పేర్లు మార్చి.. ఏమార్చి | ISIS Shafi Armar Trying To Approach Hyderabad Youth | Sakshi
Sakshi News home page

పేర్లు మార్చి.. ఏమార్చి

Published Tue, Aug 14 2018 9:07 AM | Last Updated on Tue, Aug 21 2018 1:37 PM

ISIS Shafi Armar Trying To Approach Hyderabad Youth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అబుదాబి మాడ్యుల్‌కు చెందిన ముగ్గురూ డిపోర్టేషన్‌పై అరెస్టు అయినప్పటికీ అబ్దుల్లా బాసిత్‌తో ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదింపులు జరిపింది షఫీ ఆర్మర్‌గా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌)కు అనుబంధంగా ఏర్పాటైన అన్సార్‌ ఉల్‌ తౌహిద్‌ ఫి బిలాద్‌ అల్‌ హింద్‌ (ఏయూటీ)కు ఇతను నేతృత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు సిటీలో చిక్కిన అనేక మంది అనుమానితులు, సానుభూతిపరులను ఇతడే ఆకర్షించాడు. సిరియా కేంద్రంగా వ్యవహారాలు నడిపిస్తున్న షఫీ ఆర్మర్‌ అక్కడ అమెరికా జరిపిన డ్రోన్‌ దాడుల్లో తాను చనిపోయినట్లు రెండుసార్లు వదంతులు వెలువడ్డాయి. కర్ణాటకలోని, భత్కల్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ షఫీ ఆర్మర్‌ భారత్‌లో ఐఎస్‌ కార్యకలాపాలకు ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం తన అన్న సుల్తాన్‌ ఆర్మర్‌తో కలిసి దేశం దాటిన ఇతను ఐఎస్‌కు అనుబంధంగా ‘అన్సార్‌ ఉల్‌ తౌహిద్‌’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు.

సిరియాలో అమెరికా సేనలు చేసిన దాడుల్లో సుల్తాన్‌ చనిపోగా... షఫీ మాత్రం భారత్‌ టార్గెట్‌గా ఐఎస్‌ను విస్తరించే పనిలో పడ్డాడు. ఇందుకుగాను స్థానికంగా ఉన్న వారిని ఆకర్షిస్తూ విధ్వంసాలు సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నాడు. సిటీ కేంద్రంగా 2016లో జేకేహెచ్, జేకేబీహెచ్‌ సంస్థలను ఏర్పాటు చేయించాడు. ఐఎస్‌ నుంచి వచ్చిన నిధులతో పాటు వివిధ మార్గాల్లో నగదు సమీకరిస్తూ భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం కోసం హవాలా తదితర మార్గాల్లో ఇక్కడ ఎంపిక చేసుకున్న వారికి పంపిస్తున్నాడు. పలు పేర్లతో ఇంటర్‌నెట్‌ కేంద్రంగా యువతను ఆకర్షిస్తున్న షఫీ వయస్సు ప్రస్తుతం 30 ఏళ్లే అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. కొంతకాలం ఆఫ్ఘనిస్థాన్‌ కేంద్రంగా అల్‌ ఖయిదాతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న షఫీ... 2014 జూన్‌ నుంచి సిరియా నుంచి కార్యకలాపాలను సాగిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. బాసిత్‌తో ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదిపులు జరిపింది ఇతడేనని, షఫీ ఆదేశాలతోనే బాసిత్‌ ఆన్‌లైన్‌ గ్రూపులు ఏర్పాటు చేశాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఎన్నో పేర్లు...
భారత్‌ను టార్గెట్‌గా చేసుకుని సుదీర్ఘకాలంగా కార్యకలాపాలు సాగిస్తున్న షఫీ ఆర్మర్‌... ఏ సందర్భంలోనూ తన ‘నిజ స్వరూపాన్ని’ బయట పెట్టలేదు. ఒక్కో మాడ్యుల్‌ను సంప్రదించేప్పుడు ఒక్కో పేరు వాడినట్లు అధికారులు చెబుతున్నారు.  

దేశ వ్యాప్తంగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో షఫీ ఆర్మర్‌ పేరు ఉంది. ఇతడిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు సైతం జారీ చేసింది.  
2013లో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులను ఐఎస్‌ వైపు నడిపించడానికి మహ్మద్‌ అట్టా పేరుతో సంప్రదింపులు జరిపాడు.  
2014లో హైదరాబాద్‌కు చెందిన బాసిత్‌తో పాటు మరో ముగ్గురిని ఐఎస్‌ వైపు ఆకర్షించడానికి సమీర్‌ ఖాన్‌గా మారాడు.  
2015లో మధ్యప్రదేశ్‌లోని రత్లంలో ఏర్పాటు చేసుకున్న మాడ్యుల్‌కు యూసుఫ్‌గా పరిచయమయ్యాడు.  
2016 జనవరిలో చిక్కిన ‘జేకేహెచ్‌’, అదే ఏడాది జూన్‌లో పట్టుబడిన ‘జేకేబీహెచ్‌’ మాడ్యుల్‌లోని సభ్యులతో యూసుఫ్‌ అల్‌ హింద్‌గా కథ నడిపాడు.
తాజాగా బాసిత్‌తో ఏ పేరుతో సంప్రదించాడనే అంశంపై ఎన్‌ఐఏ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement