gambling activities
-
సాయంత్రం ఓ పెగ్గు.. ఆపై పేకాట.. ఇవేం ముచ్చట్లు!
సాధారణంగా ఎవరైనా ప్రజా ప్రతినిధి ఏదైనా సమావేశంలో పాల్గొంటే.. నాలుగు మంచి మాటలు చెబుతారు. చెడు అలవాట్లకు వెళ్లవద్దని సూచిస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన వాతావరణం నెలకొంది. అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే నిర్భీతిగా పేకాట క్లబ్ లను తెరపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకుంటామని కూడా ధైర్యంగా చెబుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ స్కూళ్లలో గతంలో మాదిరి చదువులపై శ్రద్ద చూపడం లేదన్న విమర్శలు వస్తుంటే, మరో వైపు పేకాట క్లబ్‌లకు శ్రీకారం చుడుతున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇలాంటి క్లబ్ లను అనుమతించలేదు.దాంతో కొందరు బడాబాబులకు కోపం వచ్చేదట. కొన్ని చోట్ల ఆఫీసర్ల క్లబ్ లు కూడా పేకాటను అనుమతించకపోవడంపై గుర్రుగా ఉండేవట. అలాంటివారంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారని చెబుతారు. జగన్ ప్రభుత్వం ఓడిపోతోందన్న సమాచారం వస్తుండగానే.. గుంటూరు, విజయవాడ వంటి కొన్ని చోట్ల పేకాట క్లబ్ లు తెరచుకున్నాయని సమాచారం. మరి అనంతపురం వంటి చోట ఎందుకు ఆలస్యం అయిందో తెలియదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను క్లబ్ వారు పిలిచి సమావేశం పెట్టి కార్డ్స్ ను అనుమతించాలని కోరారు. దానికి ఆయన బదులు ఇస్తూ రాష్ట్రం అంతా క్లబ్ లు తెరిపిస్తానని హామీ ఇచ్చారట. అధికారులు, ఇతర వర్గాల రిలాక్సేషన్ కోసం క్లబ్ లు ఏర్పాటు అవుతుంటాయి. వాటిలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కుటుంబాలతో కలిసి వచ్చి ఆనందంతో పాల్గొనడం ఆనవాయితీగా ఉంటుంది. కాని అవి రాను,రాను పేకాట క్లబ్ లు గా మారిపోయాయి. కొంతమంది వేల రూపాయల డబ్బును ఈ క్లబ్ లలో కోల్పోయి అప్పుల పాలవుతుంటారు. క్లబ్ ల నిర్వహణ ఒక వ్యాపారంగా మార్చివేశారు.కల్చరల్ క్లబ్ లు కాస్త జూదశాలలుగా మార్చివేయడంలో మాఫియాల పాత్ర ఉందని అంటారు. గతంలో హైదరాబాద్ లో కొన్ని ప్రైవేటు వ్యాపార సంస్థలు క్లబ్ లను నిర్వహించి పెద్ద ఎత్తున జూదాన్ని ప్రోత్సహించేవి. తత్ఫలితంగా కొందరు లక్షలు,కోట్ల రూపాయల మేర నష్టపోయిన ఘటనలు ఉండేవి.ఈ కారణంగా కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దాంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ క్లబ్ లను నిషేధించారు. కేవలం చట్టబద్దమైన క్లబ్ లను మాత్రమే అనుమతించారు. ఏపీలో కూడా అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉండగా, జగన్ ప్రభుత్వం అలాంటివాటిని అదుపు చేసింది. కాని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇలాంటి జూదగాళ్లకు ఉత్సాహం వచ్చింది. అనంతపురం క్లబ్ లో నాలుగేళ్లుగా జూదం బంద్ అయిందని, దీనిని ఆరంభించడానికి కలెక్టర్ తో మాట్లాడానని, రాష్ట్రవ్యాప్తంగా జూదక్లబ్ ల పునరుద్దరణకు ముఖ్యమంత్రి అనుమతి కోరతామని ఆ టీడీపీ ఎమ్మెల్యే నిస్సిగ్గుగా ప్రకటించారు. పైగా ఈ ఎమ్మెల్యే గారు ఇంకో సంగతి చెప్పారు. కరోనా టైమ్ లో క్లబ్ లో పేకాట లేనందువల్ల రిటైర్డ్ ఉద్యోగులు కొందరు మరణించారని అన్నారట. ఇదెక్కడి విడ్డూరం. ఆ రోజుల్లో అసలు ఎక్కడా జనం గుమికూడవద్దని ప్రభుత్వాలు ఆంక్షలు పెడితే, క్లబ్ లు నడవకపోవడం వల్ల మరణాలు సంభవించాయని చెప్పడం వింతగానే ఉంటుంది. పేద విద్యార్ధులకు అవసరమైన పుస్తకాలు, డ్రెస్ లు వంటివి సకాలంలో అందుతున్నాయా?లేదా?వారికి స్కూల్ టీచర్లు పాఠాలు సరిగా బోధిస్తున్నారా?లేదా?అన్నవి చూడవలసిన గౌరవ ఎమ్మెల్యే పేకాట క్లబ్ ల గురించి ఆసక్తి కనబరచడం విశేషం. దీనిని బట్టి ప్రజలు ఎలాంటివారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది, ఎలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది అర్ధం చేసుకోవచ్చు. మరో సంగతి కూడా చెప్పాలి. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టవలసిన ప్రభుత్వం వారికి మద్యాన్ని కావల్సినంత సరఫరా చేస్తామని నిర్భీతిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం లో మద్యం బాబులకు హుషారైన కబుర్లు చెప్పేవారు. ‘‘ఏం తమ్ముళ్లూ.. సాయంత్రం అయితే ఒకటి,రెండు పెగ్గులు వేసుకుంటారు. ధరలు పెంచి జగన్ ప్రభుత్వం దానిని అందుబాటులో లేకుండా చేసిందా? లేదా?. మేం అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే సరఫరా చేస్తాం’’ అంటూ హామీ ఇచ్చారు. బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి హామీ ఇచ్చిన నేత ఇంకొకరు ఉండరు.ఈ విషయంలో చంద్రబాబు రికార్డు నెలకొల్పి ఉంటారు. మొత్తం మీద మందుబాబుల మద్దతు బాగానే కూడగట్టుకున్నారు. సుమారు పాతికలక్షల మంది మద్యం వినియోగదార్లు కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారన్నది ఒక అంచనా. జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద అనేక వ్యాధులను చేర్చి ప్రజల ఆరోగ్యం కాపాడడానికి ప్రాదాన్యత ఇస్తే, చంద్రబాబు ప్రభుత్వం మద్యం సరఫరాకు ప్రాముఖ్యత ఇస్తోంది. వైఎస్సార్సీపీ టైమ్ లో ఉన్న బ్రాండ్లకు తోడు, కొన్ని కొత్త బ్రాండ్లను అయితే అందుబాటులోకి తెచ్చారు.కాని ధరలు మాత్రం తగ్గించలేదని మందుబాబులు చెబుతున్నారు. తెలంగాణతో పోల్చితే మద్యం ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయట. అయినా మందుబాబులు వాటి గురించి ఫీల్ కావడం లేదేమో తెలియదు. గత ప్రభుత్వం మద్యం షాపులను నిర్వహిస్తుంటే, తీవ్రమైన విమర్శలు గుప్పించిన టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలు ,ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే షాపులను కొనసాగిస్తుండడం విశేషం. టీడీపీకి చెందిన పలువురు ఎప్పుడు ప్రభుత్వ షాపులు ఎత్తివేస్తారా? ఎప్పుడు తాము షాపులు నడుపుకోవచ్చా?అని ఎదురు చూస్తున్నారట. కాని దానివల్ల ఏ సమస్యలు వస్తాయని భయపడుతున్నారో కాని, ఇంకా ప్రైవేటు షాపులకు ఓకే చేయలేదు. స్కూళ్లను బాగు చేయవలసిన ప్రభుత్వం పేకాట క్లబ్ లను ప్రోత్సహిస్తే.. పేదల ఆరోగ్యాన్ని కాపాడవలసిన ప్రభుత్వం మద్యాన్ని అధికంగా అందుబాటులోకి తెవడానికి ఉత్సాహపడుతోంది. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారా?అని ఎవరికైనా సందేహం రావొచ్చు. ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను ప్రజలు వ్యతిరేకించేవరకు ఎవరు ఏమి అనుకున్నా ప్రయోజనం ఉండదని చెప్పక తప్పదు.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్
-
ఫాంహౌజ్ పేకాట కేసు: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్
Hero Naga Shourya Father Shivalinga Prasad Arrested: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారులో ఇటీవల వెలుగు చూసిన మంచిరేవుల పేకాట కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు నాగశౌర్య తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: టేబుల్‌కు 5 లక్షలు క్యాసినో కింగ్‌పిన్ గుత్తా సుమన్‌తో కలిసి శివలింగప్రసాద్ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో శివలింగ ప్రసాద్ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: టేబుల్‌కు 5 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేకాట కేంద్రాలను సీఎం కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మూసివేయించారు. పేకాట ఎక్కడ ఆడినా.. ఆడించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీస్ శాఖ అనేక పేకాట క్లబ్బులను మూసివేయించి కఠిన చర్యలు చేపట్టింది. కానీ కొంతమంది పేకాటను చీకటి వ్యవహారంగా నడిపిస్తూ కోట్లు గడిస్తున్నారు. రకారకాల ఆఫర్లు చెప్పి, పండుగల స్పెషల్ అంటూ మూడు ముక్కలాటకు అన్ని హంగులున్న సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సైబరాబాద్‌లో పట్టుబడిన సుమన్ గ్యాంగ్ కేవలం ఒక చిన్న చేప మాత్రమే అని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పేకాట నడిపిస్తున్న మరో మాఫియా మూడు ముక్కలు.. ఆరు కోట్లు అన్నట్టుగా భారీస్థాయిలో జూదం నడిపిస్తోంది. సుమన్.. స్పెషల్ పేరిట... జి.సుమన్‌కుమార్ (జీఎస్కే) నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది వ్యాపారులు, ప్రముఖులకు వాట్సాప్‌ల ద్వారా పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీలు పెడుతున్నామని సందేశాలు పంపిస్తాడు. పార్టీ లొకేషన్ షేర్ చేస్తాడు. ఫాంహౌజ్, గెస్ట్‌హౌజ్‌లు కిరాయికి తీసుకొని మందు, విందు భారీస్థాయిలో ఏర్పాటు చేస్తాడు. కనీసం 5 నుంచి 10 టేబుళ్లు పెట్టి ప్రముఖులకు మినీ క్యాసినో ఏర్పాటు చేస్తాడు. అయితే స్పెషల్ అట్రాక్షన్ కోసం గోవా డీలర్ల నుంచి సుమన్ క్యాసినో గరŠల్స్‌ను రంగంలోకి దించుతున్నట్లు సైబరాబాద్ పోలీసుల విచారణలో వెల్లడైంది. సుమన్ ఆహ్వానం కోసం వీవీఐపీలంతా ఎదురుచూస్తారని విచారణలో తెలిసింది. హైదరాబాద్‌లోనే కాకుండా వీవీఐపీలను ప్రత్యేక విమానాల ద్వారా కేరళ, గోవా తీసుకెళ్లి కూడా జూదం ఆడిస్తాడని తెలిసింది. రెండు నెలల క్రితం సుమన్ కొంతమంది వ్యాపారులు, వీఐపీలతో కలిసి రష్యా వెళ్లాడు. అక్కడ క్యాసినోలో రూ.4.5 కోట్ల వ్యాపారం జరిపించినట్టు రష్యా వెళ్లి వచ్చిన ఓ వ్యాపారి ద్వారా వెల్లడైంది. ఇటీవల రష్యా వెళ్లినప్పుడు అక్కడ క్యాసినో ఆడుతున్న సుమన్ చౌదరి తదితరులు ఇది పెద్ద తిమింగళం... పేకాట దందాలో సుమన్‌కు మించిన ఓ తిమింగళం హైదరాబాద్ కేంద్రంగానే కోట్ల దందా సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి అండదండలు ఉండటంతోపాటు ఆయన కూడా జూదంలో చేయి తిరిగినవ్యక్తి కావడంతో పేకాట తిమింగళానికి అడ్డూఅదుపు లేదని నిఘా వర్గాలు చెప్పాయి. త్రీకార్డ్స్ (తీన్ పత్తా), రమ్మీ పాయింట్స్, పోకర్ ఈ మూడు రకాల పేకాటను ప్రముఖ వ్యక్తి అనుచరుడు జోరుగా సాగిస్తున్నాడు. వీవీఐపీలకు మాత్రమే తన అడ్డాలోకి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి 2 గంటల వరకు ఆయన దందా సాగిస్తున్నట్టు తెలిసింది. గతంలో టాస్క్‌ఫోర్స్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లోని ఓ ప్రముఖ హోటల్లో అతడిని అరెస్ట్ చేసినా సదరు నిర్వాహకుడి వ్యవహారం మారలేదని పోలీసులే చెప్తున్నారు. దందా ఎక్కడెక్కడ? బేగంపేటలోని ఓ క్లబ్బును ఏళ్లపాటు నిర్వహించిన పేకాట తిమింగళం తెలంగాణ ఏర్పడిన తర్వాత అనధికారిక కేంద్రాలను తెరిచింది. నగరానికి చెందిన ప్రముఖుడి అండ చూసుకొని కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్, దేవరయాంజాల్‌లోని 70 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్, జూబ్లీహిల్స్‌లో ప్రముఖ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్ మూడో ఫ్లోర్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని ఓ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ మొత్తం, బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 12లోని ప్రముఖుల నివాస ప్రాంతం, సెంట్రల్ జోన్ పరిధిలోని ఆదర్శ్‌నగర్, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌లోని సొంత ఫాంహౌజ్‌లో పేకాటను జోరుగా సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గేమ్‌కు ఐదు శాతం కమీషన్.. ప్రధానంగా త్రీకార్డ్స్, రమ్మీని ఆడించే ఈ నిర్వాహకుడు ప్రతీ టేబుల్‌కు కనీసం రూ.5 లక్షలు ఉంటేనే అనుమతిస్తాడు. మూడు ముక్కలాటలో బ్లైండ్గేమ్ పేరిట జరిగే దందానే అతడికి కాసులు కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ గేమ్‌కి (కిట్) పాడిన మొత్తంలో 5 శాతం కమీ షన్‌గా తీసుకుంటాడు. ఉదాహరణకు ఐదుగురు కలిసి ఒక్కో గేమ్‌కి రూ.లక్ష చొప్పున ఆడినా రూ.5 లక్షలు అవుతాయి. అందులో ఒక గేమ్‌కి 5 శాతం కమీషన్ అంటే రూ.25 వేల చొప్పున వసూలు చేస్తాడు. ఇలా రోజుకు 20–25 గేమ్‌లు నడిపిస్తాడు. దీంతోపాటు రమ్మీ పాయింట్స్ 101కు ఐదుగురు రూ.5 లక్షల చొప్పున ఒక్కో గేమ్ ఆడితే రూ.25 లక్షలు అవుతుంది. ఇందులో 5 శాతం కమీషన్‌గా 1.25 లక్షలు తీసుకుంటాడు. ఇలాంటి రమ్మీ పాయింట్లు కనీసం నాలుగు గేములు ఆడుతున్నారంటే రూ.5 లక్షలు తన ఖాతాలోకి వెళ్లాల్సిందే. దీనికి అన్లిమిటెడ్ ఆఫర్‌గా ఆల్కహాల్, ఆహారం అందిస్తాడు. గోవా నుంచి వచ్చిన అమ్మాయిలను రంగంలోకి దించడం ఈ నిర్వాహకుడి ప్రత్యేకత. సుమన్‌తోపాటు అతనికి సహకరిస్తూ పేకాట సెంటర్లు నిర్వహిస్తున్న ప్రముఖ నిర్వాహకుడిపై పోలీసులు నజర్ పెట్టినట్లు తెలిసింది. -
నిఘా నిద్ర.. జూదం దర్జా!
ఆళ్లగడ్డ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పిచ్చలాట, పేకాట, బెట్టింగ్‌ల వంటి అసాంఘిక కార్యకలాపాలు జడలు విప్పి కరతాళ నృత్యం చేస్తున్నాయి. ఆయా గ్రామాల్లో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా జూద క్రీడలను పలువురు దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు.. ముఖ్యంగా యువత జూదాలకు బానిసలై పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుని అప్పులపాలవుతున్నారు. కొందరు ఇల్లు విడిచి వెళ్తుండగా, మరి కొందరు అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. నిరోధించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. – ఆళ్లగడ్డ సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డ నియోజవర్గంలోని రుద్రవరం మండలం ఆలమూరు, తువ్వపల్లె, గుట్టకొండ నరసింహస్వామి, డికొట్టాల, పెద్దకంబలూరు, చాగలమర్రి మండలం బైవరగుండాలు, తెలుగు గంగ కాల్వ, రాజోలి ఆనకట్ట, మండల కేంద్రం ఉయ్యలవాడ, జమ్ములదిన్నె తదితర ప్రదేశాల్లో పిచ్చలాట, మంగపత్త, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలపాలు కొన్ని మాసాలుగా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో జన సంచారం లేని ప్రదేశాల్లో ఈ జూదాలను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. ఇక వారంతాల్లో, సెలవు దినాల్లో ఈ వికృత క్రీడల నిర్వహణ పతాక స్థాయికి చేరుతోంది. పలు ప్రదేశాల్లో రాత్రి సమయంలో కూడా ఈ జూదాలను నిర్వహిస్తున్నారు. ఆయా తోటలు, ప్రదేశాల్లో విద్యుద్దీపాలు, చార్జింగ్ లైట్లు ఏర్పాటు చేసుకుని జూదాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఇందులో నిర్వాహకులు డిక్కు (పర్సేంటేజి) కింద 10 నుంచి 30 శాతం వరకు వసూలు చేస్తున్నారు. పలు చోట్ల జూదం ఆడే ప్రదేశానికి మ«ధ్యాన్ని కూడా సరఫరా చేస్తుండటం విశేషం. చిత్తవుతున్న యువత.. యథేచ్ఛగా జరుగుతున్న ఈ జూద క్రీడల్లో పేద, మధ్యతరగతి యువత బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల ఆళ్లగడ్డ రూరల్ మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన ఓ యువకడు పిచ్చలాట ఆడుతూ ఇంట్లో ఉన్న రూ.3 లక్షలు పోగొట్టుకోగా మరో రూ.2 లక్షలు అక్కడే అప్పు చేశాడు. అయినప్పటికీ చేయి తిరగకపోవడంతో అప్పిచ్చినవారు ఒత్తిడి చేయడంతో ఇల్లొదిలి పారిపోయాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో జూదం ఆడేందుకు డబ్బులు ఇచ్చిన వారే మా పిల్లోడిని ఏదైనా చేశారేమోనని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జూదరులను విచారించారు. అప్పు చెల్లించలేక తిరుపతి పారిపోయినట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొన్ని మాసల క్రితం పిచ్చలాటలో రూ.లక్షలు పోగొట్టుకుని అధిక వడ్డీలు చెల్లించలేక రుద్రవరం మండలంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ పోలీసులు దృష్టిసారించడంలేదనే విమర్శలున్నాయి. వడ్డీ వ్యాపారుల కనుసన్నల్లో.. జూదాల్లో డబ్బులు పోగుట్టుకున్నవారిని కొందరు వడ్డీ వ్యాపారులు ఎంచుకుంటున్నారు. వారికి మరీ అప్పులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ద్విచక్రవాహనాలను, పొలాల పాస్‌బుక్కులను, ఇంటి స్థలాల డాక్యుమెంట్లను, బంగారాన్ని, వెండిని కుదవకు పెట్టుకుని అధిక వడ్డీకి అప్పు ఇస్తున్నారు. దీంతో పాటు ఖాళీ పత్రాలు, స్టాంపులు, ప్రామిసరి నోట్లపై సంతకాలు, వేలి ముద్రలు తీసుకుంటున్నారు. ఇక్కడ వారం, రోజు వడ్డీతో పాటు గంటల వడ్డీ కూడా నడుస్తుండటం గమనార్హం. రోజుకు నూటికి రూ.10, వారానికి రూ.50 లెక్కన వడ్డీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రకమైన వడ్డీలను వసూలు చేసుకుంటున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. చెప్పిన సమయానికి వడ్డీ చెల్లించకపోతే తన అనుయాయుల ద్వారా బెదిరింపులకు పాల్పడటం, అప్పటికీ ఇవ్వక పోతే దాడులు చేయడం జరుగుతోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి నిఘా ఏర్పాటు చేసి, అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం వేయాలని స్థానికలు కోరుతున్నారు. సరిహద్దు ప్రదేశాలే.. జూదరులు పోలీసుల కల్లుగప్పేందుకు రెండు మండాలల సరిహుద్దులు, జిల్లా సరిహద్దుల్లో జూద కేంద్రాలను ఏర్పాటు చేసుకుని కొనసాగిస్తున్నారు. అక్కడైతే పోలీసులు తమ పరిధి కాదన్నట్లు ఉంటారనే ధైర్యం. దీనికి తోడు వాహనాలు వెళ్లలేని ప్రదేశాన్ని జూదం ఆడేందుకు ఎంచుకుంటున్నారు. సమాచారం తెలిసినా పోలీసులు కాలినడకన వెళ్లేందుకు ఇష్టపడక, వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. చర్యలు తీసుకుంటాం వారం క్రితం లింగందిన్నె యువకుడు అదృశ్యమైన విషయం నా దృష్టికి వచ్చింది. సబ్‌డివిజన్ వ్యాప్తంగా గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. అవసరమైతే ప్రత్యేక బలగాలతో గాలింపు చేపడతాం. జూదరులతో పాటు ఆడించేవారిపైనా కఠిన చర్యలు ఉంటాయి. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. – తిప్పేస్వామి, ఆళ్లగడ్డ డీఎస్పీ సరిహద్దు ప్రదేశాలే.. -
మీ ఆటలు సాగనివ్వను
- గుడివాడ క్లబ్లో జూదం నిర్వహణకు ఏర్పాట్లు - అడ్డుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని - వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన - వెనుదిరిగిన నిర్వాహకులు గుడివాడ : స్థానిక గుడివాడ క్లబ్లో పేకాట కార్యకలాపాల ప్రారంభాన్ని వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అడ్డుకున్నారు. విజయదశమి(శుక్రవారం) రోజు గుడివాడ క్లబ్లో పేకాట నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమచారం అందడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి వెళ్లిన కొడాలి నాని ఆందోళన నిర్వహించారు. తాను గుడివాడలో ఉండగా.. పేకాట ఆడనివ్వబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో క్లబ్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు నిర్వాహకులు పేకాట నిర్వహణను విరమించుకోవడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. ఆరేళ్ల క్రితం పేకాటకు బ్రేక్.. స్థానిక పోస్టాఫీసు రోడ్డులో ఉన్న ది గుడివాడ క్లబ్లో ఆరేళ్ల క్రితం పేకాట, జూద కార్యక్రమాలను నిలిపివేశారు. గతంలో 20 ఏళ్ల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ క్లబ్లో పేకాట పెద్ద ఎత్తున కొనసాగేది. పోలీసులు ఈ క్లబ్ వైపు చూడటానికి కూడా సాహసించేవారు కాదు. ఆరేళ్ల క్రితం క్లబ్లో పేకాట నిర్వహణపై ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) నాయకత్వంలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిరాహార దీక్షలు నిర్వహించారు. ఫలితంగా క్లబ్లో జూద కార్యకలాపాలకు తెరపడింది. అప్పటి నుంచి పలుమార్లు క్లబ్లో పేకాట ఆడించటానికి ప్రయత్నించినా అడ్డుకుంటూ వచ్చారు. మంత్రి, ఎంపీ అండతో మళ్లీ గ్రీన్ సిగ్నల్.. కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలోని కొందరు ప్రజా ప్రతినిధులు ఈ క్లబ్లో పేకాట ఆడించటానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అందులో భాగంగా శుక్రవారం విజయ దశమి రోజు పశ్చిమ గోదావరికి చెందిన అధికార పార్టీ ఎంపీ, జిల్లాకు చెందిన మంత్రి ఆధ్వర్యాన క్లబ్లో పేకాట ఆడించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారితో కూడా మాట్లాడినట్లు సమాచారం. విజయదశమి రోజు సాయంత్రం 6 గంటలకు పేకాట క్లబ్ ప్రారంభమవుతుందని వివిధ ప్రాంతాల్లో ఉన్న సభ్యులందరికీ సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యాన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున క్లబ్ వద్దకు చేరుకున్నారు. పేకాట ఆడేందుకు ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో గుడివాడ డీఎస్పీ నాగన్న తన సిబ్బందితో కలిసి వచ్చారు. అప్పటికే క్లబ్ ప్రాంగణమంతా ఆందోళనకారులతో కిక్కిరిసిపోయింది. పేకాట ఆడనివ్వను : కొడాలి నాని క్లబ్‌ను పరిశీలించిన అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ పేకాట ఆడేందుకు టేబుళ్లు సిద్ధం చేశారని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితిలోనూ ఈ క్లబ్లో పేకాట ఆడనివ్వబోనని చెప్పారు. గతంలో ఎన్నో ఆందోళనల ఫలితంగా క్లబ్లో పేకాటను నిషేధించారని తెలిపారు. గతంలో మంత్రిగా ఉన్న పిన్నమనేని ఆధ్వర్యాన ఇక్కడ పేకాట బాగా ఆడేవారని, ఎంతో కష్టపడి నిలిపివేయగలిగామని చెప్పారు. గడచిన ఆరేళ్లుగా పేకాట ఆడనివ్వడం లేదని పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ పేకాట వంటి జూదాల నిర్వహణను ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు. కొందరి స్వార్థం కోసం మంత్రులు, ఎంపీలు కలిసి క్లబ్లో పేకాట ఆడించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి రెవెన్యూ స్థలాన్ని ఆక్రమించుకుని క్లబ్ నిర్మించారని, అంతటితో ఆగకుండా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం దారుణమన్నారు. క్లబ్ పక్కన రోడ్డు మాస్టర్ ప్లాన్‌లో 40 అడుగులు ఉండగా, క్లబ్ నిర్వాహకులు ఆక్రమించుకుని 20 అడుగులకు కుదించారని తెలిపారు. ఈ రోడ్డును వెంటనే 40 అడుగులకు విస్తరించాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుకు సూచించారు. పేకాట వల్ల తమ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఎందరో మహిళలు తన వద్ద ఆందోళన వ్యక్తంచేశారని నాని చెప్పారు. క్లబ్లో పేకాటకు పోలీసులు అనుమతిస్తే ఎంతటి పోరాటాలకైనా వెనుకాడబోమని ఆయన స్పష్టంచేశారు. క్లబ్ ఎదుట ఆందోళన పేకాట క్లబ్ ప్రారంభోత్సవానికి మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబు వస్తున్నారని తెలియడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పేకాట ఆడించడం లేదని ప్రకటించే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో డీఎస్సీ నాగన్న జోక్యం చేసుకుని పేకాట ఆడించబోమని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, వైఎస్సార్ సీపీ నాయకులు పాలేటి చంటి, పాలడుగు రాంప్రసాద్, కౌన్సిలర్లు చొరగుడి రవికాంత్, వసంతవాడ దుర్గారావు, గొర్ల శ్రీనివాసరావు, వెంపల హైమావతి, సూర్యప్రభ, మాదాసు వెంకటలక్ష్మి, మూడెడ్ల ఉమా, కాటి విశాల, శశికళా, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంవీ నారాయణరెడ్డి, దేశిరెడ్డి రామ్మోహనరెడ్డి, ఆ పార్టీ నందివాడ కన్వీనర్ పి.ఆదాము పాల్గొన్నారు.