IIIT Student Commit Suicide
-
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థి మండల రామూనాయుడు (16) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా గుర్ల మండలం దమరసింగికి చెందిన రామానాయుడు పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్‌లోని ఐ2 హాస్టల్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం తరగతులకు వెళ్లడంతో పాటు మధ్యాహ్నం మెస్‌కు వెళ్లి భోజనం చేశాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఈనెల 4న ట్రిపుల్ఐటీకి రానున్న ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం మూడో ఫ్లోర్‌లోని గదుల్ని సిద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో వారు గదిలో ఉరికి వేలాడుతున్న రామూనాయుడిని గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే రామూనాయుడు మృతి చెందాడు. గతనెల 25నే ట్రిపుల్ ఐటీకి వచ్చిన అతడు ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతుడి తల్లి గతంలోనే మరణించగా తండ్రి, అక్క ఉన్నారు. వీరికి దూరంగా ఉండాల్సి వస్తోందనే వేదనతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఈ కారణంతోనే గతనెల 13నే కాలేజీకి రావాల్సిన అతడు 25న వచ్చినట్లు ట్రిపుల్ఐటీ వర్గాలు తెలిపాయి. -
ట్రిపుల్ఐటీ విద్యార్థిని మాధురి ఆత్మహత్య
సాక్షి, నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న మొల్లి మాధురి (20) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. హోలీ కావడంతో తరగతులు లేకపోవడంతో విద్యార్థులందరూ హాస్టల్లోనే ఉన్నారు. ఐ3 హాస్టల్ భవనంలోని మూడో అంతస్తులో తన రూమ్‌లోనే మాధురి ఉండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో తోటి విద్యార్థినులు భోజనానికి రమ్మని పిలవగా తాను తరువాత తింటానని, మీరు తినేసి రమ్మని బదులిచ్చి రూమ్‌లోనే ఉండిపోయింది. దీంతో వారు మెస్‌కు వెళ్లి భోజనం చేసి తిరిగి వచ్చిన తరువాత రూమ్ తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో కేర్‌టేకర్‌కు చెప్పారు. దీంతో కేర్‌టేకర్ సెక్యూరిటీ వాళ్లకు తెలపగా వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఉరివేసుకుని ఉంది. ఆమెను కిందకు దించి చూడగా చనిపోయింది. దీంతో మృతదేహాన్ని పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి. ఈమె స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని గాంధీనగర్. విద్యార్థిని మృతి చెందిన విషయం తెలుసుకుని నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సీఐ ఎం.వెంకటనారాయణ, ఎస్ఐ అప్పారి గణేష్‌కుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకుని హాస్టల్ గదిని పరిశీలించారు. రూమ్‌లోని తోటి విద్యార్థులను పోలీసులు విచారించగా, ప్రేమ వ్యవహారమే కారణమని చెప్పినట్లు సమాచారం. -
లేకలేక పుట్టాడు...అండగా ఉంటాడనుకున్నా !
కృష్ణాజిల్లా , నూజివీడు : ‘పెళ్లయి15 ఏళ్లకు పుట్టాడు... బాగా చదువుతుండటంతో అండగా ఉంటాడనుకున్నా... రోజూ నాతో ఫోన్లో మాట్లాడేవాడు... బుధవారమే ఎందుకో ఫోన్ చేయలేదు... ఇంతలోనే చనిపోయాడని కబురొచ్చింది...’ అంటూ ఆత్మహత్య చేసుకున్న ట్రిపుల్ ఐటీ విద్యార్థి సాగిరెడ్డి పూర్ణలక్ష్మీనరసింహమూర్తి తండ్రి సత్యనారాయణ భోరున విలపించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కాలేజీలో పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి పూర్ణలక్ష్మీనరసింహమూర్తి బుధవారం రాత్రి ఉరివేసుకుని మరణించాడు. అతని మరణాన్ని తండ్రి జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఆరేళ్లు చదువుకుంటే చేతికి అందొస్తాడని, కష్టాలన్నీ తీరతాయని ఆశతో జీవిస్తున్న ఆ తల్లిదండ్రుల ఆశలు చెదిరి పోయాయి. సత్యనారాయణది నిరుపేద కుటుంబం. ఆరేళ్లుగా హైదరబాద్‌లోని చింతల్ ప్రాంతంలో తోపుడు బండిపై అరటికాయలు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. పెళ్ళైన 15 ఏళ్లకు లేకలేక పుట్టిన కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అతని చదువు నిమిత్తమే హైదరాబాద్ ఒంటరిగా ఉంటూ, తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం మండలం పడమటిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కుమారుడిని చదివించాడు. గత ఏడాది పదో తరగతిలో పదికి పది పాయింట్లు రావడంతో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో సీటు లభించింది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన మూర్తి తిరిగి ఈ నెల 4వ తేదీన నూజివీడు వచ్చాడు. సరదాగా ఉంటాడు : సహవిద్యార్థులు పూర్ణలక్ష్మీనరసింహమూర్తి ఎప్పుడూ నవ్వుతూ, తనచుట్టు ఉన్న నలుగురినీ నవిస్తూ ఉంటాడని సహవిద్యార్థులు పేర్కొంటున్నారు. మూర్తి చనిపోయాడంటే తమకే ఏదోలా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. చదువులో ముందుండేవాడని, మాసాంతపు పరీక్షల్లో కూడా మార్కులు బాగానే వచ్చేవని విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీలూ చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నమే బట్టలు ఆరేయడానికంటూ ప్లాస్టిక్ వైర్ కొనుక్కొచ్చాడని, తీరా తాము రాత్రి భోజనానికి వెళ్లిన తరువాత ఉరివేసుకున్నాడని, ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదని రూమ్‌లో ఉంటున్న తోటి విద్యార్థులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ట్రిపుల్‌ఐటీలో చేరిన ఈ మూడు నెలల కాలంలో ఏ రోజు కూడా బాధపడుతూ కనిపించలేదని, ఎప్పుడూ నవ్వూతూ, నవ్విస్తూ ఉండేవాడని పేర్కొన్నారు. విద్యార్థి మృతి కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. విద్యార్థి మృతిపై కలెక్టర్ బి.లక్ష్మీకాంతం స్పందించి మెజిస్టీరీయన్ విచారణకు ఆదేశించారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
భీమ్‌గల్, న్యూస్‌లైన్: నిజామాబాద్ జిల్లా బడా భీమ్‌గల్ గ్రామానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని గురజాల స్రవంతి (19) ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో మూడో సంవత్సరం చదువుతోంది. మొదటి సెమిస్టర్ పరీక్షలు పూర్తికాగా కళాశాల యాజమాన్యం శీతాకాలం సెలవులు ప్రకటించడంతో స్రవంతి వారం క్రితం స్వగ్రామానికి వచ్చింది. అయితే సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. చదువులో ఎప్పుడూ టాపర్‌గా ఉండే ఆ విద్యార్థిని ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు.