ఆళ్లగడ్డ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పిచ్చలాట, పేకాట, బెట్టింగ్‌ల వంటి అసాంఘిక కార్యకలాపాలు జడలు విప్పి కరతాళ నృత్యం చేస్తున్నాయి. ఆయా గ్రామాల్లో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా జూద క్రీడలను పలువురు దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు.. ముఖ్యంగా యువత జూదాలకు బానిసలై పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుని అప్పులపాలవుతున్నారు. కొందరు ఇల్లు విడిచి వెళ్తుండగా, మరి కొందరు అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. నిరోధించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు.
– ఆళ్లగడ్డ
సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డ నియోజవర్గంలోని రుద్రవరం మండలం ఆలమూరు, తువ్వపల్లె, గుట్టకొండ నరసింహస్వామి, డికొట్టాల, పెద్దకంబలూరు, చాగలమర్రి మండలం బైవరగుండాలు, తెలుగు గంగ కాల్వ, రాజోలి ఆనకట్ట, మండల కేంద్రం ఉయ్యలవాడ, జమ్ములదిన్నె తదితర ప్రదేశాల్లో పిచ్చలాట, మంగపత్త, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలపాలు కొన్ని మాసాలుగా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో జన సంచారం లేని ప్రదేశాల్లో ఈ జూదాలను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. ఇక వారంతాల్లో, సెలవు దినాల్లో ఈ వికృత క్రీడల నిర్వహణ పతాక స్థాయికి చేరుతోంది. పలు ప్రదేశాల్లో రాత్రి సమయంలో కూడా ఈ జూదాలను నిర్వహిస్తున్నారు. ఆయా తోటలు, ప్రదేశాల్లో విద్యుద్దీపాలు, చార్జింగ్ లైట్లు ఏర్పాటు చేసుకుని జూదాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఇందులో నిర్వాహకులు డిక్కు (పర్సేంటేజి) కింద 10 నుంచి 30 శాతం వరకు వసూలు చేస్తున్నారు. పలు చోట్ల జూదం ఆడే ప్రదేశానికి మ«ధ్యాన్ని కూడా సరఫరా చేస్తుండటం విశేషం.
చిత్తవుతున్న యువత..
యథేచ్ఛగా జరుగుతున్న ఈ జూద క్రీడల్లో పేద, మధ్యతరగతి యువత బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల ఆళ్లగడ్డ రూరల్ మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన ఓ యువకడు పిచ్చలాట ఆడుతూ ఇంట్లో ఉన్న రూ.3 లక్షలు పోగొట్టుకోగా మరో రూ.2 లక్షలు అక్కడే అప్పు చేశాడు. అయినప్పటికీ చేయి తిరగకపోవడంతో అప్పిచ్చినవారు ఒత్తిడి చేయడంతో ఇల్లొదిలి పారిపోయాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో జూదం ఆడేందుకు డబ్బులు ఇచ్చిన వారే మా పిల్లోడిని ఏదైనా చేశారేమోనని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు జూదరులను విచారించారు. అప్పు చెల్లించలేక తిరుపతి పారిపోయినట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొన్ని మాసల క్రితం పిచ్చలాటలో రూ.లక్షలు పోగొట్టుకుని అధిక వడ్డీలు చెల్లించలేక రుద్రవరం మండలంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ పోలీసులు దృష్టిసారించడంలేదనే విమర్శలున్నాయి.
వడ్డీ వ్యాపారుల కనుసన్నల్లో..
జూదాల్లో డబ్బులు పోగుట్టుకున్నవారిని కొందరు వడ్డీ వ్యాపారులు ఎంచుకుంటున్నారు. వారికి మరీ అప్పులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ద్విచక్రవాహనాలను, పొలాల పాస్‌బుక్కులను, ఇంటి స్థలాల డాక్యుమెంట్లను, బంగారాన్ని, వెండిని కుదవకు పెట్టుకుని అధిక వడ్డీకి అప్పు ఇస్తున్నారు. దీంతో పాటు ఖాళీ పత్రాలు, స్టాంపులు, ప్రామిసరి నోట్లపై సంతకాలు, వేలి ముద్రలు తీసుకుంటున్నారు. ఇక్కడ వారం, రోజు వడ్డీతో పాటు గంటల వడ్డీ కూడా నడుస్తుండటం గమనార్హం. రోజుకు నూటికి రూ.10, వారానికి రూ.50 లెక్కన వడ్డీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రకమైన వడ్డీలను వసూలు చేసుకుంటున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. చెప్పిన సమయానికి వడ్డీ చెల్లించకపోతే తన అనుయాయుల ద్వారా బెదిరింపులకు పాల్పడటం, అప్పటికీ ఇవ్వక పోతే దాడులు చేయడం జరుగుతోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి నిఘా ఏర్పాటు చేసి, అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం వేయాలని స్థానికలు కోరుతున్నారు.
సరిహద్దు ప్రదేశాలే..
జూదరులు పోలీసుల కల్లుగప్పేందుకు రెండు మండాలల సరిహుద్దులు, జిల్లా సరిహద్దుల్లో జూద కేంద్రాలను ఏర్పాటు చేసుకుని కొనసాగిస్తున్నారు. అక్కడైతే పోలీసులు తమ పరిధి కాదన్నట్లు ఉంటారనే ధైర్యం. దీనికి తోడు వాహనాలు వెళ్లలేని ప్రదేశాన్ని జూదం ఆడేందుకు ఎంచుకుంటున్నారు. సమాచారం తెలిసినా పోలీసులు కాలినడకన వెళ్లేందుకు ఇష్టపడక, వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
చర్యలు తీసుకుంటాం
వారం క్రితం లింగందిన్నె యువకుడు అదృశ్యమైన విషయం నా దృష్టికి వచ్చింది. సబ్‌డివిజన్ వ్యాప్తంగా గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. అవసరమైతే ప్రత్యేక బలగాలతో గాలింపు చేపడతాం. జూదరులతో పాటు ఆడించేవారిపైనా కఠిన చర్యలు ఉంటాయి. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
– తిప్పేస్వామి, ఆళ్లగడ్డ డీఎస్పీ సరిహద్దు ప్రదేశాలే..
Comments
Please login to add a commentAdd a comment