మల్లికాంబ (ఫైల్) యాదగిరి (నిందితుడు)
వర్ధన్నపేట: కుటుంబ కలహాలు, అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి హత్యచేసిన ఘటన శుక్రవారం తెల్లవారు జామున వరంగల్ రూరల్‌జిల్లా వర్ధన్నపేట మండలంలోని కట్య్రాల గ్రామంలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎస్సై బండారి సంపత్ కథనం ప్రకారం మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన చెవ్వల యాదగిరికి రాయపర్తి మండలం కొత్తూరుకు చెందిన మల్లికాంబ(43)తో 23 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. 12 సంవత్సరాల పాటు దాంపత్య జీవితం సజావుగానే సాగింది.
వీరికి ప్రవీణ్, ప్రశాంత్ కుమారులు సంతానం కలిగారు. వ్యవసాయ భూమి అమ్మే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్య మాట వినకుండా భూమిని యాదగిరి అమ్మడంతో మల్లికాంబ కుమారులతో పుట్టింటికి వెళ్లింది. యాదగిరి న్యాయస్థానం ద్వారా విడాకులు కోరడంతో మల్లికాంబ తాను, తన పిల్లల జీవనాధారానికి మేయింటెనెన్స్ కేసు వేసింది. కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. పిల్లలు పెళ్లికి ఎదిగారు. తల్లితండ్రులు కలిసి ఉంటే అమ్మాయిని ఇస్తారు అని పెద్ద మనుషులు అనడంతో యాదగిరి మల్లికాంబను నమ్మించి పెద్ద మనుషుల సమక్షంలో తాము సఖ్యతగా ఉంటామని ఒప్పందం చేసుకుని ఈ నెల 16న మల్లికాంబను, కుమారులు ప్రవీణ్, ప్రశాంత్‌లను తీసుకుని వచ్చాడు.
ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం వెళ్లాడు. నిద్రిస్తున్న మల్లికాంబ మెడపై శుక్రవారం తెల్లవారుజామున యాదగిరి గొడ్డలితో దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి సోదరుడు చిక్క నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బండారి సంపత్ తెలిపారు. ఈ ఘటన సమాచారం అందగానే వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్, సీఐ ముస్క శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పలువురిని విచారణ చేశారు. నగరం నుంచి క్లూస్ టీంను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment