వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం
హైదరాబాద్: పట్టపగలు.. జనసమ్మర్ద ప్రాంతం.. ఆ పక్కనే జాతీయ రహదారిపై వాహనాల రద్దీ.. అయినా దొంగలు అదురూబెదురూ లేకుండా చేతివాటం ప్రదర్శించారు. భారీ చోరీకి తెగబడ్డారు. పక్కా ప్రణాళికతో భారీ నగదు కాజేశారు. కాపలాదారు కన్నుగప్పి సేఫ్‌గార్డ్ సంస్థకు చెందిన వాహనంలోంచి రూ.58.97 లక్షలున్న నగదు పెట్టెను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మంగళవారం నగర శివారులోని వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద చోటు చేసుకుంది.
పోలీసులు విడుదల చేసిన అనుమానితుల చిత్రాలు
డబ్బులు పడిపోయాయని నమ్మించి..
యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు జమచేయడానికి బేగంపేటకు చెందిన వైటర్ సేఫ్ గార్డ్ సంస్థకు చెందిన వాహనం నగదుతో మంగళవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరింది. మొదట అబిడ్స్, ఉస్మాన్‌గంజ్, దిల్‌సుఖ్‌నగర్‌లలో ఉన్న ఏటీఎంలలో నగదు జమ చేసి ఉదయం 10.20 గంటలకు విజయవాడ జాతీయ రహదారి పక్కనున్న వనస్థలిపురం పనామా చౌరస్తాకు చేరుకుంది. వాహనంలో నుంచి 3 లక్షల రూపాయలను యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో జమ చేయడానికి కస్టోడియన్స్ మహ్మద్ థా, విజయ్‌లు లోనికి వెళ్లారు. డ్రైవర్ సత్తికుమార్ వాహనం దిగి పక్కకు వెళ్లగా, వాహనంలోనే సెక్యూరిటీ గార్డు నాగేందర్ కూర్చున్నాడు.
ఈ వాహనం నుంచే నగదు పెట్టెను కొట్టేశారు..
ఏటీఎం నుంచి నగదు ఉన్న వాహనం వరకు వంద రూపాయల నోట్లు కింద పడిపోయి ఉన్నాయని ఓ గుర్తు తెలియనివ్యక్తి వచ్చి నాగేందర్‌కు చెప్పి దృష్టి మళ్లించాడు. దీంతో నాగేందర్ వాహనం దిగి డబ్బులను ఏరుకుంటూ ముందుకు వెళ్లాడు. వెంటనే గుర్తు తెలియనివ్యక్తి వాహనంలోకి చొరబడి అందులో ఉన్న నగదు పెట్టెను రెప్పపాటులో తీసుకుని రోడ్డు దాటి ప్యాసింజర్ ఆటో ఎక్కి పరారయ్యాడు. ఆ పెట్టెలో రూ.58.97 లక్షల నగదు ఉంది. అనుమానం వచ్చిన సెక్యూరిటీగార్డు వెంటనే వెనక్కి వచ్చి వాహనంలోకి వెళ్లి చూసేసరికి నగదు పెట్టె కనిపించలేదు. చోరీ జరిగిన విషయమై సెక్యూరిటీగార్డు, కస్టోడియన్స్ వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు.
సీసీటీవీ ఫుటేజీ పరిశీలన
రాచకొండ జాయింట్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, ఎల్‌బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, క్రైం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, సీఐ వెంకటయ్య సంఘటనాస్థలాన్ని సందర్శించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నగదు ఎత్తుకెళ్లిన దొంగల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇది అంతర్రాష్ట ముఠా పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పనామా చౌరస్తా నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపునకు వెళ్లిన ప్యాసింజర్ ఆటోను సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అయితే ప్యాసింజర్ ఆటోలో మరో నలుగురు ఉండటంతో ఈ దొంగతనంలో వారి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్యూరిటీ, బ్యాంక్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టోడియన్ మహ్మద్‌థా ఫిర్యాదు మేరకు పోలీçసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment