న్యూఢిల్లీ : పౌరసత్వ నిరసనకారులపై ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఉదంతంపై పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కాల్పులకు దిగిన రాంభక్త్ గోపాల్ ఇంకా మైనరేనని తేలింది. అతడి మార్కుల మెమో ఆధారంగా ఈ విషయం వెల్లడైందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. రాంభక్త్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, అతన్ని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట ఈరోజు హాజరు పరుస్తామని క్రైం బ్రాంచ్ పోలీసులు చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పులకు దిగిన రాంభక్త్ గోపాల్ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి అని తెలిసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంభక్త్ కుటుంబంతో కలిసి ఢిల్లీకి 68 కిలోమీటర్ల దూరంలోని జీవార్‌లో ఉంటున్నాడు. సీఏఏ నిరసనకారులపై దాడి చేసేందుకే అతడు కొద్ది రోజుల క్రితం ఓ నాటు తుపాకీని కొన్నాడు. గురువారం ఉదయం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయల్దేరాడు. నేరుగా బస్సెక్కి ఢిల్లీకి చేరుకున్నాడు. జామియా మిలియా యూనివర్సిటీలో పౌరసత్వ నిరసనకారుల గుంపులో చేరిపోయాడు. నిరసనకారులు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రి వైపు వెళ్తుండగా గుంపులో నుంచి బయటికొచ్చాడు. తనను తాను ‘రాంభక్త్ గోపాల్’గా చెప్పుకున్నాడు. నిరసనకారులపై కాల్పులు జరిపాడు. దాంతో షాదామ్ ఫారూక్ విద్యార్థి అనే విద్యార్థి చేతికి బుల్లెట్ తగిలింది’అని వెల్లడించారు.
(చదవండి : జామియా విద్యార్థులపై కాల్పులు)
ఇక కాల్పుల ఘటన చోటుచేసుకునే సమయంలో, అనంతరం పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆగంతకుడి చేతిలో తుపాకీ ఉందని గుర్తించినా పోలీసులు అతన్ని కట్టడి చేయలేదని పలువురు ఆరోపించారు. నిందితుడి దాదాపు 30 మీటర్ల దూరంలో ఉండటంతో అతని చేతిలో ఉన్న తుపాకీని గుర్తించలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. కాల్పులకు తెగబడిన తరువాత రాంభక్త్ సంఘటనా స్థలం నుంచి నింపాదిగా నడుచుకుంటూ వెళ్తూ చేతిలోని తుపాకీని గాల్లో ఊపుతూ ‘తీసుకోండి స్వాతంత్య్రం’అని వ్యాఖ్యానించడం గమనార్హం. చివర్లో ‘ఢిల్లీ పోలీస్ జిందాబాద్’అని రాంభక్త్ నినాదాలు చేయడం విశేషం.
ఇదిలాఉండగా.. ఈ ఘటనపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. జామియా మిలియా వర్సిటీ వద్ద నిరసనకారులపై కాల్పులు జరిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్‌ను ఆదేశించారు. కాల్పులకు పాల్పడేందుకు కొద్దిసేపటికి ముందు రాంభక్త్ ఫేస్‌బుక్ లైవ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘షహీన్‌బాగ్ ఖేల్ ఖతమ్’అంటూ అతడు ఒక పోస్ట్ పెట్టాడు. తన అంతిమయాత్రలో తన శరీరాన్ని కాషాయ వస్త్రంతో చుట్టాలని, జైశ్రీరామ్ నినాదాలు చేయాలని అతడు మరో పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల తాలూకూ స్క్రీన్‌షాట్లు వైరల్‌కావడంతో అతడి ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment