సాక్షి, బెంగళూరు : అధిక వడ్డీ ఆశ చూపి వేలాది మందిని మోసగించి.. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకున్న ఐ మానిటరీ అడ్వైజరీ(ఐఎంఏ) గ్రూప్ యజమాని మహమ్మద్ మన్సుర్ ఖాన్‌కు చెందిన రూ.209 కోట్ల ఆస్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం స్వాధీనం చేసుకొంది. దీనిద్వారా ఐఎంఏ వంచన కేసులో ఈడీ అధికారికంగా రంగ ప్రవేశం చేసింది. బోగస్ లావాదేవీలు, హవాలా కార్యకలాపాలు చేపట్టినట్లు తెలియడంతో అధికారులు ఐఎంఏ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు, నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులలో కొందరికి దాదాపు రూ. 400 కోట్ల వరకూ లంచాలు ఇచ్చానని.. ఫలితంగా తాను మోసపోయానని..ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ మన్సూర్ ఖాన్ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసి.. అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 40 వేల మంది డిపాజిట్‌దారులకు వంచించిన మన్సూర్ ఖాన్‌కు చెందిన రూ.209 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకున్నామని, ఇందులో రూ.197 కోట్ల స్థిరాస్తి, రూ.12 కోట్లు నగదు ఉన్నట్లు పత్రికా ప్రకటనలో ఈడీ అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో బెంగళూరు, దావణగెరె, కల్బుర్గి, మైసూరు, కేరళ, న్యూఢిల్లీతో పాటు దేశంలో ఐఎంఏ శాఖలకు చెందిన నగదు, బంగారు, వజ్రాలు, భవనాలు, ఇళ్లు, సంబంధించిన బ్యాంకు ఖాతాలు, డిపాజిట్‌లతో పాటు మహమ్మద్ మన్సూర్ ఖాన్ పేరులో ఉన్న 130 బ్యాంకు ఖాతాలతో పాటు ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఐఎంఏ వంచన కేసులో తలదాచుకున్న మన్సూర్ ఖాన్ వ్యవతిరేకంగా బ్లూకార్నర్ నోటీస్ జారీచేశారు. ఇటీవల మన్సూర్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని సీఐడీ ఇంటర్ పోల్‌కు ప్రతిపాదన సమర్పించింది. వేలాకోట్ల వంచన కేసును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా డబ్బు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని భరోసానిచ్చింది. అంతేకాకుండా కేసు దర్యాప్తును ఎస్‌ఐటీకి అప్పగించింది. ఇదే సందర్భంలో ఐఎంఏ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో విదేశీ లావాదేవీలు కూడా జరిగిందన్న అంశాన్ని కనుగొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఐఎంఏ సంస్థకు చెందిన ఏడుగురు డైరెక్టర్‌లను ఎస్‌ఐటీ పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా డైరెక్టర్లు జయనగర, శివాజీనగర జ్యూవెలరీల్లో అధిక ప్రమాణంలో బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయని సమాచారాన్ని అందజేశారు. ఈ సమాచారాన్ని ఆధారం చేసుకొని రెండు శాఖల అధికారులు ఈ నెల 18న జయనగర జ్యువెలరీ శాఖ, మన్సూర్ ఖాన్ మూడో మాజీ భార్య ఇంటిపై కూడా సోదాలు జరిపారు. ఈ సమయంలో జ్యూవెలరీలో రూ.13 కోట్లు విలువచేసే 43 కేజీల బంగారు, రూ.17 కోట్లు విలువచేసే 5864 క్యారెట్ డైమండ్, రూ.1.5 కోట్లు విలువచేసే 520 కేజీల వెండి, రూ.1.5 కోట్లు విలువచేసే సైల్పర్ డైమండ్ లభించింది. అలాగే భార్య ఇంట్లో రూ.39 లక్షలు విలువచేసే 1.5 కేజీల బంగారు, రూ.2.5 లక్షల నగదు లభించింది. రెండు వారాల నుంచి ఈ కేసును తనిఖీ చేస్తున్న ఎస్‌ఐటీ ఐఎంఏకు చెందిన ఆస్తి–పాస్తులను స్వాధీనం చేసుకొంది. ప్రస్తుతం ఈడీ కేసు తనిఖీని చేపట్టడంతో అతని ఆస్తిని స్వాధీనం చేసుకొంది. గత రెండు వారాల క్రితం రహస్య స్థలంలో ఉంటూ మన్సూర్ ఖాన్ రెండు వీడియోలు విడుదల చేశారు. ఇందులో తనకు ఎవరెవరు మోసం చేశారు. తాను ఎందుకు దేశం విడచిపెట్టి రావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. త్వరలోనే బెంగళూరుకు వస్తాను. తన సంస్థలో డిపాజిట్ చేసినవారు ఆందోళన చెందొద్దు, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్ తగిన భద్రత కల్పిస్తే వస్తాను. తాను భారతదేశానికి వస్తే డిపాజిట్‌దారులు తన కుటుంబాన్ని ప్రాణాలతో వదలరని ఖాన్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
చదవండి : బయటపడ్డ భారీ స్కాం.. ఆందోళనలో బాధితులు
ఐఎంఏ ఫార్మసీలపై కొనసాగుతున్న దాడులు
ఐఎంఏ కంపెనీకి చెందిన ఫ్రంట్‌లైన్ ఫార్మసీలపై ఎస్‌ఐటీ శుక్రవారం కూడా దాడులు కొనసాగించింది. గురువారం రెండు సూపర్ మార్కెట్, ఫార్మసీ గోదాములపై ఎస్‌ఐటీ అధికారులు బృందం దాడి చేసి లక్షలాది రూపాయలు విలువచేసే నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకొంది. ఫార్మసీ గోదాములపై దాడిచేసి కోట్లాది రూపాయల ఔషధాలు, సౌందర్య సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. ఐఎంఏ వేల కోట్ల వంచన కేసుపై తనిఖీ చేపడుతున్న ఎస్‌ఐటీ బృందం, ఐఎంఏ సంస్థ యజమాని మహమ్మద్ మన్సూర్ ఖాన్‌కు చెందిన ఆస్తులను కనుగొని, శుక్రవారం కూడా ఫార్మసీలపై దాడి కొనసాగించి కీలక ఆధారాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గిరీశ్ మీడియాకు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment