నాగశౌర్య ఫామ్‌హౌజ్‌ కేసు: టేబుల్‌కు 5 లక్షలు  | Naga Shourya Farm house Case Details About Suman | Sakshi
Sakshi News home page

నాగశౌర్య ఫామ్‌హౌజ్‌ కేసు: టేబుల్‌కు 5 లక్షలు 

Published Tue, Nov 2 2021 2:52 AM | Last Updated on Tue, Nov 2 2021 3:01 AM

Naga Shourya Farm house Case Details About Suman - Sakshi

క్యాసినోను చూపిస్తున్న సుమన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పేకాట కేంద్రాలను సీఎం కేసీఆర్‌ తొలిసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మూసివేయించారు. పేకాట ఎక్కడ ఆడినా.. ఆడించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీస్‌ శాఖ అనేక పేకాట క్లబ్బులను మూసివేయించి కఠిన చర్యలు చేపట్టింది. కానీ కొంతమంది పేకాటను చీకటి వ్యవహారంగా నడిపిస్తూ కోట్లు గడిస్తున్నారు. రకారకాల ఆఫర్లు చెప్పి, పండుగల స్పెషల్‌ అంటూ మూడు ముక్కలాటకు అన్ని హంగులున్న సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సైబరాబాద్‌లో పట్టుబడిన సుమన్‌ గ్యాంగ్‌ కేవలం ఒక చిన్న చేప మాత్రమే అని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పేకాట నడిపిస్తున్న మరో మాఫియా మూడు ముక్కలు.. ఆరు కోట్లు అన్నట్టుగా భారీస్థాయిలో జూదం నడిపిస్తోంది. 

సుమన్‌.. స్పెషల్‌ పేరిట... 
జి.సుమన్‌కుమార్‌ (జీఎస్‌కే) నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది వ్యాపారులు, ప్రముఖులకు వాట్సాప్‌ల ద్వారా పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీలు పెడుతున్నామని సందేశాలు పంపిస్తాడు. పార్టీ లొకేషన్‌ షేర్‌ చేస్తాడు. ఫాంహౌజ్, గెస్ట్‌హౌజ్‌లు కిరాయికి తీసుకొని మందు, విందు భారీస్థాయిలో ఏర్పాటు చేస్తాడు. కనీసం 5 నుంచి 10 టేబుళ్లు పెట్టి ప్రముఖులకు మినీ క్యాసినో ఏర్పాటు చేస్తాడు. అయితే స్పెషల్‌ అట్రాక్షన్‌ కోసం గోవా డీలర్ల నుంచి సుమన్‌ క్యాసినో గరŠల్స్‌ను రంగంలోకి దించుతున్నట్లు సైబరాబాద్‌ పోలీసుల విచారణలో వెల్లడైంది. సుమన్‌ ఆహ్వానం కోసం వీవీఐపీలంతా ఎదురుచూస్తారని విచారణలో తెలిసింది. హైదరాబాద్‌లోనే కాకుండా వీవీఐపీలను ప్రత్యేక విమానాల ద్వారా కేరళ, గోవా తీసుకెళ్లి కూడా జూదం ఆడిస్తాడని తెలిసింది. రెండు నెలల క్రితం సుమన్‌ కొంతమంది వ్యాపారులు, వీఐపీలతో కలిసి రష్యా వెళ్లాడు. అక్కడ క్యాసినోలో రూ.4.5 కోట్ల వ్యాపారం జరిపించినట్టు రష్యా వెళ్లి వచ్చిన ఓ వ్యాపారి ద్వారా వెల్లడైంది.  


ఇటీవల రష్యా వెళ్లినప్పుడు అక్కడ క్యాసినో ఆడుతున్న సుమన్‌ చౌదరి తదితరులు 

ఇది పెద్ద తిమింగళం... 
పేకాట దందాలో సుమన్‌కు మించిన ఓ తిమింగళం హైదరాబాద్‌ కేంద్రంగానే కోట్ల దందా సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి అండదండలు ఉండటంతోపాటు ఆయన కూడా జూదంలో చేయి తిరిగినవ్యక్తి కావడంతో పేకాట తిమింగళానికి అడ్డూఅదుపు లేదని నిఘా వర్గాలు చెప్పాయి. త్రీకార్డ్స్‌ (తీన్‌ పత్తా), రమ్మీ పాయింట్స్, పోకర్‌ ఈ మూడు రకాల పేకాటను ప్రముఖ వ్యక్తి అనుచరుడు జోరుగా సాగిస్తున్నాడు. వీవీఐపీలకు మాత్రమే తన అడ్డాలోకి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి 2 గంటల వరకు ఆయన దందా సాగిస్తున్నట్టు తెలిసింది. గతంలో టాస్క్‌ఫోర్స్‌ ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లోని ఓ ప్రముఖ హోటల్లో అతడిని అరెస్ట్‌ చేసినా సదరు నిర్వాహకుడి వ్యవహారం మారలేదని పోలీసులే చెప్తున్నారు. 

దందా ఎక్కడెక్కడ? 
బేగంపేటలోని ఓ క్లబ్బును ఏళ్లపాటు నిర్వహించిన పేకాట తిమింగళం తెలంగాణ ఏర్పడిన తర్వాత అనధికారిక కేంద్రాలను తెరిచింది. నగరానికి చెందిన ప్రముఖుడి అండ చూసుకొని కొంపల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్, దేవరయాంజాల్‌లోని 70 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్, జూబ్లీహిల్స్‌లో ప్రముఖ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ మూడో ఫ్లోర్, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లోర్‌ మొత్తం, బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌ 12లోని ప్రముఖుల నివాస ప్రాంతం, సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని ఆదర్శ్‌నగర్, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌లోని సొంత ఫాంహౌజ్‌లో పేకాటను జోరుగా సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

గేమ్‌కు ఐదు శాతం కమీషన్‌.. 
ప్రధానంగా త్రీకార్డ్స్, రమ్మీని ఆడించే ఈ నిర్వాహకుడు ప్రతీ టేబుల్‌కు కనీసం రూ.5 లక్షలు ఉంటేనే అనుమతిస్తాడు. మూడు ముక్కలాటలో బ్‌లైండ్‌గేమ్‌ పేరిట జరిగే దందానే అతడికి కాసులు కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ గేమ్‌కి (కిట్‌) పాడిన మొత్తంలో 5 శాతం కమీ షన్‌గా తీసుకుంటాడు. ఉదాహరణకు ఐదుగురు కలిసి ఒక్కో గేమ్‌కి రూ.లక్ష చొప్పున ఆడినా రూ.5 లక్షలు అవుతాయి. అందులో ఒక గేమ్‌కి 5 శాతం కమీషన్‌ అంటే రూ.25 వేల చొప్పున వసూలు చేస్తాడు. ఇలా రోజుకు 20–25 గేమ్‌లు నడిపిస్తాడు. దీంతోపాటు రమ్మీ పాయింట్స్‌ 101కు ఐదుగురు రూ.5 లక్షల చొప్పున ఒక్కో గేమ్‌ ఆడితే రూ.25 లక్షలు అవుతుంది. ఇందులో 5 శాతం కమీషన్‌గా 1.25 లక్షలు తీసుకుంటాడు. ఇలాంటి రమ్మీ పాయింట్లు కనీసం నాలుగు గేములు ఆడుతున్నారంటే రూ.5 లక్షలు తన ఖాతాలోకి వెళ్లాల్సిందే. దీనికి అన్‌లిమిటెడ్‌ ఆఫర్‌గా ఆల్కహాల్, ఆహారం అందిస్తాడు. గోవా నుంచి వచ్చిన అమ్మాయిలను రంగంలోకి దించడం ఈ నిర్వాహకుడి ప్రత్యేకత. సుమన్‌తోపాటు అతనికి సహకరిస్తూ పేకాట సెంటర్లు నిర్వహిస్తున్న ప్రముఖ నిర్వాహకుడిపై పోలీసులు నజర్‌ పెట్టినట్లు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement