లోకేష్, వన్నూరక్క (ఫైల్ ఫొటోలు)
అబ్బాయి మేజర్.. అమ్మాయి మైనర్. అయినా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లికి ‘వయసు’ అడ్డొచ్చింది. పెద్దలు కాదన్నారు. కొన్నాళ్లు వేచి ఉంటే సరిపోయేది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన జంట క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం అలుముకుంది.
అనంతపురం, కళ్యాణదుర్గం: పాలవాయి గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన లోకేష్ (22), వన్నూరక్క (16) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చిన్న వయసులోనే ప్రేమ ఏమిటంటూ తల్లిదండ్రులు సున్నితంగా మందలించారు. ఆలోచనలో పరిపక్వత లేని ఇద్దరూ మనస్తాపానికి గురయ్యారు. పెళ్లికి వయస్సు అడ్డు వస్తోందని, మనల్ని ఇక కలవనీయరని, అలా ఉండటం కన్నా చావడమే మేలనుకున్నారు. గ్రామంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్తానని వన్నూరక్క కుటుంబ సభ్యులకు చెప్పి శనివారం సాయంత్రం బయటకు వెళ్లింది. లోకేష్ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇద్దరూ ద్విచక్రవాహనంలో గ్రామ సమీపంలోని బంతి ఓబిలేసు గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడ వేప చెట్టుకు చున్నీలతో ఇద్దరూ ఉరేసుకున్నారు. ద్విచక్ర వాహనంపైకి ఎక్కి ఉరి వేసుకుని వేలాడినట్లు కనిపిస్తోంది.
సంఘటన స్థలంలో ప్రేమజంట లోకేష్, వన్నూరక్క మృతదేహాలు
పారిపోయి.. విగతజీవులుగా మారి!
ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు లోకేష్, వన్నూరక్క మృతదేహాలను చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. రాత్రి వేళలో ఇంటికి రాకపోవడంతో ఇరువురు కుటుంబ సభ్యులు సెల్‌ఫోన్లకు ఫోన్ చేసినా పనిచేయలేదు. బంధువుల గ్రామాలలోనూ ఆరా తీశారు. పాలవాయి సమీపంలోనూ అన్వేషించారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. పెళ్లి చేసుకోవడం కోసం పారిపోయి ఉంటారని భావించారు.
పెళ్లి చేద్దామనుకునే లోపే..
ఉదయాన్నే ఇరు కుటుంబాల బంధువులు వారి వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. ఒకే కులానికి చెందిన వారని, అందులోనూ బంధుత్వం ఉందని, పిల్లల మనసును ఎందుకు కష్టపెట్టడం పెళ్లి చేసేద్దాం.. ఎట్లయ్యేది అట్ల అవుతుంది. అంతా దేవుడిమీదే భారం వేద్దాం’ అని అనుకున్నారు. ఈలోగా ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సమాచారం అందడంతో ఇరు కుటుంబాల వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment