మృతి చెందిన ప్రేమికులు
తమిళనాడు, టీ.నగర్: దిట్టకుడి సమీపాన మంగళవారం ప్రేమజంట బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంత వాసులను కలచివేసింది. కడలూరు జిల్లా దిట్టకుడి సమీపాన గల ఆలత్తూరు గ్రామానికి చెందిన గోవిందరాజులు కుమారుడు శివరంజన్ (18). ఇతను కీళకల్‌పూండిలో గల ప్రభుత్వ పాఠశాలలో ప్లస్ 2 పూర్తి చేశాడు. కీళకల్‌పూండికి చెందిన ఆర్ముగం కుమార్తె అభిరామి (16). అదే ప్రాంతంలోని పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసింది. పాఠశాలకు వెళుతుండగా శివరంజన్‌కు అభిరామికి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
వీరి ప్రేమకు తల్లిదండ్రులు వ్యతిరేకత తెలిపారు. ఇదిలాఉండగా శివరంజన్, అభిరామి మంగళవారం తమ ఇళ్ల నుంచి బయలుదేరి తొలుదూరుకు చెందిన వేందన్ అనే వ్యక్తి పంట పొలానికి వెళ్లారు. అక్కడ చాలా సేపు మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరూ చున్నీని కట్టుకుని అదే ప్రాంతంలోని బావిలో దూకారు. ఇదిలాఉండగా ప్రేమజంట కోసం ఇరు కుటుంబాల తల్లిదండ్రులు గాలిస్తూ వచ్చారు. దీని గురించి సమాచారం అందుకున్న వేందన్ తన పొలంలోని బావి దగ్గరికి వెళ్లి చూడగా ఇరువురి మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. ఈ మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది వెలికి తీశారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం దిట్టకుడి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment