పిఠాపురంలో మృతదేహాలను తరలించడానికి ఏర్పాటు చేసిన మహాప్రస్థానం వాహనాలు
పిఠాపురం: ప్రాణాలు కాపాడాల్సిన వాహనాలను పట్టించుకోరు.. ప్రాణాలు పోయాక శవాలను తరలించడానికి మాత్రం కొత్త వాహనాలు సిద్ధం చేశారు అంటూ సోమవారం తూర్పుగోదావరి జిల్లా చేబ్రోలు వద్ద 216 జాతీయ రహదారిపై జరిగిన ప్రమాద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని టిప్పర్ ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడిన విషయం తెలిసిందే. కొన ఊపిరితో ఉన్న వారిని తరలించేందుకు 108 అంబులెన్స్ కోసం ఫోన్ చేయగా.. అవి ఎంతసేపటికీ రాకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో క్షతగాత్రులను తరలించాల్సి వచ్చింది.
క్షతగాత్రులను తరలించడానికి 108 లేక ప్రైవేటు వాహనంలో తరలిస్తున్న పోలీసులు
అదే అంబులెన్స్ అయితే సకాలంలో ప్రాథమిక వైద్య సేవలందేవి. ప్రైవేటు వాహనాల్లో తరలించడం వల్ల మార్గంమధ్యలో ఇద్దరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృత్యువాత పడ్డారు. క్షతగాత్రులను కాపాడటానికి 108 అంబులెన్స్‌లు మూడు గంటలు ఆలస్యంగా వచ్చాయి. ఒక్కో అంబులెన్స్‌లో ముగ్గురుని తరలించారు. కానీ, మృతదేహాలను తరలించడానికి మహాప్రస్థానం పేరుతో ఏర్పాటు చేసిన వాహనాలను అధికారులు వెంటనే ఏర్పాటు చేశారు. ఎనిమిది మృత దేహాలను తరలించడానికి నాలుగు మహాప్రస్థాన వాహనాలను సిద్ధం చేశారు. కాపాడటానికి రాని వాహనాలు.. కాటికి పంపడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాయి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి తీరంటూ ప్రశ్నించారు.
నిత్యం ప్రాణసంకటమే..!
జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రెండు 108 అంబులెన్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకదానిని ప్రమాదాల్లో క్షతగాత్రులను తరలించడానికి ఉపయోగిస్తూ ఉండగా.. మరోదానిని గర్భిణుల కోసం వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతంలో జాతీయ రహదారిని ఆనుకుని ఎక్కువ గ్రామాలు ఉండటంతో నిత్యం ఎక్కడో ఓచోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment