మీ ఆటలు సాగనివ్వను | Gudiwada gambling club management arrangements | Sakshi
Sakshi News home page

మీ ఆటలు సాగనివ్వను

Published Sun, Oct 5 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

మీ ఆటలు సాగనివ్వను

మీ ఆటలు సాగనివ్వను

- గుడివాడ క్లబ్‌లో జూదం నిర్వహణకు ఏర్పాట్లు
- అడ్డుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని
- వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన
- వెనుదిరిగిన నిర్వాహకులు
గుడివాడ : స్థానిక గుడివాడ క్లబ్‌లో పేకాట కార్యకలాపాల ప్రారంభాన్ని వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అడ్డుకున్నారు. విజయదశమి(శుక్రవారం) రోజు గుడివాడ క్లబ్‌లో పేకాట నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమచారం అందడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి వెళ్లిన కొడాలి నాని ఆందోళన నిర్వహించారు. తాను గుడివాడలో ఉండగా.. పేకాట ఆడనివ్వబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో క్లబ్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు నిర్వాహకులు పేకాట నిర్వహణను విరమించుకోవడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది.
 
ఆరేళ్ల క్రితం పేకాటకు బ్రేక్..

స్థానిక పోస్టాఫీసు రోడ్డులో ఉన్న ది గుడివాడ క్లబ్‌లో ఆరేళ్ల క్రితం పేకాట, జూద కార్యక్రమాలను నిలిపివేశారు. గతంలో 20 ఏళ్ల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ క్లబ్‌లో పేకాట పెద్ద ఎత్తున కొనసాగేది. పోలీసులు ఈ క్లబ్ వైపు చూడటానికి   కూడా సాహసించేవారు కాదు. ఆరేళ్ల క్రితం క్లబ్‌లో పేకాట నిర్వహణపై ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) నాయకత్వంలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిరాహార దీక్షలు నిర్వహించారు. ఫలితంగా క్లబ్‌లో జూద కార్యకలాపాలకు తెరపడింది. అప్పటి నుంచి పలుమార్లు క్లబ్‌లో పేకాట ఆడించటానికి ప్రయత్నించినా అడ్డుకుంటూ వచ్చారు.
 
మంత్రి, ఎంపీ అండతో మళ్లీ గ్రీన్ సిగ్నల్..
కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలోని కొందరు ప్రజా ప్రతినిధులు ఈ క్లబ్‌లో పేకాట ఆడించటానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అందులో భాగంగా శుక్రవారం విజయ దశమి రోజు పశ్చిమ గోదావరికి చెందిన అధికార పార్టీ ఎంపీ, జిల్లాకు చెందిన మంత్రి ఆధ్వర్యాన క్లబ్‌లో పేకాట ఆడించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారితో కూడా మాట్లాడినట్లు సమాచారం. విజయదశమి రోజు సాయంత్రం 6 గంటలకు పేకాట క్లబ్ ప్రారంభమవుతుందని వివిధ ప్రాంతాల్లో ఉన్న సభ్యులందరికీ సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యాన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున క్లబ్ వద్దకు చేరుకున్నారు. పేకాట ఆడేందుకు ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో గుడివాడ డీఎస్పీ నాగన్న తన సిబ్బందితో కలిసి వచ్చారు. అప్పటికే క్లబ్ ప్రాంగణమంతా ఆందోళనకారులతో కిక్కిరిసిపోయింది.
 
పేకాట ఆడనివ్వను : కొడాలి నాని
క్లబ్‌ను పరిశీలించిన అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ పేకాట ఆడేందుకు టేబుళ్లు సిద్ధం చేశారని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితిలోనూ ఈ క్లబ్‌లో పేకాట ఆడనివ్వబోనని చెప్పారు. గతంలో ఎన్నో ఆందోళనల ఫలితంగా క్లబ్‌లో పేకాటను నిషేధించారని తెలిపారు. గతంలో మంత్రిగా ఉన్న పిన్నమనేని ఆధ్వర్యాన ఇక్కడ పేకాట బాగా ఆడేవారని, ఎంతో కష్టపడి నిలిపివేయగలిగామని చెప్పారు. గడచిన ఆరేళ్లుగా పేకాట ఆడనివ్వడం లేదని పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ పేకాట వంటి జూదాల నిర్వహణను ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు.

కొందరి స్వార్థం కోసం మంత్రులు, ఎంపీలు కలిసి క్లబ్‌లో పేకాట ఆడించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి రెవెన్యూ స్థలాన్ని ఆక్రమించుకుని క్లబ్ నిర్మించారని, అంతటితో ఆగకుండా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం దారుణమన్నారు. క్లబ్ పక్కన రోడ్డు మాస్టర్ ప్లాన్‌లో 40 అడుగులు ఉండగా, క్లబ్ నిర్వాహకులు ఆక్రమించుకుని 20 అడుగులకు కుదించారని తెలిపారు. ఈ రోడ్డును వెంటనే 40 అడుగులకు విస్తరించాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుకు సూచించారు. పేకాట వల్ల తమ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఎందరో మహిళలు తన వద్ద ఆందోళన వ్యక్తంచేశారని నాని చెప్పారు. క్లబ్‌లో పేకాటకు పోలీసులు అనుమతిస్తే ఎంతటి పోరాటాలకైనా వెనుకాడబోమని ఆయన స్పష్టంచేశారు.  

క్లబ్ ఎదుట ఆందోళన
పేకాట క్లబ్ ప్రారంభోత్సవానికి మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబు వస్తున్నారని తెలియడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పేకాట ఆడించడం లేదని ప్రకటించే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో డీఎస్సీ నాగన్న జోక్యం చేసుకుని పేకాట ఆడించబోమని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, వైఎస్సార్ సీపీ నాయకులు పాలేటి చంటి, పాలడుగు రాంప్రసాద్, కౌన్సిలర్లు చొరగుడి రవికాంత్, వసంతవాడ దుర్గారావు, గొర్ల శ్రీనివాసరావు, వెంపల హైమావతి, సూర్యప్రభ, మాదాసు వెంకటలక్ష్మి, మూడెడ్ల ఉమా, కాటి విశాల, శశికళా, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంవీ నారాయణరెడ్డి, దేశిరెడ్డి రామ్మోహనరెడ్డి, ఆ పార్టీ నందివాడ కన్వీనర్ పి.ఆదాము పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement