సీఐతో వాగ్వాదానికి దిగిన మహిళలు హరీశ్(ఫైల్)
చందుర్తి(వేములవాడ): పాతకక్షలు యువకుడి ప్రాణం తీశాయి. పెద్దల మధ్య ఉన్న భూ వివాదంలో తలదూర్చిన పిల్లలు శత్రువులుగా మారారు. తరుచూ గొడవపడుతూ పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడ్ని తన ప్రత్యర్థి మాటువేసి వేటకొడవళ్లతో నరికి చంపాడు. ఆపై మృతదేహాన్ని అక్కడే ఉన్న వ్యవసాయబావిలో పడేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగపూర్‌లో మంగళవారం చోటు చేసుకోగా... బుధవారం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మెరుపుల హరీశ్(25) ఇంటర్మీడియెట్ మధ్యలో మానేశాడు. తండ్రికి చేదోడు.. వాదోడుగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తుంటాడు.
మంగళవారం వ్యవసాయపొలం వద్దకు వెళ్లాడు. పశువులకు నీళ్లందించి బుచ్చయ్య అనే వ్యక్తితో తన స్కూటీపై తిరిగివస్తున్నాడు. గ్రామ చెరువు మత్తడి వద్ద మాటు వేసిఉన్న ఇదే గ్రామానికి చెందిన నేరెల్ల రమేశ్, నేవూరి బాబు స్కూటీకి అడ్డం తిరిగారు. తమవద్ద ఉన్న వేటకొడవళ్లతో హరీశ్ తలపై విచక్షణారహితంగా నరికారు. బుచ్చయ్య భయంతో అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన హరీశ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎవరూ గుర్తించొద్దని మృతదేహంతో పాటు స్కూటీని పక్కనే ఉన్న బావిలో పడేశారు. కొడుకు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విషయం తెలిసిన పోలీసులు, హరీశ్ తల్లిదండ్రులు బావివద్దకు చేరుకున్నారు. అప్పటికే రాత్రి అవడంలో వేకువజామున వరకు మోటార్ల సాయంతో నీటినితోడి బధవారం మృతదేహాన్ని వెలికితీశారు.
మృతదేహంతో ఆందోళన..
హరీశ్ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యా రు. శవాన్ని మంచంపై ఉంచి నిందితుడు నేరేళ్ల రమేశ్ ఇంటికి తీసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా... దాడిచేసేందుకు కూడా వెనకాడలేదు. పోలీసులు వెనక్కి తగ్గడంతో హరీశ్ మృతదేహాన్ని రమేశ్ ఇంట్లో ఉంచారు. అక్కడే దహనసంస్కారాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఇంట్లో ఉన్న ఫర్నీచర్, ధాన్యం, రసాయన ఎరువులు, ఇంటిని ధ్వంసం చేశారు.
పరిస్థితి విషమించడంతో చందుర్తి సీఐ విజయ్‌కుమార్, రుద్రంగి, కోనరావుపేట , వేములవాడ రూరల్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, నరేశ్, శివకేశువులతో పాటు వేములవాడ డీఎస్పీ వెంకటరమణ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మృతదేహాన్ని ఇక్కడే దహనం చేస్తామని చెప్పడంతో డీఎస్పీ సముదాయించారు. నిందితులకు కఠిన శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం హరీశ్ మృతదేహాన్ని సిరిసిల్ల ప్రధాననాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు. అంత్యక్రియలు పూర్తయ్యేంతవరకు బందోబస్తు నిర్వహించారు.
భూ వివాదమే కారణమా...?
హరీశ్ హత్యకు భూ వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా ఆరా తీస్తున్నారు. హరీశ్, రమేశ్ వ్యవసాయపొలాలు పక్కపక్కనే ఉంటాయి. హద్దుల విషయంలో ఇరువురి తండ్రులకు ఏడాదికాలంగా గొడవలు జరుగుతున్నాయి. అవి పిల్లల వరకువెళ్లాయి. రమేశ్, హరీశ్ తరుచూ గొడవ పడేవారు. దసరానాడు కూడా ఇద్దరూ పరస్పద దాడులకు దిగారు. ఇటీవల సైతం తలెత్తిన గ్రూపు గొడవల నేపథ్యంలో రమేశ్ హరీశ్‌ను మట్టుబెట్టాలని చూశాడు. అదునుచూసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment