ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వారి వివాహ బంధం సజావుగా సాగింది. ఆ తర్వాత భార్య ప్రవర్తనపై అతనికి అనుమానం మొదలైంది. అదికాస్తా పెనుభూతంలా మారింది. కసితో రగిలిపోయాడు. కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా.. అభం శుభం తెలియని పిల్లలనే కనీస జ్ఞానం కూడా కరువై అతి దారుణంగా హతమార్చాడు.
బి.కోడూరు: అనుమానం పెనుభూతమై భార్యా పిల్లలను హత్య చేసిన ఘటన బి.కోడూరు మండలం పాయలకుంట్ల గ్రామంలో సంచలనం రేపింది. బద్వేలు మండలం చెర్లోబోయన పల్లెకు చెందిన కాశిని రమణారెడ్డి నాలుగేళ్ల క్రితం పెనగలూరు మండలం సాతుపల్లెకు చెందిన లక్ష్మిప్రియను (24) కులాంతర వివాహం చేసుకున్నాడు. మండలంలోని పాయలకుంట్లలో నివసిస్తూ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వీరికి సాయి శ్రీహిత (4), చింటు(2) సంతానం ఉన్నారు. రెండేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో అనుమానం అనే విష బీజం మొలకెత్తింది. దీంతో రమణారెడ్డి నిత్యం మద్యం సేవిస్తూ భార్యను చిత్ర హింసలకు గురిచేస్తుండేవాడు. అయితే కులాంతర వివాహం చేసుకుందనే కారణంగా తల్లిదండ్రులు కూడా లక్ష్మిప్రియను ఆదరించలేదు. దీంతో ఆమె తన బాధను ఎవ్వరికీ చెప్పుకునే అవకాశం లేక బాధపడుతూనే ఉండేది.
ఈ క్రమంలో గత మూడు రోజుల నుంచి లక్ష్మిప్రియను వివాహేతర సంబంధం పెట్టుకున్నావని వేధిస్తూ తీవ్రంగా కొడుతుండేవాడని స్థానికుల ద్వారా తెలిసింది. ఇదే సమయంలో లక్ష్మిప్రియను హతమారుస్తానని కూడా బెదిరించినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇరువురి మద్య గొడవ జరిగిన అనంతరం ఇంటిలోనే నిద్రించారు. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున నిద్రపోతున్న భార్య లక్ష్మిప్రియను, ఇద్దరు పిల్లలను గొడ్డలితో అతి కిరాతకంగా చంపి పక్క ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రులకు విషయం తెలిపి పరారయ్యాడు. మైదుకూరు డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, పోరుమామిళ్ల సీఐ పద్మనాభన్, బి.కోడూరు ఎస్‌ఐ మద్దిలేటి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. వీఆర్‌ఓ అమర్‌నాథరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పోలీసుల అదుపులో నిందితుడు?
భార్యా పిల్లలను అతి కిరాతకంగా హత్యచేసిన రమణారెడ్డి కోసం బి.కోడూరు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు బద్వేలు నాలుగురోడ్ల కూడలి సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment