సాక్షి, కోదాడ(నల్గొండ) : ఆ..దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే.. కాసుల కోసం కక్కుర్తి పడి మరో ఇద్దరి పరీక్షలు రాస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని ఎంఎస్ కళాశాల సెంటర్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటకు చెందిన మహ్మద్‌సల్మాన్, తిరపతమ్మలు కోదాడలోని నాగార్జున్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలో చేరారు. ప్రస్తుతం ఎంఎస్ కళాశాల సెంటర్‌లో జరుగుతున్న ఫెనలీయర్ పరీక్షలు రాస్తున్నారు.
అయితే మహ్మద్‌సల్మాన్‌కు బదులుగా ఏపీలోని మక్కపేటకు చెందిన వత్సవాయి మండలం పోలంపల్లిలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అజ్మీర వెంకటప్పయ్య బీకాం పరీక్షకు హాజరయ్యాడు. ఇదే మాదిరిగా తిరపతమ్మకు బదులుగా పెనుగంచిప్రోలులో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్న వెంకటప్పయ్య భార్య బాణోతు కవిత బీఎస్సీ ఫైనలీయర్ పరీక్షకు హాజరైంది. విషయాన్ని పసిగట్టిన కొందరు వ్యక్తులు కోదాడ పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు పరీక్ష కేంద్రానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్న ఇద్దరినీ గుర్తించి అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
యూనివర్సిటీ నిర్వాహకుల మాయాజాలం...
కోదాడ పట్టణంలో నిర్వహిస్తున్న నాగార్జున్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వాహకులు వారికి ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరీక్షలు రాస్తున్న ఒక్కో విద్యార్థి నుంచి పేపర్‌కు వెయ్యి నుంచి రెండు వెయ్యిలు వసూళు చేస్తున్నారని, డబ్బులు కట్టలేని వారిని పరీక్ష రాయకుండా ఇబ్బందులు పెడుతున్నారని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డబ్బులు కట్టిన వారందరికీ సపరేటు రూం ఏర్పాటు చేసి అందులో నేరుగా పుస్తకాలు ఇచ్చి పరీక్ష రాయిస్తున్నారని తెలిపారు. ఇక ఒకరికి బదులు మరొకు పరీక్షలకు హాజరైతే దాదాపుగా రూ.10వేలకు పైగానే వసూలు చేస్తున్నారని సమాచారం. ఈ పరీక్షలకు హాజరయ్యే వారందరూ దాదాపుగా ఎదో ఓ ప్రభుత్వ ఉద్యోగం చేసే వారో లేక ప్రైవేట్ ఉద్యోగం చేసే వారే ఎక్కువగా ఉండటంతో వారు ప్రమోషన్‌ల కోసం సర్టిఫికెట్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో యూనివర్సిటీ నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment