
రైలు పట్టాలపై యువకుడి తల, మొండెం వేరైన మృతదేహం (ఇన్‌సెట్) రమేష్(ఫైల్)
విశాఖసిటీ, అగనంపూడి(గాజువాక): ప్రేమించిన యువతి దక్కడం లేదన్న అక్కసు ఓ పక్క.. పెళ్లి చెడగొట్టానన్న ఆత్మక్షోభ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. దువ్వాడ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు.. అగనంపూడి నిర్వాసితకాలనీ దిబ్బపాలేనికి చెందిన దుల్ల రమేష్ (28) ఐటీఐ పూర్తిచేసి పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. రమేష్ ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెకు 2న రఘు అనే అతనితో వివాహం జరగాల్సి ఉంది.
ఈ విషయం తెలుసుకున్న రమేష్ రఘు వద్దకు వెళ్లి మీరు పెళ్లి చేసుకోవాల్సిన యువతిని ప్రే మిస్తున్నానని, ఆ యువతి కూడా నన్ను ప్రేమిస్తుందని చెప్పడంతో రఘు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు రమేష్‌పై దువ్వాడ పో లీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శనివారం రమేష్‌పై కేసు నమోదు చేసి పూచీకత్తుపై రాత్రి ఇంటికి పంపించేశారు. ఇంటికి చేరుకున్న రమేష్ మనస్తాపానికి గురై దువ్వాడ రైల్వేస్టేషన్‌కు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ జేబులో దొరికిన సూసైడ్ నోట్‌లో యువతి చాలా మంచిదని, నాది వన్‌సైడ్ లవ్ అని, యువతిని దక్కించుకోడానికి నేను ఆమెపై నిందలు వేశానని, రఘు ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతూ లేఖ రాశాడు. రమేష్ తండ్రి నూకరాజు చిన్నతనంలోనే మరణించగా, తల్లి వరహాలమ్మ, అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు.