తప్పు ఎవరిది..శిక్ష ఎవరికి? | Husband Killed Wife And Commits Suicide in Kurnool | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన భర్త ఆత్మహత్య

Published Fri, Jan 24 2020 11:29 AM | Last Updated on Fri, Jan 24 2020 11:38 AM

Husband Killed Wife And Commits Suicide in Kurnool - Sakshi

స్వాతి, నరసింహారెడ్డి, పిల్లలు (ఫైల్‌)

కర్నూలు ,ఎమ్మిగనూరు రూరల్‌: భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త కొద్ది గంటల్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కడివెళ్ల గ్రామానికి చెందిన స్వాతి(35)కి, మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామానికి చెందిన నరసింహారెడ్డికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టించుకోకుండా అల్లరచిల్లరగా తిరుగుతుండటంతో భార్య, భర్త మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. పెద్దలు సర్దిచెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో ఐదేళ్లుగా స్వాతి పుట్టినిళ్లు కడివెళ్లలో ఉంటూ పిల్లలను చదివించుకుంటోంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భార్య వద్దకు వచ్చిన నరసింహారెడ్డి రెండ్రోజులు బాగానే ఉన్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూరగాయలు తరిగే కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే లోపే పరారయ్యాడు. 

లాడ్జీలో ఆత్మహత్య..
బుధవారం సాయత్రం భార్య స్వాతిని అతికిరాతంగా కత్తితో గొంతు కోసి హత్య చేసి పరారైన నరసింహారెడ్డి ఎమ్మిగనూరుకు చేరుకున్నాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అద్దెకు తీసుకున్న లాడ్జీ గదికి వెళ్లి పంచెతో ఉరివేసుకున్నాడు. గురువారం ఉదయం లాడ్జీలో నుంచి రక్తం బయటకు వస్తుండటం గమనించిన పక్క గది వారు లాడ్జీ సిబ్బందికి తెలియజేశారు. వారు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పట్టణ ఎస్‌ఐ శ్రీనివాసులు సిబ్బందితో వెళ్లి తలుపు బద్దలకొట్టి చూడగా ఉరికి వేళాడుతూ కనిపించాడు. మృతదేహాన్ని కిందకు దించి కుటంబ సభ్యులకు తెలియజేశారు.

శిక్ష పిల్లలకా?
తల్లిదండ్రులు గొడవ పడుతుంటే చిన్నారులు కుమిలిపోయేవారు. ఐదేళ్లుగా అమ్మమ్మ ఊరిలో తల్లితో పాటు ఉంటూ చదువుకునే చిన్నారులకు తండ్రి దూరంగా ఉండేవాడు. అప్పుడప్పుడూ వచ్చే తండ్రిని నాన్నా అని పిలిచేందుకు కూడా భయపడే వారు. ఈ క్రమంలో తల్లి హత్యకు గురికావడం, తండ్రి ఆత్మహత్యకు పాల్పడటంతో అనాథలయ్యారు.  తప్పు ఎవరిదైనా తల్లిదండ్రుల ప్రేమకు దూరం కావడమనే శిక్ష చిన్నారులకు పడిందని పలువురు కంట తడిపెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement