
మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్) చిట్టెమ్మ, భరత్ (ఫైల్)
ఆ ప్రేమికుల పెళ్లికి కులాలు అడ్డువచ్చాయి. తల్లిదండ్రులను ఎదిరించి గ్రామం నుంచి వెళ్లిపోయారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్నారు. ఎలాంటి బెదిరింపులు వచ్చాయో తెలియదు కానీ.. కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని అయ్యవారి గుట్ట(కొండ)లో ఆ ప్రేమజంట ఆత్మహత్యచేసుకుంది.
అనంతపురం , కళ్యాణదుర్గం: శెట్టూరు మండలం అయ్యగార్లపల్లికి చెందిన కమ్మ పాలాక్షప్ప, మల్లక్క దంపతుల కుమార్తె చిట్టెమ్మ (18) అదే గ్రామానికి చెందిన బోయ మల్లప్ప, మాదేవి దంపతుల కుమారుడు భరత్(21)లు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి వీరికి కులాలు అడ్డొచ్చాయి. అమ్మాయి కులం వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించారు. ఒకానొక దశలో భరత్‌ను అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రేమ విషయంలో మందలించారు. ఇద్దరూ దూరం కావడానికి మనసులు అంగీకరించలేదు. ఫిబ్రవరి 20న తెల్లవారుజామున చిట్టెమ్మ తన పదో తరగతి, ఇంటర్ మార్కుల జాబితాలు, ఆధార్ కార్డులు, భరత్ తన ఆధార్ కార్డుతో గ్రామం నుంచి వెళ్లిపోయారు. బెంగుళూరుకు వెళ్లి అక్కడి నుంచి యశ్వంతపూర్ నుంచి రైలులో తిరుపతికి వెళ్లారు. స్నేహితుల సమక్షంలో అక్కడ వివాహం చేసుకున్నారు.
మిస్సింగ్ కేసు నమోదు
చిట్టెమ్మ తండ్రి కమ్మ పాలాక్షప్ప తన కుమార్తె కనిపించడం లేదని, గ్రామానికి చెందిన మల్లప్ప కుమారుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భరత్‌పై అనుమానం ఉందని ఫిబ్రవరి 20వ తేదీన శెట్టూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఫిబ్రవరి 21వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ రోజు నుంచి జంట ఆచూకీ కోసం స్నేహితులను పోలీసులు పిలిపించి తమదైన శైలిలో కౌన్సిలింగ్ చేస్తూ విచారణ చేపట్టారు.
భయపడి.. బలవన్మరణం
తమ స్నేహితులను పోలీసులు విచారణ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ప్రేమజంట స్వగ్రామానికి వెళితే ఏం జరుగుతుందోనని భయపడి కళ్యాణదుర్గానికి చేరుకున్నారు. పట్టణ సమీపంలోని అయ్యవారు గుట్ట కొండలోకి వెళ్లి గుండ్ల మధ్య గుహలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మేకల కాపరులు సాయంత్రం గమనించి సరోజా కాంపౌండ్ సమీపంలోని ప్రజలకు తెలియజేశారు. సీఐ శివప్రసాద్, ఎస్‌ఐలు జమాల్ బాషా, నబీరసూల్, ఏఎస్‌ఐ తులశన్నలు మృతదేహాలను పరిశీలించి, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment