిన వాడిని తన కుటుంబం మట్టుబెట్టడంతో సత్యభామ తీవ్ర మనోవేదనకు గురైంది. రాత్రి తన గదిలో దుప్పట్టాతో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయాన్నే గది నుంచి సత్యభామ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు తలుపులు పగులగొట్టి చూడగా ఉరిపోసుకుని వేలాడుతున్న మృతదేహం బయటపడింది. ఆ కుటుంబం కన్నీటి పర్యంతం అయింది. సమాచారం అందుకున్న తిరునల్వేలి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటన మీద విచారణ చేపట్టారు. సత్యభామ ఆత్మహత్య చేసుకుందా? లేదా, కుటుంబీకులు హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే పనిలో పడ్డారా..? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment