జాబ్‌ల పేరుతో బురిడీ | Hyderabad Police Arrested Fake Job Employers Delhi Based Gang | Sakshi
Sakshi News home page

Published Wed, May 30 2018 9:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:48 PM

Hyderabad Police Arrested Fake Job Employers Delhi Based Gang - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు .. వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో : అగ్రికల్చర్‌ గ్రామోద్యోగ్‌ అండ్‌ రూరల్‌ ఇంజినీరింగ్‌ డెవలప్‌మెంట్‌ (ఏజీఆర్‌ఈడీ) పేరుతో వెబ్‌సైట్లు తెరవడం... వివిధ రకాలైన ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటనలు ఇవ్వడం, పత్రికలు, ఆన్‌లైన్‌ ద్వారా ప్రచారం చేసుకుని ఆకర్షితులైన వారినుంచి గరిష్టంగా రూ.600 చొప్పున వసూలు చేయడం... ఈ పంథాలో దేశ వ్యాప్తంగా లక్షలాది మందిని మోసం చేసి రూ.కోట్లు దండుకున్న ఢిల్లీ ముఠాను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో రాష్ట్రంలో 20 వేల మందిని మోసం చేయడంతో ఈ నెల 21న కేసు నమోదు చేశామని, మొత్తం నలుగురు నిందితు ల్లో ముగ్గురిని ఢిల్లీలో అరెస్టు చేసినట్లు నగర పోలీ సు కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. అదనపు సీపీ షికాగోయల్, డీసీపీ అవినాష్‌ మహంతి, అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌లతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు.  

‘తక్కువ’వే ఎక్కువ... 
ఢిల్లీకి చెందిన సచిన్‌ కుమార్‌ చాందినీచౌక్‌ ప్రాంతంలో గత ఏడాది ఐ టెక్‌ సొల్యూషన్స్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇందులో ఢిల్లీకే చెందిన వికాష్‌ కుమార్‌ సూపర్‌వైజర్‌గా, సుభాష్‌ ఆపరేటర్‌గా, వికాస్‌ ఖాండేల్‌వాల్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. బీపీఓ సహా ఇతర ప్రాజెక్టులు చేపట్టాలని భావించినా అందుకు అవకాశం దక్కకపోవడంతో మోసాల ద్వారా డబ్బు సంపాదించాలని సచిన్‌ పథకం వేశాడు. యువతతో పాటు నిరుద్యోగులను తేలిగ్గా మోసం చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో బోగస్‌ ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

పక్కాగా ఈ వ్యవహారం సాగించేందుకు ఆయా ప్రభుత్వ విభాగాల పేరుతోనే వెబ్‌సైట్లు ఏర్పాటు చేసి, ఆన్‌లైన్‌ ద్వారా వసూళ్లకు పథకం వేశాడు. అయితే  బాధితుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తే దొరికిపోతామని భావించిన అతను తక్కువ ప్రాచుర్యం ఉన్న విభాగాల్లో ఉద్యోగాల పేర్లతో తక్కువ మొత్తంలో ఎక్కువ మంది నుంచి డబ్బులు వసూలు చేయాలని నిర్ణ యించుకున్నాడు. తక్కువ మొత్తమే కదా అనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయడానికి బాధితులు వెనుకడతారని సచిన్‌ భావించాడు. మిగిలిన ముగ్గురితో కలిసి గతేడాది నవంబర్‌లో రంగంలోకి దిగాడు.  

ఐదు రాష్ట్రాల్లో ‘విజయవంతంగా’... 
అంతగా ప్రాచుర్యం లేని ఏజీఆర్‌ఈడీ విభాగం పేరుతో బోగస్‌ వెబ్‌సైట్లు రూపొందించి ప్రాజెక్టు మేనేజర్లు, మార్కెటింగ్‌ ఆఫీసర్లు, ఫీల్డ్‌ ఆఫీసర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ల్యాబ్‌ అటెండర్స్, క్లర్క్స్‌ ఉద్యోగాలతో నకిలీ ప్రకటనలు ఇచ్చేవారు. కొన్ని రాష్ట్రాల్లో పత్రికలు, మరికొన్ని చోట్ల ఆన్‌లైన్‌లోనూ ప్రచారం చేసేవారు. వీటికి ఆకర్షితులై సదరు వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయిన వారితో ఓ ఆన్‌లైన్‌ దరఖాస్తు పూరించి అప్పటికప్పుడే రూ.98 ఆన్‌లైన్‌లో వసూలు చేసేవారు. ఆ తర్వాత ఐ టెక్‌ సొల్యూషన్స్‌ పేరుతో ఓ దరఖాస్తును ముద్రించి అభ్యర్థుల చిరునామాలకు పోస్టులో పంపేవారు. పోస్టుమ్యాన్‌కు రూ. 499 చెల్లించి దరఖాస్తును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సొమ్ము కూడా పోస్టల్‌ విభాగం ద్వారా సచిన్‌ గ్యాంగ్‌కు చేరిపోయేది.

ఈ తరహాలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, తమిళనాడు రాష్ట్రాల్లో వేల మంది నుంచి రూ.కోట్లు దండుకున్నారు. దీనిపై ఎవరూ ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయకపోవడంతో ఎక్కడా కేసులు నమోదు కాలేదు. దీంతో వీరి దందా నిరాటంకంగా సాగిపోయింది. ఇది చాలదన్నట్లు ‘విజన్‌ 700’ పేరుతో నిషిద్ధ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ దందా ప్రారంభించడానికి సంసిద్ధులయ్యారు. తమ వద్ద రూ.700 చెల్లించి సభ్యులుగా చేరాలని, కొత్తగా చేర్చిన ప్రతి సభ్యుడిపై రూ.200 చొప్పున కమీషన్‌ ఇస్తామంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం సైతం చేశారు.  

తెలంగాణలో దందాతో... 
తెలంగాణపై కన్నేసిన సచిన్‌ ముఠా తెలంగాణ ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ (్ట్ఛ ్చnజ్చn్చ.జట్ఛఛీ.ఛిౌ.జీn) సృష్టించా రు. నిజమైన ఉద్యోగ ప్రకటన మాదిరిగానే 4027 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఏబీసీ రిజర్వేషన్లు, వయో పరిమితి సడలింపులు, జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సైతం పొందుపరచడం గమనార్హం. దాదాపు 20 వేల మంది దీనికి ఆకర్షితులు కావడంతో వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర ఐటీ శాఖ దృష్టి రావడంతో తెలంగాణ ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్పందించి సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌బాష నేతృత్వంలోని బృందం సాంకేతిక ఆధారాలతో నిందితులు ఢిల్లీ ముఠాగా గుర్తించింది. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం సోమవారం సచిన్‌ మినహా ముగ్గురిని అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.2.5 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు తదితరాలు స్వాధీనం చేసుకుంది. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న మరో రూ.79 లక్షలు ఫ్రీజ్‌ చేసింది. ఈ స్కామ్‌ రూ.3 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించామని, సూత్రధారి సచిన్‌ చిక్కితే మరికొన్ని వివరాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ వెబ్‌సైట్ల చిరుమానాల చివరలో (.gov.in) అని ఉంటుందని, అలా కాకుంటే అనుమానించాలని కొత్వాల్‌ సూచించారు. ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement