సాక్షి, దేవరపల్లి(తూర్పు గోదావరి) : రాజమహేంద్రవరానికి చెందిన పారిశ్రామిక వేత్త ఇరన్యాకుల వెంకటరమణ(56) దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద అనుమానాస్పదంగా మృతిచెందారు. బుధవారం ఉదయం వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల కథకం ప్రకారం రాజమహేంద్రవరం ఇస్కాన్ టెంపుల్ ప్రాంతానికి చెందిన పారిశ్రామిక వేత్త ఇరన్యాకుల వెంకటరమణ దేవరపల్లి మండలం దుద్దుకూరు–గౌరీపట్నం గ్రామాల మధ్య సుమారు నాలుగేళ్ల క్రితం జై సంతోషిమాత పాలీప్యాక్(గ్లాసుల తయారీ) పరిశ్రమను నెలకొల్పారు. ప్రతిరోజూ రాజమహేంద్రవరం నుంచి వెంకటరమణకుమార్ ఇక్కడికి వచ్చి పనులు చూసుకుని రాత్రికి ఇంటికి వెళతారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈయన ఇంటి నుంచి బయల్దేరి పరిశ్రమ వద్దకు వచ్చారు. కొద్దిసేపు పరిశ్రమ వద్ద ఉండి తిరిగి కారులో బయలుదేరారు.
రాత్రి 12 గంటల సమయంలో దేవరపల్లి వైపు నుంచి కారులో వస్తూ దుద్దుకూరు వద్ద రోడ్డు పక్కన గల ఇంటి గోడను ఢీ కొట్టాడు. ఈ శబ్దానికి చుట్టుపక్కల వారు వచ్చి చూడగా వెంకటరమణ స్వల్పగాయాలతో ఉన్నాడు. పురుగు మందు తాగానని, వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని స్థానికులను ఆయన కోరారు. రాజమండ్రి వైపు వెళుతున్న ఓ కారును ఆపి వెంకటరమణను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లమని గ్రామస్తులు కోరారు. అప్పటికే ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వెంకటరమణను ఆ ముగ్గురు వ్యక్తులు వారి కారులో ఎక్కించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ ముగ్గురు తిరిగి దుద్దుకూరు వచ్చి ప్రమాదానికి గురైన కారును తెరిచారు. దీనిపై గ్రామస్తులు ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించగా.. వెంకటరమణకుమార్‌ను కొవ్వూరు ఆసుపత్రిలో చేర్పించామని, ఆధార్ కార్డు కారులో ఉందని, తీసుకురమ్మన్నాడని చెప్పి వెళ్లిపోయారు.
ఒంటిపై దుస్తులు లేకుండా..
బుధవారం ఉదయం గౌరీపట్నం సెంటర్లో రోడ్డు పక్కన దుస్తులు లేకుండా పురుషుడి మృతదేహం ఉన్నట్టు గ్రామస్తులు గుర్తించి వీఆర్వోకు ఫిర్యాదు చేశారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఎస్సై బి.వై.కిరణ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి చేతికి మూడు బంగారు ఉంగరాలు, మెడలోని బంగారు గొలుసు కనిపించలేదని, అతడి బంధువులు తెలిపారు. మృతుడి భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.
వెంకటరమణకుమార్ మృతిపై అనుమానాలు
పారిశ్రామిక వేత్త వెంకటరమణ కుమార్ మృతిపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో రాజమండ్రి నుంచి దేవరపల్లి ఎందుకు వచ్చారు. వెంకటరమణకుమార్ పురుగు మందు తాగానని ఎందుకు చెప్పాడో తేలాల్సి ఉంది. దుద్దుకూరు వద్ద ప్రమాదానికి గురైన సమయంలో వెంకటరమణకుమార్‌ను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లిన వ్యక్తులు ఎవరు? వారు ఎక్కడికి తీసుకెళ్లారు? రోడ్డు పక్కన దుస్తులు లేకుండా వెంకటరమణకుమార్ మృతదేహం ఎందుకుపడి ఉందో పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment