కస్‌గంజ్‌లో పహారా కాస్తున్న పోలీసులు
లక్నో : మతఘర్షణల నేపథ్యంలో చెలరేగిన అల్లర్లతో పశ్చిమ ఉత్తరప్రదేశ్ అట్టుడుకుతోంది. కాస్‌గంజ్ జిల్లాలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలో విద్యార్థి సంఘాలు ర్యాలీ హింస్మాత్మకంగా మారి చందన్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శనివారం చందన్ అంత్యక్రియల అనంతరం ర్యాలీ చేపట్టిన ఆందోళనకారులు ఒక్కసారిగా తమ ఆగ్రహావేశాలను ప్రదర్శించారు.
ఓ బస్సు, మూడు దుకాణాలను, ఇతర వాణిజ్య సముదాయాలను తగలబెట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతోంది. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్లు అదనపు డీజీ ఆనంద్ ప్రకటించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామని, సున్నిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా 49 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. ఆదివారం ఉదయం మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఘర్షణకు దారి తీసిన పరిస్థితి... గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాస్‌గంజ్ హెడ్‌క్వార్టర్స్‌లో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం సంయుక్తంగా తిరంగా ర్యాలీ చేపట్టింది. ఇంతలో మరో వర్గానికి చెందిన కొందరు 'పాకిస్థాన్ జిందాబాద్' అనే నినాదాలు చేయటంతో వివాదం మొదలైంది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోగా.. చందన్‌గుప్తా అనే యువకుడు చనిపోయాడు. మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అయితే పోలీసు కాల్పుల్లోనే వారు గాయపడ్డారంటూ వదంతులు వ్యాపించటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
అల్లర్లను అదుపు చేసేందుకు భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కాజ్‌గంజ్ జిల్లా కలెక్టర్ ఆర్పీ సింగ్ ను ఫోన్ లో సంప్రదిస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మరోవైపు అల్లర్ల ఘటన దురదృష్టకరమని యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులను వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment