![Journalist Shot In Head In Front Of His Daughters Near Delhi Deceased - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/22/ghaziabad-journalistt.jpg.webp?itok=Eyookwn5)
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో నడిరోడ్డుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ బుధవారం ఉదయం మరణించారు . తన మేనకోడలిని వేధించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ వద్ద ఇద్దరు కుమార్తెల ఎదుటే జర్నలిస్ట్ విక్రమ్ జోషిపై నిందితులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న విక్రమ్ జోషి సోమవారం రాత్రి ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు అతనిపై దాడి చేశారు. జోషి తలపై బుల్లెట్ గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
దుండగుల కాల్పులతో గాయపడిన జోషిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను ఇప్పటివరకూ అరెస్ట్ చేశారు. ఇద్దరు పోలీసులను సస్సెండ్ చేశారు. తన మేనకోడలిని కొందరు యువకులు వేధిస్తున్నారని విక్రమ్ జోషి నాలుగు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆ యువతిని వేధించిన వారే హత్యకు పాల్పడి ఉంటారని విక్రమ్ జోషి సోదరుడు పేర్కొన్నారు. జర్నలిస్ట్ ద్విచక్రవాహనంపై ఇంటికి చేరుకునే సమయంలో దుండగులు ఆయనను చుట్టుముట్టి దారుణంగా కొడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. జోషి కుమార్తెలు భయంతో పరుగులు పెట్టి సాయం కోసం అర్ధిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. చదవండి : ‘అందుకే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లా’
Comments
Please login to add a commentAdd a comment