రాధిక ఇంట్లో పరిశీలిస్తున్న కరీంనగర్ ఇంచార్జి కమిషనర్ సత్యనారాయణ
సాక్షి, కరీంనగర్ : ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసు మిస్టరీగా మారింది. తెలిసిన వారే హత్య చేసి ఉంటారనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేకపోయినా... ఎవరీ దారుణానికి ఒడిగట్టారనే విషయంలో స్పష్టత రావడం లేదు. రాధిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అంచనాకు వచ్చినా, అదెవరనే దానిపై క్లారిటీ లేదు. ఘటన జరిగి 24 గంటలు దాటినప్పటికీ, ఇంకా విచారణ పక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలువురు అనుమానితులను అదపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణ చివరి వరకు వచ్చినట్లే వచ్చి మళ్లీ మొదటికే చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నిందితుడెవరనే విషయం ఇంకా తెలియలేదు.
ప్రేమ తిరస్కరణ నిజమేనా..?
రాధిక హత్యకు ప్రేమ తిరస్కరణ కారణమనే కోణంలో పోలీసులు జరుపుతున్న విచారణలో కొత్త అంశాలేవీ వెలుగులోకి రావడం లేదని సమాచారం. అయితే అనుమానాలు మాత్రం చాలానే వ్యక్తమవుతున్నా, వాటిని నిరూపించే ఆధారాలు దొరకడం లేదని తెలిసింది. కాల్‌డేటా, యువతి తల్లిదంద్రులు, స్థానికులు మాటల ఆధారంగా నలుగురు అనుమానితులను అదపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. ఇందులో ఓ యువకున్ని మంగళవారం వేకువజామున 2గంటలకు అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యువకుడు రాధికను ప్రేమించడం నిజమేనని ఒప్పుకొన్నప్పటికీ, హత్య చేయలేదనే చెబుతున్నట్లు సమాచారం. ఫోన్ కాల్స్‌లో రాధికతో ఎక్కువసార్లు మాట్లాడినది కూడా ఆ యువకుడేనని పోలీసుల విచారణలో తేలింది. రాధిక ఇంట్లో అద్దెకు ఉండి నాలుగు రోజలు క్రితం వెళ్లిపోయిన పోచమల్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని నిజాన్ని రాబట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.
ఇంట్లో దొంగతనంపై అనుమానాలు
రాధిక హత్య కోణాన్ని విచారిస్తున్న పోలీసులకు ఆ ఇంట్లో నెలకొన్న పరిస్థితులు కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రాధికను గొంతుకోసి చంపిన ఆగంతకుడు బీరువాలోని మూడు తులాల బంగారాన్ని, నగదును దొంగిలించడం ఆ తరువాత బీరువాను మూసేసి, దానికి అడ్డుగా మంచం పెట్టి వెళ్లడం ఒకెత్తయితే... రాధికను హత్య చేసిన తరువాత ఆధారాలు దొరకకుండా శుభ్రం చేయడం అనుమానాలను రేకెత్తిస్తోంది. హత్య తరువాత అంత ఓపికగా పనులు చక్కబెట్టే పరిస్థితి ఇంటి గురించి తెలిసిన వారికే తప్ప వేరేవారికి సాధ్యం కాదనే కోణంలో కూడా అనుమానిస్తున్నారు. హత్య జరిగిన వెంటనే కుటుంబసభ్యులు వ్యవహరించిన తీరుపై కూడా ఓ కన్నేసినట్లు తెలుస్తోంది. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో త్వరలోనే కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీపీ
రాధికను హత్య చేసిన సంఘటన స్థలాన్ని ఇంచార్జి సీపీ సత్యనారాయణ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకుని ఇంటి పరిసరాలు, అక్కడ ఉన్న వీధి పరిసరాలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హత్య జరిగిన విషయాన్ని అనేక కోణాల్లో ఎనిమిది బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు నలుగురు నిందితులను అదపులోకి తీసుకొని విచారిస్తున్నామని పేర్కొన్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించామన్నారు. సమత, హాజీపూర్ ఘటనల్లో లాగే రాధిక హత్య కేసును కూడా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దృష్టి సారించిన డీజీపీ..
రాధిక హత్య ఉదంతంపై రాష్ట్ర డీజీపీ అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఐజీతోపాటు పలువురు అధికారులు సైతం రాధిక కేసుపై దృష్టి పెట్టి పలు సూచనలు అందిస్తున్నట్లు తెలిసింది. కరీంనగర్ సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి ఎప్పటికప్పుడు కేసు విచారణ గురించి తీసుకోవాలి్సన చర్యల గురించి సూచనలు చేస్తున్నారు. తొందరగా కేసును విచారించి నిందితుడు ఎవరనే విషయాన్ని తేల్చడానికి పోలీసు యంత్రాంగం నిమగ్నమయ్యారు.
సీసీ పుటేజీల పరిశీలన..
హత్య జరిగిన విద్యానగర్ వెంకటేశ్వర కాలనీలోని రాధిక ఇంటి పరిసర ప్రాంతాలు, సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు అనుమానంగా సీసీ కెమెరాల ద్వారా నిందితుడికి సంబంధించిన ఏ విషయాలూ తెలియలేదని అర్థమవుతోంది. దీంతోపాటు అక్కడి వీధుల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు కాకుండా కొందరు ఇంటి యజమానులు స్వంతంగా పెట్టుకున్న సీసీ కెమెరాల డీవీఆర్‌లను సైతం స్వాధీన పర్చుకోవడంతోపాటు మరిన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. స్థానికులను పూర్తిస్థాయిలో విచారించి స్టేట్‌మెంట్‌లు రికార్డు చేస్తున్నారు. కాగా సీసీ కెమెరాలు చాలా వరకు పనిచేయని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. గుడి వద్ద ఉన్న కెమెరా ఒక్కటే ప్రస్తుతం పోలీసులకు ఆధారంగా మారింది.
లైంగిక దాడి జరగలేదు..
కాగా, రాధిక హత్యకు సంబంధించి పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో లైంగిక దాడి జరగలేదని తేలినట్లు సమాచారం. గొంతుకోయడం వల్లనే హత్య జరిగినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
పూర్తయిన రాధిక అంత్యక్రియలు..
రాధిక అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం రాంనగర్ సమీపంలోని కురుమ కులస్తుల శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున బంధువులు, ప్రజలు రాధిక మృతదేహాన్ని చూడడానికి తరలివచ్చారు. వివిధ పార్టీల నాయకులు, తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment