
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రింకీరాణి , కమలకాంత్ నాయక్
సాక్షి, గన్నవరం: ప్రియురాలు మాట్లాడటం లేదన్న కోపంతో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడిచేసి గాయపర్చాడు. బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని భద్రాక్ జిల్లా బగానా గ్రామానికి చెందిన కమల కాంత్ నాయక్ (23), అదే జిల్లాలోని సుందర్‌పూర్ గ్రామానికి చెందిన రింకీరాణి (20) రెండేళ్లుగా స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ, కంపెనీ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. వారి మద్య ఏర్పడిన పరిచేయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకే ప్రాంతం, కులం వారు కావడంతో తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. 15 రోజుల క్రితం రింకీరాణి స్వగ్రామానికి వెళ్లగా, కమల కాంత్‌నాయక్ కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధంపై మాట్లాడారు. పెళ్లి చర్చల్లో రెండు కుటుంబాల్లో భేదాభిప్రాయాలు రావటంతో వివాహం సందిగ్ధంలో పడింది.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తిరిగి వచ్చిన రింకీరాణి తన ప్రియుడితో మాట్లాడటం మానేసింది. దీంతో కమలకాంత్‌నాయక్ ఆగ్రహం చెందాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో క్వార్టర్స్‌లోని తన గదిలో స్నేహితులతో కలిసి ఉన్న రింకీరాణితో మాట్లాడేందుకు కమలకాంత్ వెళ్లాడు. ఆమె మాట్లాడేందుకు నిరాకరించగా అకస్మాత్తుగా కత్తితో ఆమెపై దాడి చేసి గాయపర్చాడు. రింకీరాణి మెడ, నడుం భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాలకు తరలించారు. వీరవల్లి ఎస్‌ఐ నాగ దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కమల కాంత్ నాయక్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment