అనంతపురం,బొమ్మనహళ్: ప్రేమ పేరుతో వంచించి మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఉదంతం నేమకల్లులో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాలివీ.. నేమకల్లు గ్రామానికి చెందిన 15ఏళ్ల బాలిక అనంతపురం జెడ్పీ బాలికల హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనుచరుడు దోణప్ప కుమారుడు తిప్పేస్వామి ఆ బాలికపై కన్నేశాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.
చివరకు తండ్రీకుమారులు ఇద్దరూ పథకం ప్రకారం అనంతపురంలోని మట్కా బీటర్ బసవరాజు సాయంతో శుక్రవారం మధ్యాహ్నం బాలికను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కర్ణాటక సరిహద్దులోని బెంచికొట్టాల వద్దనున్న ఆంజినేయస్వామి దేవాలయానికి తీసుకెళ్లి మైనర్ బాలికకు తిప్పేస్వామితో బలవంతంగా వివాహం జరిపించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని బొమ్మనహాళ్ ఎస్‌ఐ రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ దోణప్ప ఇంటికి వెళ్లి బాలికను ఉజ్వల హోంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment