సాధారణంగా ఎవరైనా ప్రజా ప్రతినిధి ఏదైనా సమావేశంలో పాల్గొంటే.. నాలుగు మంచి మాటలు చెబుతారు. చెడు అలవాట్లకు వెళ్లవద్దని సూచిస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన వాతావరణం నెలకొంది. అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే నిర్భీతిగా పేకాట క్లబ్ లను తెరపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకుంటామని కూడా ధైర్యంగా చెబుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ స్కూళ్లలో గతంలో మాదిరి చదువులపై శ్రద్ద చూపడం లేదన్న విమర్శలు వస్తుంటే, మరో వైపు పేకాట క్లబ్‌లకు శ్రీకారం చుడుతున్నారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇలాంటి క్లబ్ లను అనుమతించలేదు.దాంతో కొందరు బడాబాబులకు కోపం వచ్చేదట. కొన్ని చోట్ల ఆఫీసర్ల క్లబ్ లు కూడా పేకాటను అనుమతించకపోవడంపై గుర్రుగా ఉండేవట. అలాంటివారంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారని చెబుతారు. జగన్ ప్రభుత్వం ఓడిపోతోందన్న సమాచారం వస్తుండగానే.. గుంటూరు, విజయవాడ వంటి కొన్ని చోట్ల పేకాట క్లబ్ లు తెరచుకున్నాయని సమాచారం. మరి అనంతపురం వంటి చోట ఎందుకు ఆలస్యం అయిందో తెలియదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను క్లబ్ వారు పిలిచి సమావేశం పెట్టి కార్డ్స్ ను అనుమతించాలని కోరారు. దానికి ఆయన బదులు ఇస్తూ రాష్ట్రం అంతా క్లబ్ లు తెరిపిస్తానని హామీ ఇచ్చారట.
అధికారులు, ఇతర వర్గాల రిలాక్సేషన్ కోసం క్లబ్ లు ఏర్పాటు అవుతుంటాయి. వాటిలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కుటుంబాలతో కలిసి వచ్చి ఆనందంతో పాల్గొనడం ఆనవాయితీగా ఉంటుంది. కాని అవి రాను,రాను పేకాట క్లబ్ లు గా మారిపోయాయి. కొంతమంది వేల రూపాయల డబ్బును ఈ క్లబ్ లలో కోల్పోయి అప్పుల పాలవుతుంటారు. క్లబ్ ల నిర్వహణ ఒక వ్యాపారంగా మార్చివేశారు.కల్చరల్ క్లబ్ లు కాస్త జూదశాలలుగా మార్చివేయడంలో మాఫియాల పాత్ర ఉందని అంటారు.
గతంలో హైదరాబాద్ లో కొన్ని ప్రైవేటు వ్యాపార సంస్థలు క్లబ్ లను నిర్వహించి పెద్ద ఎత్తున జూదాన్ని ప్రోత్సహించేవి. తత్ఫలితంగా కొందరు లక్షలు,కోట్ల రూపాయల మేర నష్టపోయిన ఘటనలు ఉండేవి.ఈ కారణంగా కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దాంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ క్లబ్ లను నిషేధించారు. కేవలం చట్టబద్దమైన క్లబ్ లను మాత్రమే అనుమతించారు. ఏపీలో కూడా అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉండగా, జగన్ ప్రభుత్వం అలాంటివాటిని అదుపు చేసింది. కాని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇలాంటి జూదగాళ్లకు ఉత్సాహం వచ్చింది. అనంతపురం క్లబ్ లో నాలుగేళ్లుగా జూదం బంద్ అయిందని, దీనిని ఆరంభించడానికి కలెక్టర్ తో మాట్లాడానని, రాష్ట్రవ్యాప్తంగా జూదక్లబ్ ల పునరుద్దరణకు ముఖ్యమంత్రి అనుమతి కోరతామని ఆ టీడీపీ ఎమ్మెల్యే నిస్సిగ్గుగా ప్రకటించారు.
పైగా ఈ ఎమ్మెల్యే గారు ఇంకో సంగతి చెప్పారు. కరోనా టైమ్ లో క్లబ్ లో పేకాట లేనందువల్ల రిటైర్డ్ ఉద్యోగులు కొందరు మరణించారని అన్నారట. ఇదెక్కడి విడ్డూరం. ఆ రోజుల్లో అసలు ఎక్కడా జనం గుమికూడవద్దని ప్రభుత్వాలు ఆంక్షలు పెడితే, క్లబ్ లు నడవకపోవడం వల్ల మరణాలు సంభవించాయని చెప్పడం వింతగానే ఉంటుంది.
పేద విద్యార్ధులకు అవసరమైన పుస్తకాలు, డ్రెస్ లు వంటివి సకాలంలో అందుతున్నాయా?లేదా?వారికి స్కూల్ టీచర్లు పాఠాలు సరిగా బోధిస్తున్నారా?లేదా?అన్నవి చూడవలసిన గౌరవ ఎమ్మెల్యే పేకాట క్లబ్ ల గురించి ఆసక్తి కనబరచడం విశేషం. దీనిని బట్టి ప్రజలు ఎలాంటివారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది, ఎలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది అర్ధం చేసుకోవచ్చు. మరో సంగతి కూడా చెప్పాలి.
ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టవలసిన ప్రభుత్వం వారికి మద్యాన్ని కావల్సినంత సరఫరా చేస్తామని నిర్భీతిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం లో మద్యం బాబులకు హుషారైన కబుర్లు చెప్పేవారు. ‘‘ఏం తమ్ముళ్లూ.. సాయంత్రం అయితే ఒకటి,రెండు పెగ్గులు వేసుకుంటారు. ధరలు పెంచి జగన్ ప్రభుత్వం దానిని అందుబాటులో లేకుండా చేసిందా? లేదా?. మేం అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే సరఫరా చేస్తాం’’ అంటూ హామీ ఇచ్చారు. బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి హామీ ఇచ్చిన నేత ఇంకొకరు ఉండరు.ఈ విషయంలో చంద్రబాబు రికార్డు నెలకొల్పి ఉంటారు.
మొత్తం మీద మందుబాబుల మద్దతు బాగానే కూడగట్టుకున్నారు. సుమారు పాతికలక్షల మంది మద్యం వినియోగదార్లు కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారన్నది ఒక అంచనా. జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద అనేక వ్యాధులను చేర్చి ప్రజల ఆరోగ్యం కాపాడడానికి ప్రాదాన్యత ఇస్తే, చంద్రబాబు ప్రభుత్వం మద్యం సరఫరాకు ప్రాముఖ్యత ఇస్తోంది. వైఎస్సార్‌సీపీ టైమ్ లో ఉన్న బ్రాండ్లకు తోడు, కొన్ని కొత్త బ్రాండ్లను అయితే అందుబాటులోకి తెచ్చారు.కాని ధరలు మాత్రం తగ్గించలేదని మందుబాబులు చెబుతున్నారు. తెలంగాణతో పోల్చితే మద్యం ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయట. అయినా మందుబాబులు వాటి గురించి ఫీల్ కావడం లేదేమో తెలియదు.
గత ప్రభుత్వం మద్యం షాపులను నిర్వహిస్తుంటే, తీవ్రమైన విమర్శలు గుప్పించిన టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలు ,ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే షాపులను కొనసాగిస్తుండడం విశేషం. టీడీపీకి చెందిన పలువురు ఎప్పుడు ప్రభుత్వ షాపులు ఎత్తివేస్తారా? ఎప్పుడు తాము షాపులు నడుపుకోవచ్చా?అని ఎదురు చూస్తున్నారట. కాని దానివల్ల ఏ సమస్యలు వస్తాయని భయపడుతున్నారో కాని, ఇంకా ప్రైవేటు షాపులకు ఓకే చేయలేదు. స్కూళ్లను బాగు చేయవలసిన ప్రభుత్వం పేకాట క్లబ్ లను ప్రోత్సహిస్తే.. పేదల ఆరోగ్యాన్ని కాపాడవలసిన ప్రభుత్వం మద్యాన్ని అధికంగా అందుబాటులోకి తెవడానికి ఉత్సాహపడుతోంది. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారా?అని ఎవరికైనా సందేహం రావొచ్చు. ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను ప్రజలు వ్యతిరేకించేవరకు ఎవరు ఏమి అనుకున్నా ప్రయోజనం ఉండదని చెప్పక తప్పదు.
::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment