నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రేమ్‌కాజల్, నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న బంగారు నగలు
చీరాల రూరల్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర బాల నేరస్తుడితో పాటు మరో ఇద్దరు నేరస్తులను చీరాల డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్, ఒంగోలు సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. వారి నుంచి 35 సవర్ల బంగారు ఆభరణాలతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి స్థానిక కొత్తపేటలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన బాల నేరస్తుడు ఇటీవల ఒంగోలు టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చేసిన దొంగతనం కేసులో దర్యాప్తు చేపట్టగా నిందితుని వేలి ముద్రలు గతంలో చేసిన పలు దొంగతనం కేసుల్లో వేలిముద్రలు సరిపోలినట్లు డీఎస్పీ తెలిపారు. ఆ వేలిముద్రలు ఆధారంగా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు స్థానిక టూ టౌన్ సీఐ జి.రామారావు, ఒంగోలు సీసీఎస్ డీఎస్పీ కె. శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి ముమ్మరంగా దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ ప్రేమ్ కాజల్ తెలిపారు. దర్యాప్తులో హైదరాబాద్‌కు చెందిన బాల నేరస్తుడు గతంలో హైదరాబాద్, వికారాబాద్, తిరుపతి, విశాఖ పట్టణం, ఒంగోలు, నెల్లూరు, చీరాల తదితర ప్రాంతాల్లో సంచరించి పదుల సంఖ్యలో దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందని డీఎస్పీ తెలిపారు.
హైదరాబాదులో జరిగిన దొంగతనం కేసుల్లో శిక్షలు పడగా అక్కడి బోస్టన్ స్కూలుకు కూడా బాల నేరస్తుణ్ణి తరలించారు. విడుదల అనంతరం అతడు పోలీసులు మరలా అరెస్టులు చేస్తారనే అనుమానంతో అక్కడి నుంచి గుంటూరుకు మకాం మార్చాడు. అక్కడ వెంకటేష్ అనేవ్యక్తితో పరిచయం పెంచుకుని అక్కడ కూడా దొంగతనాలు చేశారు. అక్కడి నుంచి చిలకలూరిపేటకు మకాం మార్చి శీలం రమేష్, భూలక్ష్మిలతో పరిచయం పెంచుకున్నారు. రమేష్ దంపతులు వివిధ గ్రామాలలో తిరుగుతూ చిక్కెంట్రుకల వ్యాపారం ముసుగులో ఇళ్లల్లో దొంగతనాలు చేస్తుంటారు. వీరిరువురూ బాల నేరస్తుణ్ణి తమవద్దే ఉంచుకుని అతని ద్వారా ఒంగోలు, నెల్లూరు, చీరాల ప్రాంతాల్లో అనేక దొంగతనాలు చేయించారు. అంతేకాక బాల నేరస్తుడు దొంగిలించే బంగారు నగలను రమేష్ అతని భార్య భూలక్ష్మిలు విక్రయించేవారు. కేసుల ఆధారంగా దర్యాప్తును ముమ్మరంచేసి నిందితులను గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు.
అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న పై ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆమె చెప్పారు. కేసును అత్యంత చాకచక్యంగా చేధించి నిందితులను పట్టుకొన్న చీరాల టూ టౌన్ సీఐ జి. రామారావు, సీసీఎస్ సీఐ కె. శ్రీనివాసరావు, సీసీఎస్ ఎస్సై వివి.నారాయణ, ఏఎస్సై వి.వెంకటేశ్వర రెడ్డి, హెచ్‌కానిస్టేబుల్స్ టి.బాలాంజనేయులు, వై.చంద్ర శేఖర్, సురేష్, కోటి, అహరోను, కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్లు, అంజిబాబు, ఖాదర్ భాషా, సాయికృష్ణ, శాంతకుమార్, సందాని బాషా, అచ్చియ్య, శ్రీనివాసరావులను ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేకంగా అభినందించారని, వారందరికీ రివార్డులు కూడా అందజేయనున్నట్లు డీఎస్పీ ప్రేమ్‌కాజల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment