
సాక్షి, న్యూఢిల్లీ : ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి దక్షిణ ఢిల్లీలోని క్యాంపస్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని గ్రేటర్ కైలాష్‌లో కుటుంబంతో కలిసి ఉండే అన్షుమన్ గుప్తా (31) నిరుద్యోగి. 2010 బ్యాచ్ బీటెక్ స్టూడెంట్ అన్షుమన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్ బిల్డింగ్ ఏడవ ఫ్లోర్ నుంచి దూకడంతో రక్తపు మడుగులో పడిఉన్నాడని పోలీసులు తెలిపారు.
ఘటనా ప్రాంతంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. కాగా అన్షుమన్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే అతడు మరణించాడని డీసీపీ మిలింద్ మహదేవ్ డంబెరే తెలిపారు. నిరుద్యోగి అయిన అన్షుమన్ ఉదయాన్నే కాలేజీ స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్నట్టు కుటుంబసభ్యులకు చెప్పాడని అన్నారు. అన్షుమన్ ఉద్యోగం రాలేదనే బెంగతో తీవ్ర చర్యకు పాల్పడినట్టు భావిస్తున్నామన్నారు. బాధితుడి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నామని, పూర్తి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment