chebrolu
-
తెలుగు తేజం రమాదేవి...
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 25 మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో ఒకే ఒక్క మహిళ ఉన్నారు! ఆమె తెలుగువారు కావడం విశేషం. ఆమే వి.ఎస్.రమాదేవి. అయితే ఆమె కేవలం 16 రోజులే ఆ పదవిలో కొనసాగారు. ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందిన రమాదేవి సివిల్ సర్వెంట్‌గా కేంద్రంలో పలు శాఖల్లో పని చేసి సత్తా చాటారు. కేంద్ర న్యాయ శాఖ స్పెషల్ సెక్రటరీగా, లా కమిషన్ మెంబర్ సెక్రటరీగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పలు హోదాల్లో పని చేశారు. అనంతరం 1990 నవంబర్ 26న 9వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 16 రోజుల అనంతరం డిసెంబర్ 11న రిటైరయ్యారు. ఆమెకు ముందు గానీ, తర్వాత గానీ మరో మహిళ సీఈసీ కాలేదు. అలా ఏకైక మహిళా సీఈసీగా రమాదేవి రికార్డు నెలకొల్పారు. పదవీ విరమణ తర్వాత ఆమె హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక గవర్నర్‌గా చేశారు. కర్ణాటకకు తొలి మహిళా గవర్నర్ కూడా రికార్డు నెలకొల్పారు. ► కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు రెండో సీఈసీ కె.వి.కె.సుందరానిది. ఆయన 8 ఏళ్ల 284 రోజులు పదవిలో కొనసాగారు. ► ఆ తర్వాతి స్థానంలో తొలి సీఈసీ సుకుమార్ సేన్ ఉన్నారు. ఆయన 8 ఏళ్ల 273 రోజులు పదవిలో ఉన్నారు. -
ఇంటర్ విద్యార్థినితో ప్రేమ.. మరో యువతితో పెళ్లి.. వివాహం రోజే!
సాక్షి, గుంటూరు: పెళ్లి పందిరి నిరసనలకు వేదికగా మారింది. పెళ్లి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయటంతో వివాహం రద్దు అయ్యింది. కట్నం కింద ఇచ్చిన నగదు ఇవ్వాలని వధువు కుటుంబసభ్యులు, బంధువులు పట్టుబట్టడంతో వివాదం జరిగింది. పెళ్లి కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ ముట్లూరు రోడ్డులో బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సంఘటన చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెంలో సోమవారం చోటుచేసుకుంది. చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎం పవన్‌కుమార్‌కు చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం అయింది. కట్నం కింద కొంత డబ్బులు ఇచ్చారు. సోమవారం వివాహం జరగాల్సి ఉంది. పవన్‌కుమార్ ఇదేప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమించాడు. వీరి వివాహానికి యువకుని తల్లిదండ్రులు నిరాకరించారు. సోమవారం వివాహం జరుగుతుందని తెలిసిన ప్రేమికురాలు పవన్‌ను నిలదీసింది. మూడు రోజుల కిందట కళాశాల వద్దకు వస్తానని చెప్పిన యువకుడు రాకపోవటంతో మనస్థాపానికి చెందిన యువతి కళాశాల రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గాయాలతో బయటపడిన విద్యార్థిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. మోసం చేసిన పవన్‌కుమార్‌ను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పెళ్లి రద్దు అయ్యింది. విషయం తెలుసుకున్న పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులు సోమవారం మధ్యా హ్నం పాతరెడ్డిపాలెం వచ్చారు. కట్నం కింద ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని, ఆడపిల్లకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక ముట్లూరు రోడ్డులో ఎండలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలకు చెందిన వారితో మాట్లాడి పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులు ఇచ్చిన డబ్బులు చెల్లించటానికి అంగీకరించటంతో సమస్య పరిష్కారమైంది. ఎస్ఐ వై సత్యనారాయణ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. చదవండి: దొంగనోట్లు మారుస్తూ పట్టుబడిన భార్యాభర్తలు -
వైఎస్సార్సీపీ సవాల్,తోక ముడిచి పారిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
-
తీగ లాగితే ‘రెవెన్యూ’ డొంక కదులుతోంది
సాక్షి, గుంటూరు(చేబ్రోలు): ప్రభుత్వం పారదర్శకంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే కొంత మంది అవినీతి అధికారుల కారణంగా చెడ్డపేరు వస్తోంది. చేబ్రోలు తహసీల్దారు కార్యాలయ అధికారి, సిబ్బంది చేతివాటంపై తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా రెండు రోజులుగా చేబ్రోలులో విచారణ చేపట్టారు. ఈ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి ఈ నెల 3వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంతో 4వ తేదీన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ చేబ్రోలు తహసీల్దారు బీపీ ప్రభాకర్‌ను సస్పెండ్ చేశారు. చేబ్రోలు తహసీల్దారుగా పనిచేస్తున్న బీపీ ప్రభాకర్ మహిళా వలంటీర్‌ని రాత్రి సమయంలో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడం, ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు, భూములు ఆన్లైన్ నమోదులో అక్రమాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తహసీల్దారును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణకు తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా నలుగురు తహసీల్దార్లు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో జరిపిన రికార్డుల పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ►రెవెన్యూ నిబంధనల ప్రకారం క్వారీ గోతులకు సాగు భూములుగా అనుమతులు ఇవ్వకూడదు. సస్పెండ్ అధికారి మాత్రం చేబ్రోలు, వడ్లమూడి, సుద్దపల్లి గ్రామాల్లో 80ఎకరాల్లోని క్వారీ భూములకు సాగు భూములుగా ఆన్లైన్లో నమోదు చేసి వాటికి పాసు పుస్తకాలను కూడా అందజేసి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. సుద్దపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 135,136, 139లలో ఆవుల హరిబాబు, ఝాన్సీ, నవీన్, సుబ్బారావు, సువేందుల కుటుంబానికి చెందిన 60 ఎకరాల భూమి దశాబ్ద కాలం క్రితమే క్వారీంయింగ్ జరిగి గోతులుగా ఉన్న భూమికి సస్పెండ్ అయిన రెవెన్యూ అ«ధికారి లక్షలాది రూపాయిలు జేబులో వేసుకొని కొద్ది నెలల క్రితం పాసుపుస్తకాలు అందజేసి ఆన్లైన్లో నమోదు చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేశారు... ►చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేసి తమ ఘనతను చాటుకున్నారు. వడ్లమూడి గ్రామంలోని సర్వే నెంబరు 345/7లో 96 సెంట్ల భూమి రైతు పేరున ఉంది. దాని పక్కనే ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని కలిపి 1.96 ఎకరాల భూమిని ఆన్లైన్లో ఆ రైతు పేరున నమోదు చేయటం వెనుక లక్షల రూపాయిల సొమ్మును స్థానిక ఆర్ఐ, వీఆర్వో, కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతో సస్పెండ్ అధికారి పూర్తి చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ►చేబ్రోలులోని సర్వే నంబరు 709లో ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో గత 20 ఏళ్లుగా పాసుపుస్తకం జారీకి నోచుకోలేదు. సస్పెండ్ అధికారితో పాటు అతడి అనుచరులు కలిపి పక్కాగా ఆన్లైన్లో నమోదు చేసి పాసుపుస్తకాన్ని అందజేయటంతో లక్షల రూపాయిలు స్వాహా చేసినట్లు సమాచారం. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను పక్కదారి పట్టించిన సస్పెండ్ అధికారి అతడి సోదరుడు, అతడి ముఖ్య అనుచరులపై విచారణ జరిపి వారిని కూడా సస్పెండ్ చేసి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఇళ్ల స్థలాల పంపిణీలో రెవెన్యూ అధికారి లీలలు.. చేబ్రోలు, కొత్తరెడ్డిపాలెం, వేజండ్ల గ్రామాల్లో రెవెన్యూ అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు స్థానికులు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో కూడా వివిధ గ్రామాల నుంచి తహసీల్దారుపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దీనిపై ఎమ్మెల్యే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. నారాకోడూరు మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయించి ఎటువంటి విచారణ లేకుండా ఇళ్ల స్థలాలు అందజేసినట్లు గుర్తించారు. తహసీల్దారు 150 మంది వరకు అనర్హులకు ఇళ్ల పట్టాలు, పది నుంచి 20 వేలు వరకు డబ్బులు తీసుకొని అందజేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల విచారణలో కూడా వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. -
సోనూసూద్ చిత్రం.. 12 వరల్డ్ రికార్డులు
చేబ్రోలు (పొన్నూరు): గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్ లారా ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి దాసరి యశ్వంత్ ఆర్ట్ వర్క్‌లో 12 వరల్డ్ రికార్డులు సాధించాడని కళాశాల ప్రిన్సిపల్ కేపీ కుమార్ వెల్లడించారు. గత నెల 22న తెనాలిలోని శ్రీ చైతన్య స్కూల్ ఆవరణలో ఇండియన్ ఫిల్మ్ యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్ అయిన సోనూసూద్ 2,938.548 అడుగుల చిత్రాన్ని 2 గంటల 57 నిమిషాలలో పూర్తి చేసి ఒకేసారి 12 వరల్డ్ రికార్డులు సాధించాడని పేర్కొన్నారు. వరల్డ్ రికార్డులు అందించే టీం సభ్యులు ఈ చిత్రాన్ని పరిశీలించి, అతి తక్కువ సమయంలో దీనిని పూర్తి చేసినట్లు గుర్తించారన్నారు. ఇందుకు సంబంధించిన వరల్డ్ రికార్డు ధ్రువపత్రాలను ఈ నెల 3వ తేదీన విద్యార్థి యశ్వంత్‌కు అందజేసినట్లు చెప్పారు. రెండు చేతులతోను, రెండు కాళ్లతోను, నోటితోను బొమ్మలు వేయగలడం, 7 అడుగుల చిత్రాన్ని రివర్స్‌లో వేయడం యశ్వంత్ ప్రత్యేకతని తెలిపారు. వరల్డ్ రికార్డులు సాధించిన యశ్వంత్‌ను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు. -
బహు సుందర బ్రహ్మ ఆలయం
సాక్షి, అమరావతి బ్యూరో/తెనాలి: ఆయన సృష్టికర్త. త్రిమూర్తులలో ప్రథమ స్థానం. అయినా బ్రహ్మదేవుడికి పూజలు చేయడం అరుదు. ఆలయాలూ ఉండవు. భృగు మహర్షి శాపం కారణంగానే భూలోకంలో బ్రహ్మ దేవుడికి ఆలయాలు ఉండవని, పూజలు జరగవని పురాణాల ప్రకారం చెబుతారు. అయితే కాశీ, రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు దగ్గర్లోని పుష్కర్‌లో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉన్నాయి. ఇక మూడోది మన రాష్ట్రంలో ఏకైక ఆలయం గుంటూరు జిల్లా చేబ్రోలులో ఉంది. ఇక్కడి చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వరస్వామి ఆలయాన్ని రెండో కాశీగా చెబుతారు. శివలింగం చుట్టూ బ్రహ్మ నాలుగు ముఖాలతో ఉండటంతో ఆలయానికి విచ్చేసిన భక్తులు, ఒకేసారి శివుడిని, బ్రహ్మదేవుడిని దర్శించుకున్న అనుభూతి చెందుతారు. పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్న ప్రదేశం. కోనేరు మధ్యలో ఆలయం ► చేబ్రోలులో బ్రహ్మ ఆలయాన్ని 1817లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు నిర్మించారు. ► పెద్ద కోనేరును తవ్వించి, దాని ఆలయాన్ని నిర్మించి, బ్రహ్మదేవుడిని ప్రతిష్టించారు. ► పద్మాకారంలో ఉండే పానపట్టంపై లింగానికి నాలుగు వైపులా బ్రహ్మ 4 ముఖాలనూ రూపొందించారు. గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉండటం మరో విశేషం. భక్తులు ఎటునుంచైనా స్వామిని దర్శించుకోవచ్చు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలూ నిత్యకృత్యం. బ్రహ్మ దేవుడి ఆలయం చుట్టూ మరెన్నో దేవాలయలున్నాయి. పాపపరిహారం కోసం.. రాజ్యంలో మితిమీరిన దొంగతనాల కట్టడికి, పట్టుబడిన దొంగల తలలు తీయించే చట్టం చేస్తారు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు. సామూహికంగా మనుషులను చంపించిన పాపం తనను పట్టిపీడిస్తుందన్న భావనతో నిష్కృతి కోసం బ్రహ్మదేవుడి ఆలయం నిర్మించాలని తలుస్తారు. పూజార్హత లేని బ్రహ్మకు ఆలయం కట్టిస్తే, ఆ దేవతా మూర్తి దృష్టి పడ్డంతవరకు నాశనమవుతుందని పెద్దలు హెచ్చరిస్తారు. దీనికి నివారణోపాయంగా 4 దిక్కుల్లో శివ–కేశవ ఆలయాలు నిర్మించాలని సూచిస్తారు. బ్రహ్మదేవుణ్ణి లింగాకారంలో మలిచి ఆ దేవుడి దృష్టి బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేశారు. ఆలయానికి ముందు వెనుక శివాలయాలు, రెండు పక్కల వైష్ణవ ఆలయాలు నిర్మించారు. మిగిలిన 4 మూలలా ఇతర దేవతా మూర్తులను ప్రతిష్టించి ఎనిమిది దిక్కులనుంచి బ్రహ్మదేవుని దృష్టిని ముందుకు సాగకుండా అరికట్టారు. ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరుడి ఆలయ నిర్మాణంతో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు మనసు శాంతించిందని చెబుతారు. ఈ ఆలయ ఉత్సవ, దీపారాధన, నైవేద్యాది కైంకర్యాలకు, దేవదాసీలు, భజంత్రీలు, అర్చకులు వగైరాలకు మాన్యాలను ఆయన సమకూర్చారు. దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయం చేబ్రోలులోని ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే ఏకైక బ్రహ్మ ఆలయంగా ప్రసిద్ధి. ఆలయ కట్టడాలు, శివలింగం.. అన్నీ కాకతీయ వాస్తుశైలిని పోలి ఉన్నాయి. నాలుగు వైపుల్నుంచి స్వామిని దర్శించుకొనేలా నిర్మించిన అరుదైన సార్వతోభద్ర ఆలయం ఇది. ఎనిమిది దిక్కుల్లోనూ ఎనిమిది దిక్పాలకులకు దేవాలయాలుండటం మరో ప్రత్యేకత. సృష్టికర్తయిన బ్రహ్మ పేరిట ఆలయాన్ని నిర్మించి, దిక్పాలకుల పర్యవేక్షణలో సత్యలోకాధిపతిని సందర్శించుకోవటం అన్ని పాపాలకు పరిహారమని నాటి జమీందారు నమ్మారు. ఇప్పటికీ పలు రాష్ట్రాల్నుంచి కూడా యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు. – డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, ప్రముఖ స్థపతి -
వీరి జీవనం ‘ప్రత్యేకం’
సాక్షి, అమరావతి బ్యూరో/తెనాలి: రాష్ట్రంలో యూదు జాతీయులు దాదాపు 125 కుటుంబాలున్నట్టు అంచనా. వాటిలో 40 కుటుంబాల వారు గుంటూరు జిల్లా చేబ్రోలు సమీపంలోని కొత్తరెడ్డిపాలెంలో జీవనం సాగిస్తున్నారు. వీరంతా ఎఫ్రాయిమ్ గోత్రీకులు. వీరి పూర్వీకులు తొలుత తెలంగాణ, అమరావతిలో నివసించారు. అయితే బ్రిటిష్ హయాంలో వీరిలో ఒకరికి కొత్తరెడ్డిపాలెం ప్రాంతంలో ఉద్యోగం రావడంతో వీరి మకాం ఇక్కడికి మారింది. ఈ 40 కుటుంబాల్లోని 300 మంది వందల ఏళ్లుగా తెలుగు జన జీవన స్రవంతిలో కలిసి పోయినా తమ మాతృ భాష, ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఏకైక ప్రార్థన మందిరం ఇదే.. ఏపీలో యూదుల ఏకైక ప్రార్థన మందిరం(సమాజ మందిరం) బెనె యాకోబ్ సినగాగె. ఇది 111 ఏళ్లుగా కొత్తరెడ్డిపాలెంలో కొనసాగుతోంది. మందిర నిర్వాహకుడి పేరు సాదోక్ యాకోబి. ఆయనతో పాటు ఏడుగురు పెద్దలుంటారు. వీరు మత ప్రచారం చేయరు. దేవుడి పేరు కూడా ఉచ్ఛరించరు. ప్రతి శనివారం విశ్రాంతి దినం (షబ్బాత్). ఆ రోజు అసలు పనులకు వెళ్లరు. ఆదివారం హెబ్రూ భాషకు సంబంధించిన స్కూలు నడుస్తుంది. హె బ్రూ క్యాలెండర్ ప్రకారం సృష్టి ఆరంభం నుంచి ప్రస్తుతం నడుస్తోంది 5,781 సంవత్సరం. సృష్టి పుట్టిన దినాన్ని కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు. ‘తిషిరి’(సెప్టెంబర్‌లో వస్తుంది) నెలతో వీరి సంవత్సరం ప్రారంభమవుతుంది. పండుగ దినాల్లో యూదులంతా కలుస్తారు. పెద్ద ల ఆధ్వర్యంలో జరిగే వీరి వివాహా ల్లో వరకట్నం ఉండదు. వరుడే ఓలి ఇస్తా రని సమాజ పెద్ద ఇట్స్‌కాక్ చెప్పారు. వీరి ఉనికి అలా తెలిసింది.. బెనె ఎఫ్రాయిమ్ గోత్రాన్ని హెబ్రూలో ‘మగద్దీన్’ అంటారు. వీరిని మట్టుబెట్టేందుకు కుట్ర పన్ని, రెక్కీ నిర్వహించారన్న ఆరోపణలపై భారత ప్రభుత్వం 2004లో లష్కరే తోయిబాకు చెందిన 8 మందిని అరెస్ట్ చేసింది. అప్పుడే ఈ ప్రాంతంలో వీరి ఉనికి బహిర్గతమైంది. ఈ ప్రాంతంలోని ఎక్కువ మంది యూదులు వ్యవసాయ కూలీలు. ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారూ ఉన్నారు. ‘లా ఆఫ్ రిటర్న్’లో తమ వంతు కోసం ఎదురుచూపులు ఇజ్రాయిల్ దేశం తెచ్చిన ‘లా ఆఫ్ రిటర్న్’ జీవోతో ఎక్కడెక్కడో ఉంటున్న యూదు జాతీయులకు మాతృదేశం వెళ్లే అవకాశం లభించింది. మణిపూర్, మిజోరాం నుంచి ‘మనష్’ గోత్రీకులు పెద్దసంఖ్యలో స్వదేశం వెళ్లారు. తమ వంతు కోసం ఇక్కడివారు ఎదురుచూస్తున్నారు. హెబ్రూకు తెలుగుకు సంబంధం.. హెబ్రూ భాషకు తెలుగుకు దగ్గర సంబంధం ఉందని కనుగొన్నా. రెంటికీ సంబంధమున్న, ఒకే అర్థం కలిగిన 300 పదాలను గుర్తించా. మరిన్ని విశేషాలతో త్వరలోనే పుస్తకం తీసుకొస్తా. – షమ్ముయేల్ యాకోబి, మత పరిశోధకుడు -
భాష భద్రం.. ఆచారం శుద్ధం
సంస్కృతి, సంప్రదాయాలు మానవ జీవన స్రవంతిలో భాగాలు. ప్రతి ప్రాంతానికి.. దేశానికి తమకంటూ ప్రత్యేక భాష, ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. వందల ఏళ్ల క్రితం ఇజ్రాయేల్‌లో చోటుచేసుకున్న మారణకాండ నేపథ్యంలో చెల్లాచెదురైన యూదులు ఎన్నో దేశాల్లో తలదాచుకున్నారు. అలా వచ్చిన ఓ సమూహం తెలుగు గడ్డపై జనజీవనంలో కలసిపోయింది. అయితే తమ ఆచారాలు, భాష, సంప్రదాయాలను ఎన్నడూ వీడక ప్రత్యేకత చాటుకుంటోంది. సాక్షి, తెనాలి: బెనె యాకోబ్ సినగాగె (సమాజ మందిరం) ఆంధ్రప్రదేశ్‌లో యూదుల ఏకైక ప్రార్థన మందిరం. చేబ్రోలు సమీపంలోని కొత్తరెడ్డిపాలెంలో నడుస్తోంది. వందల ఏళ్లుగా తెలుగు జనజీవన స్రవంతిలో ఈ యూదులు (ఇజ్రాయేల్ మూలాలు) కలిసిపోయారు. అయితే వారి మాతృభాష, ఆచార వ్యవహారాలను పరిరక్షిస్తున్న ‘సమాజ మందిరం’ నిర్వాహకుడు, ఏడుగురు పెద్దల నాయకత్వంలో అక్కడి 40 కుటుంబాల్లోని 300 మంది యూదులు తమ మూలాలను కాపాడుకుంటూ వస్తున్నారు. చెల్లాచెదురై.. తెలుగు గడ్డకు చేరి క్రీస్తుపూర్వం 772, 445ల్లో టర్కీ, బాబిలోన్ దాడులతో చెల్లాచెదురైన ఇజ్రాయెలీల్లో కొందరు పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జమ్మూకశ్మీర్‌లోకి చేరుకున్నారు. కొందరు ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకొని, తెలంగాణలో స్థిరపడ్డారు. తర్వాత అమరావతి చేరుకుని జీవనం సాగించారు. బ్రిటిష్ హయాంలో ఒకరికి ఉపాధ్యాయ ఉద్యోగం రావడంతో మకాం కొత్తరెడ్డిపాలేనికి మారింది. 1909లో పూరిపాకలో ఆరంభించిన సమాజ మందిరాన్ని, 1991లో రాతిగోడలతో రేకుల షెడ్డుగా పునర్ని ర్మించారు. సిఖ్యా అనే యూదుడు రాజుకు బహూకరించిన దీపస్తంభం నేటికీ అక్కడి మ్యూజియంలో ఉందని, అమరావతిలో తమవారి జీవనానికి అదొక సాక్ష్యమని మందిరం నిర్వాహకుడు సాదోక్ యాకొబి చెప్పారు. 2004లో ప్రపంచానికి వెల్లడైన ఉనికి రాష్ట్రంలో యూదు జాతీయులు మొత్తం 125 కుటుంబాలు జీవనం సాగిస్తున్నట్టు అంచనా. ఎలాంటి ప్రచారం లేకుండా మతాన్ని అనుసరిస్తుంటారు. ప్రభుత్వ రికార్డుల్లో ‘మాదిగ’గా నమోదయ్యారు. బెనె ఎఫ్రాయిమ్ గోత్రాన్ని హిబ్రూలో ‘మగద్దీన్’ అంటారు. ఆ మాటతో వీరిని మాదిగ కులస్తులుగా నమోదు చేశారని చెబుతారు. 2004లోనే కొత్తరెడ్డిపాలెం యూదుల గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో ఇక్కడి యూదులను మట్టుపెట్టేందుకు కుట్రపన్ని, రెక్కీ నిర్వహించారనే ఆరోపణపై ప్రభుత్వం లష్కరేతోయిబాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేసింది. అప్పుడే జిల్లా కలెక్టరు, పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడకు వచ్చి వీరిగురించి తెలుసుకున్నారు. క్రమం తప్పని ఆచార వ్యవహారాలు ఎక్కువమంది వ్యవసాయ కూలీలు. చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వారున్నారు. అందరికీ యూదు పేరు, హిందూ పేరు ఉన్నాయి. ప్రతి శనివారం విశ్రాంతి దినం (షబ్బాత్). పనులకు వెళ్లరు.. దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ గడుపుతారు. ఆదివారం హెబ్రూ భాషా స్కూల్‌ను నడుపుతూ, మాతృభాషను కొనసాగిస్తున్నారు. హెబ్రూ క్యాలెండరు ప్రకారం సృష్టి ఆరంభం నుంచి ఇది 5780 సంవత్సరం. ముఖ్యమైన ఏడు పండుగలను జరుపుకుంటారు. పండుగలన్నింటికీ యూదులంతా కలుస్తారు. ఏడుగురు పెద్దల ఆధ్వర్యంలో జరిగే వివాహాల్లో వరకట్నం ఉండదు. వరుడే ఓలి ఇస్తారని సమాజ పెద్ద ఇట్స్‌కాక్ (ఇస్సాకు) చెప్పారు. లా ఆఫ్ రిటర్న్‌తో ఆశలు ఇజ్రాయేల్ దేశం లా ఆఫ్ రిటర్న్ జీవోతో ఎక్కడెక్కడో ఉంటున్న ఆ జాతీయులకు మాతృదేశం వెళ్లే అవకాశం లభించింది. ఆ అవకాశం కోసం ఇక్కడి యూదులు సైతం ఎదురుచూస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని యూదులను ‘బెయిత్డిన్’ (యూదుల కోర్టు) నిర్ధారిస్తుంది. సంబంధిత దేశం అనుమతితో వారిని ఇజ్రాయేల్‌కు తీసుకెళ్తారు. మణిపూర్, మిజోరం నుంచి ‘మనష్’ గోత్రికులు పెద్దసంఖ్యలో స్వదేశం వెళ్లారు. మచిలీపట్టణం నుంచి సడోక్ యాకోబి సోదరుడు షమ్ముయేల్ యాకొబి బిడ్డలు ఇజ్రాయేల్‌కు వెళ్లారు. మైనారిటీలుగా గుర్తించాలి సర్వమానవ సౌభ్రాతృత్వం హెబ్రూల ఆశయం. వేరు మతాన్ని తప్పుగా ఎంచి, దీనిలోకి రండి అనే దురలవాటు మాకు లేదు. క్రైస్తవులు అని చెప్పి లాభపడటానికి ఇష్టపడం. మైనారిటీలుగా మమ్మల్ని గుర్తించి, ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. అక్కడక్కడా ఉంటున్న మా కుటుంబాలకు ప్రత్యేక కాలనీని ఏర్పాటు చేయాలి. – సాదోక్ యాకొబి, సమాజ మందిరం నిర్వాహకుడు హిబ్రూకు తెలుగుకు సంబంధం మానవులంతా ఒకే రక్తసంబంధీకులు. ఏమీ తేడా లేదు. హిబ్రూ భాషకు తెలుగుకు ఎంతో దగ్గర సంబంధం ఉందని నేను కనుగొన్నా. రెండింటికి సంబంధమున్న, ఒకే అర్థం కలిగిన 300 పదాలను గుర్తించాను. మరిన్ని విశేషాలతో త్వరలోనే పుస్తకం తీసుకురానున్నాను. – షమ్ముయేల్ యాకోబి, భాషా పరిశోధకుడు -
కాపాడరుగానీ.. కాటికి పంపుతారా?
పిఠాపురం: ప్రాణాలు కాపాడాల్సిన వాహనాలను పట్టించుకోరు.. ప్రాణాలు పోయాక శవాలను తరలించడానికి మాత్రం కొత్త వాహనాలు సిద్ధం చేశారు అంటూ సోమవారం తూర్పుగోదావరి జిల్లా చేబ్రోలు వద్ద 216 జాతీయ రహదారిపై జరిగిన ప్రమాద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని టిప్పర్ ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడిన విషయం తెలిసిందే. కొన ఊపిరితో ఉన్న వారిని తరలించేందుకు 108 అంబులెన్స్ కోసం ఫోన్ చేయగా.. అవి ఎంతసేపటికీ రాకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో క్షతగాత్రులను తరలించాల్సి వచ్చింది. క్షతగాత్రులను తరలించడానికి 108 లేక ప్రైవేటు వాహనంలో తరలిస్తున్న పోలీసులు అదే అంబులెన్స్ అయితే సకాలంలో ప్రాథమిక వైద్య సేవలందేవి. ప్రైవేటు వాహనాల్లో తరలించడం వల్ల మార్గంమధ్యలో ఇద్దరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృత్యువాత పడ్డారు. క్షతగాత్రులను కాపాడటానికి 108 అంబులెన్స్‌లు మూడు గంటలు ఆలస్యంగా వచ్చాయి. ఒక్కో అంబులెన్స్‌లో ముగ్గురుని తరలించారు. కానీ, మృతదేహాలను తరలించడానికి మహాప్రస్థానం పేరుతో ఏర్పాటు చేసిన వాహనాలను అధికారులు వెంటనే ఏర్పాటు చేశారు. ఎనిమిది మృత దేహాలను తరలించడానికి నాలుగు మహాప్రస్థాన వాహనాలను సిద్ధం చేశారు. కాపాడటానికి రాని వాహనాలు.. కాటికి పంపడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాయి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి తీరంటూ ప్రశ్నించారు. నిత్యం ప్రాణసంకటమే..! జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రెండు 108 అంబులెన్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకదానిని ప్రమాదాల్లో క్షతగాత్రులను తరలించడానికి ఉపయోగిస్తూ ఉండగా.. మరోదానిని గర్భిణుల కోసం వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతంలో జాతీయ రహదారిని ఆనుకుని ఎక్కువ గ్రామాలు ఉండటంతో నిత్యం ఎక్కడో ఓచోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
చేబ్రోలు ప్రమాదానికి మట్టి మాఫియానే కారణం
-
చేబ్రోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర ప్రమాదం; ఆటో నుజ్జు నుజ్జు
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో పది మంది గాయపడ్డారు. టాటా మ్యాజిక్ ఆటోను టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జయిపోయింది. మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. సంఘటనా స్థలం బీతావహంగా ఉంది. మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు విశాఖపట్నం జిల్లా మాచవరం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కాకినాడలో గృహప్రవేశానికి హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చేబ్రోలు రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
భార్య కాపురానికి రావడంలేదని...
సాక్షి, చేబ్రోలు: మద్యం కుటుంబాలను నాశనం చేస్తోందని చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. రోజు మద్యం తాగి భర్త పెడుతున్న వేధింపులను భరించలేని ఓభార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిని సంఘటన గుంటూరు జిల్లా, చేబ్రోలులో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే తెనాలి రూరల్ మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన కుమ్మరపల్లి గోపి(25) మంచాల గ్రామ సమీపంలో ఉన్న లక్ష్మీ గణేష్ ఫిల్లింగ్ సెంటర్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గోపి మోపర్రు గ్రామానికి చెందిన మోనికను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. మద్యం సేవించి భార్యను వేధింపులకు గురిచేస్తుండటంతో ఆమె మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లి పోయింది. భార్య కాపురానికి తిరిగి రావడం లేదని గోపి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిని తల్లి రంగమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.బాబురావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరులో కలకలం
కాలేజీ విద్యార్థిని అపహరణకు యత్నం గుంటూరు రూరల్: కాలేజీకి వెళ్తున్న విద్యార్థినిని అపహరించేందుకు ప్రయత్నించిన ఘటన శనివారం గుంటూరు నగర శివారులో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. నగరంలోని సంగడిగుంట రెడ్లబజారుకు చెందిన విద్యార్థిని చేబ్రోలు మండలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అదే కాలేజీలో పెదనందిపాడు మండలం కట్ర పాడుకు చెందిన మద్దినేని లోకేశ్చౌదరి బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఆ విద్యార్థిని కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా.. లోకేశ్చౌదరి ఆమెను బెదిరించి బైక్‌పై ఎక్కించుకుని చేబ్రోలు వైపు తీసుకెళ్లాడు. నారా కోడూరు సమీపంలోకి వెళ్లేసరికి ఆ విద్యార్థిని బైక్‌పై నుంచి కిందకు దూకేసింది. స్థానికులు గమనించడంతో లోకేశ్ అక్కడ్నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థినిని గ్రామస్తులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఆదివారం నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే టీడీపీ నాయకులు దాడి చేశారు.. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమపై లోకేష్ చౌదరి బంధువులు, కట్రపాడు టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వారిపై ఫిర్యాదు చేస్తే ఎలా తీసుకుంటారంటూ పోలీ సులను సైతం బెదిరించారని వారు ఆరోపించారు. కాగా, బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ అమీర్ తెలిపారు. -
సంగమేశ్వరుని భూములు స్వాహా!
► సుమారు 79 సెంట్ల పొలం కైంకర్యం ► అధికార పార్టీ నేతల అండతోనే అక్రమార్కుల దందా ఆలయాల నిర్వహణకు పూర్వం ఔదార్యం ఉన్న వారు భూములు ఇచ్చే వారు. వాటిని కౌలు చేసుకునేందుకు వేలం వేయగా వచ్చిన ఆదాయాన్ని నిర్వహణ కమిటీ ధూపదీప నైవేద్యాలకు వినియోగించేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అధికార పార్టీ అండదండలతో రెవెన్యూశాఖ, దేవాదాయశాఖ కుమ్మక్కై అక్రమార్కులకు దేవుళ్ల భూములను కట్టబెడుతున్నాయి. తాజాగా తెనాలి రూరల్ మండలం సంగం జాగర్లమూడి సంగమేశ్వరస్వామి ఆలయ భూమి కూడా అలాగే కైంకర్యం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. – తెనాలి రూరల్ చేబ్రోలు: స్థానిక మండలం వడ్లమూడి పరిధిలో సంగం జాగర్లమూడి సంగమేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన సుమారు 79 సెంట్ల భూమిని కొందరు అధికారులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమి హద్దులు అవే ఉంచి, సర్వేనంబర్ మార్చి నకిలీ పత్రాలు సృష్టించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో రెవెన్యూ, దేవాదాయశాఖ ఈ దారుణానికి ఒడిగట్టునట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వెలుగులోకి ఇలా.. సంగమేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములకు మూడేళ్లకోసారి వేలం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ ఏడాది వడ్లమూడి పరిధిలోని సర్వే నంబర్ 197–3లోని 1.24 ఎకరాలకు, మరో 79 సెంట్ల భూమికి కౌలు వేలం నిర్వహించాల్సి ఉంది. గత నెలలో దేవాదాయ శాఖ అధికారులు బహిరంగ వేలానికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో కేవలం 1.24 ఎకరాలకు గురువారం వేలం నిర్వహిస్తామని ప్రకటించడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి మిగిలిన భూమి ఏమైందని అధికారులను ప్రశ్నించారు. వారినుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. 1.24 ఎకరాలకు కౌలు వేలం పూర్తి.. గురువారం 1.24 ఎకరాలకు సంబంధించిన కౌలు వేలం జరిగింది. మూడేళ్ల క్రితం ఈ భూమిని రూ.18,400కు వేలం పాడుకోగా ఈ సారి చేబ్రోలు మండలం గరువుపాలెంకు చెందిన కస్తూరి పూర్ణచంద్రరావు రూ. 27 వేలకు దక్కించుకున్నారు. 79 సెంట్ల భూమికి ఎందుకు వేలం నిర్వహించలేదని గతంలో వేలం దక్కించుకున్న వ్యక్తి రశీదులు తీసుకొచ్చి మరీ అధికారులను నిలదీసినట్లు తెలుస్తోంది. అయినా దేవాదాయ శాఖ అధికారులు సదరు వ్యక్తి ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. వేరే ఆలయానికి చెందిందేమో..? మా వద్ద ఉన్న రికార్డుల్లో 1.24 ఎకరాల భూమి మాత్రమే దేవస్థానం కింద ఉంది. దానికి మాత్రమే కౌలు నిర్వహించాం. గతంలో వేణుగోపాలస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములనూ కూడా ఒకేసారి వేలం నిర్వహించేవాళ్లు. 79 సెంట్ల భూమి ఆ ఆలయానికి సంబంధించిందై ఉంటుంది. – బొమ్ము శివారెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి. -
‘మహాత్మా మమ్మల్ని క్షమించు’
చేబ్రోలు(గుంటూరు జిల్లా) : దేశ స్వాతంత్యం కోసం అహింసా మార్గంలో పోరాడిన మహనీయుడు మహాత్మాగాంధీ విగ్రహానికి మంగళవారం చేబ్రోలులో అవమానం జరిగింది. చేబ్రోలు రజకపేటలో 2004సం.లో స్థానికులు ప్రత్యేక మండపం నిర్మించి మహాత్ముడు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 50సం.ల క్రితం ఇదే ప్రాంతంలో జాతిపిత విగ్రహం ఉండేది. అది శిథిలావస్థకు చేరడంతో 2004లో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మహాత్ముడి విగ్రహం చేతిని, చేతిలోని కర్రను ద్వంసం చేశారు. ఉదయం విగ్రహాన్ని చూసిన స్థానికులు సంఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. రజకసంఘం నాయకులు డి.వెంకట్రామయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలాన్ని విగ్రహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై లైంగిక దాడి
చేబ్రోలు: ఇంటి ఎదురుగా ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి ఇంటిలో తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ సుభాని తెనాలిలోని జ్యూయలరీ షాపులో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటున్న వారి ఏడేళ్ల బాలిక వద్దకు వెళ్లి షాంపు తీసుకురమ్మని చెప్పాడు. షాంపు తెచ్చిన తర్వాత బాలికను బలవంతంగా తన ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేకలు విన్న బాలిక అన్న అక్కడకు చేరుకునే సమయానికి నిందితుడు పరారయ్యాడు. రక్తస్రావం అయిన బాలికను తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లి, అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసరావు, సీఐ జి.రవికుమార్, ఎస్ఐ కె.ఆరోగ్యరాజు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. -
పెరిగిపోయిన అప్పులు:రైతు ఆత్మహత్య
చేబ్రోలు(గుంటూరు): అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు బలవంతంగా తనువు చాలించాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కే.ఆర్.పాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కె . రోషయ్య(58) తనకున్న ఎకరం పొలంతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సంభ్రమాశ్చర్యం !
►భీమేశ్వరస్వామి ఆలయ తవ్వకాల్లో బయల్పడిన శివలింగం చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం ►నేలమాళిగలు, గుప్తనిధులు కూడా బయటపడ్డాయని ప్రచారం ►మూడు ఆలయాల అభివృద్ధికి రూ.1.45 కోట్లు మంజూరు చేబ్రోలు : ప్రాచీన, చారిత్రక ప్రసిద్ధి గాంచిన చేబ్రోలు భీమేశ్వరస్వామి ఆలయ తవ్వకాల్లో అతి పురాతన శివలింగం బయల్పడడం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. బుధవారం ఉత్తర భాగాన తవ్వకాలు జరుపుతుండగా, సుమారు మూడు అడుగుల ఎత్తు ఉన్న పురాతన శివలింగం వెలుగు చూసింది. భీమేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పైభాగం మాత్రమే కనిపిస్తున్న ఆలయ అభివృద్ధికి తొలిదశలో తవ్వకాలు ప్రారంభించారు. ఈ ఆలయంతోపాటు ఆదికేశవ స్వామి, నాగేశ్వర స్వామి గాలిగోపురం అభివృద్ధికి రూ. కోటీ 45 లక్షల నిధులు మంజూరయ్యాయి. ►బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా శివలింగం బయట పడడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో పాటు నేలమాళిగలు, గుప్తనిధులు కూడా బయటపడ్డాయని ప్రచారం కావటంతో భక్తుల రాక మరింత పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తరలివస్తూనే ఉన్నారు. - తవ్వకాల్లో ఎలాంటి గుప్తనిధులు లభ్యం కాలేదని పురావస్తు శాఖ అధికారులు వెల్లడిచేశారు. శివలింగం ఇక్కడే ఉంచాలా వేరే చోటకు తరలించాలా అనేది ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్ణయిస్తామని పురావస్తుశాఖ డీఈ తెలిపారు. ►ప్రస్తుతం ఆలయం కింద భాగం వరకు సుమారు ఆరు అడుగుల మేర చుట్టూ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. దీని వల్ల ఆలయం కింద భాగం కూడా కనిపించనుంది. ►ఆలయం కింద దక్షిణ భాగంలోని ద్వారం నుంచి మెట్లుపైకి ఎక్కి రెండో అంతస్తులోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకొని ఉత్తరం మెట్లు ద్వారా భక్తులు బయటకు వచ్చే విధంగా పనులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే పరిశీలన ►భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న తవ్వకాలను పొన్నూరు ఎమ్మెల్యే డి.నరేంద్రకుమార్ బుధవారం పరిశీలించారు. పనుల వివరాలను పురావస్తు శాఖ, దేవాదాయశాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో జోసఫ్‌కుమార్ తదితరులు ఉన్నారు. ►పుకార్లు నమ్మవద్దు ... భీమేశ్వరస్వామి దేవస్థానం వద్ద నేలమాళిగలు, గుప్తనిధులు బయట పడ్డాయని వస్తున్న కథనాలు, పుకార్లను నమ్మవద్దు. ఎలాంటి గుప్తనిధులు బయటపడలేదు. ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావటానికి చేస్తున్న కృషిలో భాగంగానే తవ్వకాలు చేపట్టారు. - కోటేశ్వరన్,పురావస్తుశాఖ డీఈ. -
చేబ్రోలులో జంట హత్యలు
ఏలూరు(ప.గో):జిల్లాలోని చేబ్రోలులో సోమవారం ఉదయం చోటుచేసుకున్న జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. కొంతమంది దుండగులు ఇనుపరాడ్లతో దాడి చేసి ఇద్దరు మృతికి కారణమయ్యారు. ఈ ఘటనలో ఒకరు యాచకురాలు పార్వతి కాగా, మరొకరు హైవే పెట్రోలింగ్ వెహికల్ లో కాంట్రాక్ట్ ఉద్యోగి రాజు. ఈ రోజు తెల్లవారుజాము ప్రాంతంలో కొందరు దుండగులు ఆకస్మికంగా దాడి చేసి ఆ ఇద్దర్నీ కొట్టి చంపారు. దీనిపై సమాచారం అందుకున్న డీఎస్పీ సత్తిబాబు ఆ ఘటనా స్థలికి చేరుకున్నారు.ఈ జంట హత్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుంటూరు జిల్లా చేబ్రోలులో విషాదం
-
జగన్ రాకతో సమైక్య పోరు ఉధృతం: బోస్
చేబ్రోలు(ఉంగుటూరు): సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం స్వాతంత్య్ర పోరాటాన్ని తలపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలిత సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 2వ రోజు గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో జరుగుతున్న దీక్ష శిబిరాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆదేశాలతో నౌడు వెంకట రమణ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేయటం అభినందనీయమన్నారు. 175 నియోజకవర్గంలో సమైక్యకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 2వరోజు కూడా దీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. సమైక్య కోసం వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేస్తోందన్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలని సీమాంధ్రులేగాక, తెలంగాణావారు కూడా కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర విభజన తీర్మానాన్ని సీడబ్ల్యూసీ వెంటనే విరమించుకోవాలన్నారు. సొనియా గాంధీ తన కొడుకు ప్రధాని చేయటానికే అన్నదమ్ములుగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టారని వారు విమర్శించారు. జగన్ బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత ఉద్యమం మరింత ఊపందుకుందన్నారు. తెలంగాణాకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖను వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు సమైక్యాంధ్రకు మద్దతుగా వర్షం కూడా లెక్కచేయకుండా దీక్షలు చేయటం అభినందనీయమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు నౌడు వెంకట రమణ మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి జగన్ అన్నారు. -
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
చేబ్రోలు/ క్రోసూరు, న్యూస్‌లైన్ : ఆట విడుపుగా స్నేహితులతో కలసి ఈతకు వెళ్లిన విద్యార్థులు నీటమునిగి మృత్యువాత పడ్డారు. చేబ్రోలు మండలం నారాకోడూరు, క్రోసూరు మండలం గుడిపాడు గ్రామాల్లో మంగళవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళితే.. తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన తోట లోకేష్(16) చేబ్రోలు మండలంలోని నారాకోడూరు సీఎంఎస్ చిల్ట్రన్స్ హోమ్‌లో ఉంటూ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఉపాధ్యాయులు సమ్మెలో ఉన్నప్పటికి పదో తరగతి విద్యార్థులు ట్యూషన్ కోసం హైస్కూల్‌కు వచ్చారు. ఉదయం 10 గంటలకు లోకేష్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నారాకోడూరు నుంచి చేబ్రోలు సమీపంలోని అప్పాపురం ఛానల్లో ఈతకు వెళ్లారు. చెప్పులు, చొక్కా ఒడ్డున పెట్టి కాల్వలోకి దూకిన లోకేష్ నీటిలో మునిగిపోయాడు. బట్టలు ఉతకటానికి వచ్చిన మహిళలు, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు గమనించి కేకలు వేశారు. కొందరు కాలువలో దూకి కాపాడే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. చిల్ట్రన్స్ హోమ్ వార్డెన్ డి.దేవరాజన్ చేబ్రోలు పోలీసుస్టేషన్లో విద్యార్థి గల్లంతయినట్లు పిర్యాదు చేశాడు. పోలీసులు నీటి పారుదలశాఖాధికారులతో మాట్లాడి నీటి ఉధృతిని కొంతమేర తగ్గించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది సేపటి తర్వాత అక్కడికి సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. చేబ్రోలు ఇన్చార్జి ఎస్ఐ పి.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లోకేష్ కుటుంబసభ్యులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. చిల్ట్రన్స్ హోమ్ వార్డెన్ దేవరాజన్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్ కోసం వచ్చి, ఈతకు వెళ్లిన విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించ లేదని, లోకేష్ గల్లంతయ్యాడని తెలిసినప్పటికీ స్పందించి అక్కడికి రాకపోవడంపై విద్యార్థుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడిపాడులో ఆరో తరగతి విద్యార్థి... క్రోసూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన వెలిసెల వెంకట్రావు, మల్లేశ్వరి దంపతుల కుమారుడు వెంకటేశ్వర్లు(11) స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం బడి నుంచి వచ్చాక, స్నేహితులతో కలిసి వాగువద్ద ఈతకు వెళ్లాడు. అక్కడ నుంచి వెళ్లి గాదెవారిపాలెం గ్రామశివారు బావిలో ఈత వేసేందుకు వెళ్లారు. బావిలో ఈత కొట్టడం రాని వెంకటే శ్వర్లు ఊపిరాడక మృతిచెందాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు బావి వద్దకు వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. -
సిటీ బస్సులపై విద్యార్థుల కన్నెర్ర
చేబ్రోలు, న్యూస్‌లైన్: ప్రమాదాలకు కారణమవుతున్న సిటీ బస్సుల రాకపోకలను నిలిపి వేయాలని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్తున్న నలుగురు విద్యార్థులు గురువారం ఉదయం నారాకోడూరు వద్ద సిటీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం విధితమే. దీనిపై ఆగ్రహించిన తోటి విద్యార్థులు శుక్రవారం వడ్లమూడి, నారాకోడూరుల్లో రాస్తారోకో చేసి నిరసన వ్యక్తంచేశారు. ఐదు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. వేజండ్ల అడ్డరోడ్డు వద్ద తెనాలి రహదారిపై తాటాకులు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. వర్సిటీ ఎదురుగా విద్యార్థులు నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థుల మృతికి కారణమైన సిటీ బస్సులను తెనాలి రోడ్డుపై రాకపోకలు సాగించకూడదని, యూనివర్సిటీ ఎదురుగా స్పీడ్ బ్రేకర్లు వేయాలని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో తెనాలి, గుంటూరు వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. చేబ్రోలు సీఐ జి.పూర్ణచంద్రరావు, ఎస్ఐ డి.వినోద్‌కుమార్‌లు విద్యార్థులతో మాట్లాడి శాంత పరిచారు. నారాకోడూరు వద్ద ఏర్పాటు చేసిన బైపాస్ రోడ్డు అలంకార ప్రాయంగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. గుంటూరు, తెనాలి నుంచి వచ్చే వాహనాలను నారాకోడూరు బైపాస్ మీదుగా రాకపోకలు జరిగితే కొంతమేర ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రూ.50 లక్షల వ్యయంతో రెండేళ్ల క్రితం బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసినా నేటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం విమర్శలకు దారి తీస్తోంది.