Young Woman Ready To Sell Kidney On Youtube Steal Rs 16 Lakhs - Sakshi
Sakshi News home page

కిడ్నీకి రూ.7 కోట్లు ఇస్తామని చెప్పి..

Published Tue, Dec 13 2022 9:30 AM | Last Updated on Tue, Dec 13 2022 11:07 AM

Young Woman Ready To Sell Kidney On Youtube Steal Rs 16 Lakhs - Sakshi

సాక్షి, నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలానికి చెందిన ఓ ఆసామి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని కుమార్తె హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ చదువుతోంది. సోమవారం తన తండ్రితో కలిసి గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయం నిర్వహించిన ‘స్పందన’లో ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ను కలిసింది. కిడ్నీ విక్రయిస్తే రూ.7 కోట్లు ఇస్తామంటూ.. తన నుంచి రూ.16.40 లక్షల మేర వసూలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు తనను మోసగించారంటూ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. తన తండ్రి ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో రూ.20 లక్షలు దాచాడు. తండ్రికి తెలియకుండా ఆ ఖాతాలో ఉన్న సొమ్ములో రూ.2 లక్షలను ఫోన్‌పే ద్వారా సొంతానికి ఖర్చు చేసింది.  

యూట్యూబ్‌ వల వేసి.. 
కాగా, రూ.2 లక్షలు ఖర్చు చేసిన విషయం తండ్రికి తెలిస్తే మందలిస్తాడన్న భయంతో ఆ డబ్బుల్ని తానే సంపాదించి తండ్రికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. డబ్బు సంపాదించే మార్గం కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 26న యూ­ట్యూబ్‌­లో వెదికింది. అందులో కిడ్నీ దానం చేస్తే రూ.7 కోట్లు చెల్లిస్తామనే ప్రకటన ఆమెను ఆకర్షించింది. అందులో ఇచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసి.. ఆన్‌లైన్, వాట్సాప్‌ ద్వారా ఎదుటి వ్యక్తులతో మాట్లాడింది. శస్త్రచికిత్సకు ముందు రూ.3.50 కోట్లు, శస్త్రచికిత్స తరువాత రూ.3.50 కోట్లు చెల్లిస్తామని మోసగాళ్లు ఆ యువతికి చెప్పారు.

పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించాలంటే పన్నుల రూపేణా ముందు­గా నగదు చెల్లించాల్సి వస్తుందన్నారు. తండ్రి పేరుతో చెన్నైలోని ఓ బ్యాంక్‌లో ఖాతా తెరిచి, రూ.3.50 కోట్లు జమ చేసినట్టు ఆమెను నమ్మించారు. ఆ యువతి నుంచి విడతల వారీగా రూ.16.40 లక్షలను ఆన్‌లైన్‌ ద్వారా పంపించింది. ఎంతకీ డబ్బు రాకపోవడంతో తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని కోరింది. సదరు మోసగాళ్లు ఢిల్లీ రావాలని సూచించగా.. ఆ యువతి అక్టోబర్‌ 8న విమానంలో ఢిల్లీ వెళ్లింది. వారిచ్చిన చిరునామాలో సంబంధిత వ్యక్తులెవరూ లేకపోవడంతో వెనక్కి వచ్చేసింది. 

ఇంటికి వెళ్లకుండా మొహం చాటేయడంతో.. 
ఈ విషయం తండ్రికి తెలిస్తే తిడతాడనే భయంతో సదరు యువతి ఎన్టీఆర్‌ జిల్లాలోని స్నేహితుల వద్దకు వెళ్లి తలదాచుకుంటోంది. కుమార్తె అదృశ్యంపై ఎన్టీఆర్‌ జిల్లా పోలీసుల­కు ఫిర్యాదు చేయగా.. ఆమెను గుర్తించి తండ్రికి అప్ప­గిం­­చారు. డబ్బులు విషయమై కుమార్తెను అడగ్గా జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. దీనిపై ఫిరంగిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ వేగవంతం చేయాల­ని కోరుతూ స్పందనలో జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు వినతిపత్రం అందించారు. ఈ విషయమై ఎస్పీ హఫీజ్‌ మీడియా­తో మాట్లాడుతూ.. ఐటీ కోర్‌ విభాగం ద్వారా కేసు 
దర్యా­ప్తు చేస్తున్నట్టు తెలిపారు.

(చదవండి: సైబరాసురులు దోచేస్తున్నారు..కంపెనీల పేరులో వల)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement