సంగమేశ్వరుని భూములు స్వాహా!
► సుమారు 79 సెంట్ల పొలం కైంకర్యం
► అధికార పార్టీ నేతల అండతోనే అక్రమార్కుల దందా
ఆలయాల నిర్వహణకు పూర్వం ఔదార్యం ఉన్న వారు భూములు ఇచ్చే వారు. వాటిని కౌలు చేసుకునేందుకు వేలం వేయగా వచ్చిన ఆదాయాన్ని నిర్వహణ కమిటీ ధూపదీప నైవేద్యాలకు వినియోగించేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అధికార పార్టీ అండదండలతో రెవెన్యూశాఖ, దేవాదాయశాఖ కుమ్మక్కై అక్రమార్కులకు దేవుళ్ల భూములను కట్టబెడుతున్నాయి. తాజాగా తెనాలి రూరల్ మండలం సంగం జాగర్లమూడి సంగమేశ్వరస్వామి ఆలయ భూమి కూడా అలాగే కైంకర్యం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. – తెనాలి రూరల్
చేబ్రోలు: స్థానిక మండలం వడ్లమూడి పరిధిలో సంగం జాగర్లమూడి సంగమేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన సుమారు 79 సెంట్ల భూమిని కొందరు అధికారులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమి హద్దులు అవే ఉంచి, సర్వేనంబర్ మార్చి నకిలీ పత్రాలు సృష్టించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో రెవెన్యూ, దేవాదాయశాఖ ఈ దారుణానికి ఒడిగట్టునట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
వెలుగులోకి ఇలా..
సంగమేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములకు మూడేళ్లకోసారి వేలం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ ఏడాది వడ్లమూడి పరిధిలోని సర్వే నంబర్ 197–3లోని 1.24 ఎకరాలకు, మరో 79 సెంట్ల భూమికి కౌలు వేలం నిర్వహించాల్సి ఉంది. గత నెలలో దేవాదాయ శాఖ అధికారులు బహిరంగ వేలానికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో కేవలం 1.24 ఎకరాలకు గురువారం వేలం నిర్వహిస్తామని ప్రకటించడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి మిగిలిన భూమి ఏమైందని అధికారులను ప్రశ్నించారు. వారినుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు.
1.24 ఎకరాలకు కౌలు వేలం పూర్తి..
గురువారం 1.24 ఎకరాలకు సంబంధించిన కౌలు వేలం జరిగింది. మూడేళ్ల క్రితం ఈ భూమిని రూ.18,400కు వేలం పాడుకోగా ఈ సారి చేబ్రోలు మండలం గరువుపాలెంకు చెందిన కస్తూరి పూర్ణచంద్రరావు రూ. 27 వేలకు దక్కించుకున్నారు. 79 సెంట్ల భూమికి ఎందుకు వేలం నిర్వహించలేదని గతంలో వేలం దక్కించుకున్న వ్యక్తి రశీదులు తీసుకొచ్చి మరీ అధికారులను నిలదీసినట్లు తెలుస్తోంది. అయినా దేవాదాయ శాఖ అధికారులు సదరు వ్యక్తి ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు.
వేరే ఆలయానికి చెందిందేమో..?
మా వద్ద ఉన్న రికార్డుల్లో 1.24 ఎకరాల భూమి మాత్రమే దేవస్థానం కింద ఉంది. దానికి మాత్రమే కౌలు నిర్వహించాం. గతంలో వేణుగోపాలస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములనూ కూడా ఒకేసారి వేలం నిర్వహించేవాళ్లు. 79 సెంట్ల భూమి ఆ ఆలయానికి సంబంధించిందై ఉంటుంది. – బొమ్ము శివారెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి.