ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
Published Wed, Sep 4 2013 5:05 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
చేబ్రోలు/ క్రోసూరు, న్యూస్‌లైన్ : ఆట విడుపుగా స్నేహితులతో కలసి ఈతకు వెళ్లిన విద్యార్థులు నీటమునిగి మృత్యువాత పడ్డారు. చేబ్రోలు మండలం నారాకోడూరు, క్రోసూరు మండలం గుడిపాడు గ్రామాల్లో మంగళవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళితే.. తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన తోట లోకేష్(16) చేబ్రోలు మండలంలోని నారాకోడూరు సీఎంఎస్ చిల్ట్రన్స్ హోమ్‌లో ఉంటూ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఉపాధ్యాయులు సమ్మెలో ఉన్నప్పటికి పదో తరగతి విద్యార్థులు ట్యూషన్ కోసం హైస్కూల్‌కు వచ్చారు. ఉదయం 10 గంటలకు లోకేష్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నారాకోడూరు నుంచి చేబ్రోలు సమీపంలోని అప్పాపురం ఛానల్‌లో ఈతకు వెళ్లారు.
చెప్పులు, చొక్కా ఒడ్డున పెట్టి కాల్వలోకి దూకిన లోకేష్ నీటిలో మునిగిపోయాడు. బట్టలు ఉతకటానికి వచ్చిన మహిళలు, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు గమనించి కేకలు వేశారు. కొందరు కాలువలో దూకి కాపాడే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. చిల్ట్రన్స్ హోమ్ వార్డెన్ డి.దేవరాజన్ చేబ్రోలు పోలీసుస్టేషన్‌లో విద్యార్థి గల్లంతయినట్లు పిర్యాదు చేశాడు. పోలీసులు నీటి పారుదలశాఖాధికారులతో మాట్లాడి నీటి ఉధృతిని కొంతమేర తగ్గించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది సేపటి తర్వాత అక్కడికి సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. చేబ్రోలు ఇన్‌చార్జి ఎస్‌ఐ పి.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లోకేష్ కుటుంబసభ్యులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. చిల్ట్రన్స్ హోమ్ వార్డెన్ దేవరాజన్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్ కోసం వచ్చి, ఈతకు వెళ్లిన విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించ లేదని, లోకేష్ గల్లంతయ్యాడని తెలిసినప్పటికీ స్పందించి అక్కడికి రాకపోవడంపై విద్యార్థుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుడిపాడులో ఆరో తరగతి విద్యార్థి...
క్రోసూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన వెలిసెల వెంకట్రావు, మల్లేశ్వరి దంపతుల కుమారుడు వెంకటేశ్వర్లు(11) స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం బడి నుంచి వచ్చాక, స్నేహితులతో కలిసి వాగువద్ద ఈతకు వెళ్లాడు. అక్కడ నుంచి వెళ్లి గాదెవారిపాలెం గ్రామశివారు బావిలో ఈత వేసేందుకు వెళ్లారు. బావిలో ఈత కొట్టడం రాని వెంకటే శ్వర్లు ఊపిరాడక మృతిచెందాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు బావి వద్దకు వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు.
Advertisement