
సాక్షి, చేబ్రోలు: మద్యం కుటుంబాలను నాశనం చేస్తోందని చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. రోజు మద్యం తాగి భర్త పెడుతున్న వేధింపులను భరించలేని ఓభార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిని సంఘటన గుంటూరు జిల్లా, చేబ్రోలులో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే తెనాలి రూరల్ మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన కుమ్మరపల్లి గోపి(25) మంచాల గ్రామ సమీపంలో ఉన్న లక్ష్మీ గణేష్ ఫిల్లింగ్ సెంటర్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
గోపి మోపర్రు గ్రామానికి చెందిన మోనికను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. మద్యం సేవించి భార్యను వేధింపులకు గురిచేస్తుండటంతో ఆమె మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లి పోయింది. భార్య కాపురానికి తిరిగి రావడం లేదని గోపి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిని తల్లి రంగమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.బాబురావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.