
రాంచీ : ఓవైపు రోడ్డు భద్రత విషయంలో ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహక కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. అధికారులు మాత్రం అవేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కూడా ఇలాంటి పనే ఒకటి చేసిన విమర్శలు ఎదుర్కుంటున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపి వార్తల్లోకి ఎక్కారు.
మొన్న దీపావళి రోజు జార్ఖండ్ సీఎం రోడ్డుపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపారు. జంషెడ్ పూర్‌లోని తన నివాసంలో వేడుకలు జరుపుకున్న అనంతరం ఆయన ఇలా ఓ స్కూటీపై నగరం మొత్తం చక్కర్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే ఇలా నిబంధనలను ఉల్లంఘించడం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
అదే సమయంలో ఆయన సెక్యూరిటీ గార్డులు లేకుండా.. అనుచరులతో రోడ్డెక్కగా, వారికి హెల్మెట్‌లు లేకపోవటం విశేషం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేమో ట్రాఫిక్ నియమాలని నీతులు చెబుతుంటే.. అదే పార్టీకి చెందిన సీఎం మాత్రం ఇలా వ్యవహరించటం సరికాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఇండియాలో ప్రతీ గంటకు 16 మంది చొప్పున రోడ్డు ప్రమాదానికి గురవుతుంటే.. ప్రతీ నాలుగు నిమిషాలకు ఒకరు ప్రాణాలు విడుస్తున్నారని జాతీయ నేర పరిశోధన సంస్థ నివేదికలు చెబుతున్నాయి.
హెల్మెట్ లేకుండా బండి నడిపిన సీఎం
Comments
Please login to add a commentAdd a comment