మృతి చెందిన విద్యార్థి నరసింహమూర్తి , విషణ్ణవదనంతో తండ్రి సత్యనారాయణ
కృష్ణాజిల్లా , నూజివీడు : ‘పెళ్లయి15 ఏళ్లకు పుట్టాడు... బాగా చదువుతుండటంతో అండగా ఉంటాడనుకున్నా... రోజూ నాతో ఫోన్‌లో మాట్లాడేవాడు... బుధవారమే ఎందుకో ఫోన్ చేయలేదు... ఇంతలోనే చనిపోయాడని కబురొచ్చింది...’ అంటూ ఆత్మహత్య చేసుకున్న ట్రిపుల్ ఐటీ విద్యార్థి సాగిరెడ్డి పూర్ణలక్ష్మీనరసింహమూర్తి తండ్రి సత్యనారాయణ భోరున విలపించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కాలేజీలో పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి పూర్ణలక్ష్మీనరసింహమూర్తి బుధవారం రాత్రి ఉరివేసుకుని మరణించాడు. అతని మరణాన్ని తండ్రి జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఆరేళ్లు చదువుకుంటే చేతికి అందొస్తాడని, కష్టాలన్నీ తీరతాయని ఆశతో జీవిస్తున్న ఆ తల్లిదండ్రుల ఆశలు చెదిరి పోయాయి. సత్యనారాయణది నిరుపేద కుటుంబం. ఆరేళ్లుగా హైదరబాద్‌లోని చింతల్ ప్రాంతంలో తోపుడు బండిపై అరటికాయలు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. పెళ్ళైన 15 ఏళ్లకు లేకలేక పుట్టిన కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అతని చదువు నిమిత్తమే హైదరాబాద్ ఒంటరిగా ఉంటూ, తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం మండలం పడమటిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కుమారుడిని చదివించాడు. గత ఏడాది పదో తరగతిలో పదికి పది పాయింట్లు రావడంతో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో సీటు లభించింది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన మూర్తి తిరిగి ఈ నెల 4వ తేదీన నూజివీడు వచ్చాడు.
సరదాగా ఉంటాడు : సహవిద్యార్థులు
పూర్ణలక్ష్మీనరసింహమూర్తి ఎప్పుడూ నవ్వుతూ, తనచుట్టు ఉన్న నలుగురినీ నవిస్తూ ఉంటాడని సహవిద్యార్థులు పేర్కొంటున్నారు. మూర్తి చనిపోయాడంటే తమకే ఏదోలా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. చదువులో ముందుండేవాడని, మాసాంతపు పరీక్షల్లో కూడా మార్కులు బాగానే వచ్చేవని విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీలూ చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నమే బట్టలు ఆరేయడానికంటూ ప్లాస్టిక్ వైర్ కొనుక్కొచ్చాడని, తీరా తాము రాత్రి భోజనానికి వెళ్లిన తరువాత ఉరివేసుకున్నాడని, ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదని రూమ్‌లో ఉంటున్న తోటి విద్యార్థులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ట్రిపుల్‌ఐటీలో చేరిన ఈ మూడు నెలల కాలంలో ఏ రోజు కూడా బాధపడుతూ కనిపించలేదని, ఎప్పుడూ నవ్వూతూ, నవ్విస్తూ ఉండేవాడని పేర్కొన్నారు. విద్యార్థి మృతి కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. విద్యార్థి మృతిపై కలెక్టర్ బి.లక్ష్మీకాంతం స్పందించి మెజిస్టీరీయన్ విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment