మృతదేహంతో నిరీక్షిస్తున్న కుటుంబీకులు
విజయనగరం, వేపాడ: శ్మశానానికి తీసుకెళ్తున్న మృతదేహాన్ని అడ్డుకున్న సంఘటన మండలంలోని చినగుడిపాలలో శుక్రవారం చోటుచేసుకుంది. దీంతో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వేచలపు అప్పారావు అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందారు. దీంతో మృతదేమాన్ని బంధువులు, కుటుంబ సభ్యులు శ్మశానవాటికకకు తరలిస్తుండగా, గ్రామానికి చెందిన శంకరవంశం సీతారామ్మూర్తిరాజు మృతదేహాన్ని తీసుకెళ్తున్న రస్తా తన సొంతమని, ఈ దారి గుండా మృతదేహాన్ని తీసుకెళ్లకూడదని అడ్డగించాడు.
మృతుడి బంధువులు ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో మృతుడి కుటుంబీకులు గ్రామ పెద్దలు, పోలీస్, రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ పెంటయ్య తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. స్థలం ఎవరిదైనా శవాన్ని అడ్డుకోవడం నేరమని.. అంత్యక్రియలు జరిగేలా చూడాలని పోలీసులకు సూచించారు. దీంతో వీఆర్‌ఓ శ్రీను, హెచ్‌సీ శివకేశవరావు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో సంప్రదింపులు చేసి సమస్య పరిష్కరించారు. తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే స్థల హద్దులు గుర్తిస్తారని గ్రామపెద్దలకు చెప్పారు.
అడ్డుకోవడం బాధాకరం
మృతదేహాన్ని అడ్డుకోవడం బాధకరమని గ్రామ పెద్దలు లండఅప్పడు, రామ్మూర్తి, బాలిబోయిన పెదకోనారి, జీరంరెడ్డి జగ్గునాయుడు, తదితరులు అన్నారు. పూర్వం నుంచి గ్రామస్తులందరూ ఇదే రహదారిని వినియోగిస్తున్నారని చెప్పారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అధికారులు స్పందించి శ్మశానవాటిక హద్దులు గుర్తించి సమస్య పరిష్కరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment