
ఆర్‌ఎస్ బ్రదర్స్ వస్త్ర దుకాణంలో ఎగసిపడుతున్న మంటలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని అబిడ్స్ ఆర్‌ఎస్ బ్రదర్స్ వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తుల భవనంలో దాదాపు నాలుగు గంటల పాటు అగ్నికీలలు ఎగసిపడ్డాయి. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కోఠికి వెళ్లే వాహనాలను మోంజాయి మార్కెట్ మీదుగా దారి మళ్లించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అదృష్టవశాత్తూ అర్థరాత్రి వేళ ప్రమాదం జరగటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.
చుట్టుపక్కల ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో దాదాపు మూడు కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణపు యాజమాన్యం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment