‘స్పందన’.. ప్రజాసంద్రం | Authorities have set up special counters for Spandana Programme | Sakshi
Sakshi News home page

‘స్పందన’.. ప్రజాసంద్రం

Published Tue, Aug 6 2019 4:05 AM | Last Updated on Tue, Aug 6 2019 5:24 AM

Authorities have set up special counters for Spandana Programme - Sakshi

విశాఖ కలెక్టరేట్‌లో జరిగిన ‘స్పందన’లో అర్జీలు ఇచ్చేందుకు బారులు తీరిన ప్రజలు

సాక్షి, నెట్‌వర్క్‌: సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు దరఖాస్తులు అందించేందుకు ‘స్పందన’ కార్యక్రమానికి సోమవారం ప్రజలు భారీగా పోటెత్తారు. ఇళ్ల స్థలాలు, రేషన్‌ కార్డులు, పింఛన్ల మంజూరుతోపాటు భూసమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందించారు. గుంటూరు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘స్పందన’కు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో వారు ఎక్కువసేపు నిరీక్షించకుండా అధికారులు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇంటి స్థలాల కోసం ఏకంగా ఐదు వేల దరఖాస్తులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా గతవారం వరకు 20,763 దరఖాస్తులు రాగా, అందులో 14,671 పరిష్కరించారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 5,941 మంది వినతిపత్రాలు ఇచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గూడు కోసం ఒకరు.. పింఛన్‌ కోసం మరొకరు.. వైద్యసాయం అందించాలని మరికొందరు తరలివస్తున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో మొత్తం 1167 అర్జీలు స్వీకరించారు. విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 1,518 అర్జీలు అధికారులకు అందాయి. 

అక్క భర్త పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు
–  స్పందన కార్యక్రమంలో 14 ఏళ్ల బాలిక ఫిర్యాదు 
పట్నంబజారు (గుంటూరు): ‘నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. నా సోదరి భర్త నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. నన్ను ఉంచుకుంటానంటూ వేధిస్తున్నాడు’ అంటూ గుంటూరు అర్బన్‌ పోలీస్‌ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఓ బాలిక కన్నీరుమున్నీరైంది. బాలిక కథనం మేరకు.. గుంటూరులోని ఒక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తల్లి మరణించడంతో అమ్మమ్మ ఇంట్లో నివాసం ఉంటోంది. గతేడాది నుంచి బాలిక సోదరి షెహనాజ్‌ బేగం భర్త అష్రఫ్‌ అలీ.. బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు అనకూడని మాటలు అంటున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక బాలిక పది రోజులుగా స్కూల్‌కు కూడా వెళ్లడం లేదు. తన తల్లి ఆస్తులపై అతడికి కన్ను ఉందని, అందుకే తనను వేధిస్తున్నాడని, ప్రాణభయం ఉందని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. 

మాజీ ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు
– గుంటూరు రూరల్‌ ఎస్పీకి యువకుడి ఫిర్యాదు
వైఎస్సార్‌ జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే తిరువీధుల జయరాములు వద్ద అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేసినా ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఫోన్‌లు చేసి ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పాలపాటి ఫ్రాన్సిస్‌ సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ ఆర్‌.జయలక్ష్మికి ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం మేరకు.. పిడుగురాళ్ల మున్సిపల్‌ కమిషనర్‌గా జయరాములు పనిచేసే సమయంలో ఆయనతో ఫ్రాన్సిస్‌కు పరిచయం ఏర్పడింది. 2014లో బద్వేలు ఎమ్మెల్యేగా గెలుపొందిన జయరాములు 2015లో పిడుగురాళ్లకు వచ్చినప్పుడు హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజీ హాస్టల్‌లో విద్యార్థుల దుస్తులు శుభ్రం చేసే కాంట్రాక్టు ఇప్పిస్తాననీ, పూర్తిగా సహకరిస్తానని నమ్మించారు. లాండ్రీ షాపు ఏర్పాటుకు డబ్బులు అవసరమై జయరాములు నుంచి రూ.2 లక్షలు ఫ్రాన్సిస్‌ అప్పుగా తీసుకున్నాడు. విడతల వారీగా రూ.1.80 లక్షలు జయరాములుకు తిరిగి చెల్లించాడు. కొద్ది రోజుల తర్వాత తనకు ఇంకా రూ.10 లక్షలు ఇవ్వాలంటూ జయరాములు తన అనుచరులతో ఫోన్‌ చేయిస్తూ డబ్బు ఇవ్వకపోతే చంపుతానని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని ఎస్పీని కోరాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement