
మృతిచెందిన వెంకటేశ్వర రెడ్డి
కర్నూలు, అవుకు: మండలంలోని రామాపురంలో మంగళవారం ప్రేమికులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రియుడు మరణించగా..ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అవుకు ఎస్‌ఐ వెంకటేశ్వర రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామాపురం గ్రామానికి చెందిన మారం రామచంద్రారెడ్డి కుమార్తె స్వప్నలత డిగ్రీ (బీఎస్సీ) వరకు చదివింది. అదే గ్రామానికి చెందిన కొండారెడ్డి కుమారుడు వెంకటేశ్వరరెడ్డి (24) కూడా బీకాం పూర్తి చేశాడు. ఇతను బెంగళూరులో ఏడాది పాటు అకౌంటెంట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం తండ్రితో కలిసి వ్యాపారం చూసుకునేవాడు. కాగా.. స్వప్నలత, వెంకటేశ్వరరెడ్డి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
అయితే.. ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేసేందుకు రెండు రోజుల్లో నిశ్చితార్థం చేసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వరరెడ్డి విషపు గుళికలు మింగాడు. కుటుంబ సభ్యులు గమనించి ముందుగా బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment