
సాక్షి, బెంగళూరు: కష్టసుఖాల్లో భార్యకు తోడుంటానని బాస చేసిన భర్త.. ఆమెపై పగబట్టి కటకటాలపాలయ్యాడు. కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసేందుకు భర్త సుపారీ ఇచ్చిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. మధ్యలో పోలీసులు ఎంటరై భర్తతో పాటు సుపారీ ముఠాను అరెస్ట్ చేశారు. వివరాలు....వయ్యాలికావల్‌కు చెందిన వ్యాపారి నరేంద్రబాబు, వినుత దంపతులు. వీరికి వివాహమై ఏడేళ్లవుతుండగా, ఐదేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. నరేంద్రబాబు ఆస్తిలో తనకు భాగం కావాలని వినుత ఒత్తిడి చేస్తున్నా ఫలితం లేదు. దీంతో ఇటీవల ఆమె వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్‌లో భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. భార్యను అంతమొందించాలని నిశ్చయించుకున్న నరేంద్రబాబు ఒక హంతకముఠాతో రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు.
రూ.2లక్షల అడ్వాన్స్ చెల్లించాడు. బుధవారం ఈ గ్యాంగ్ సభ్యులు వినుతను చంపాలని ప్రయత్నించారు. అయితే ఆ ప్లాన్ విఫలం కావడంతో గురువారం రోజున వయ్యాలికావల్ ప్రాంతంలో ఓ ఆటోలో కూర్చుని వినుతా కోసం కాపు కాస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్లిన పోలీసులు వీరి వైఖరిపై అనుమానం వచ్చి ప్రశ్నించగా హత్య విషయం బయటపడింది. దీంతో సుపారి గ్యాంగ్ సభ్యులు చిన్నస్వామి, అభిలాష్‌లతో పాటు నరేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గతంలో కూడా తనపై భర్త, అత్తమామలు కిరోసిన్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించారని వినుతా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment