మాధురి (ఫైల్)
సాక్షి, నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న మొల్లి మాధురి (20) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. హోలీ కావడంతో తరగతులు లేకపోవడంతో విద్యార్థులందరూ హాస్టల్‌లోనే ఉన్నారు. ఐ3 హాస్టల్ భవనంలోని మూడో అంతస్తులో తన రూమ్‌లోనే మాధురి ఉండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో తోటి విద్యార్థినులు భోజనానికి రమ్మని పిలవగా తాను తరువాత తింటానని, మీరు తినేసి రమ్మని బదులిచ్చి రూమ్‌లోనే ఉండిపోయింది. దీంతో వారు మెస్‌కు వెళ్లి భోజనం చేసి తిరిగి వచ్చిన తరువాత రూమ్ తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో కేర్‌టేకర్‌కు చెప్పారు. దీంతో కేర్‌టేకర్ సెక్యూరిటీ వాళ్లకు తెలపగా వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఉరివేసుకుని ఉంది. ఆమెను కిందకు దించి చూడగా చనిపోయింది. దీంతో మృతదేహాన్ని పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
రెండు రోజుల క్రితమే సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి. ఈమె స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని గాంధీనగర్. విద్యార్థిని మృతి చెందిన విషయం తెలుసుకుని నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సీఐ ఎం.వెంకటనారాయణ, ఎస్‌ఐ అప్పారి గణేష్‌కుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకుని హాస్టల్ గదిని పరిశీలించారు. రూమ్‌లోని తోటి విద్యార్థులను పోలీసులు విచారించగా, ప్రేమ వ్యవహారమే కారణమని చెప్పినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment