
ముంబయి: ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద బ్రెడ్ ఆమ్లెట్ విషయంపై చోటుచేసుకున్న వివాదంలో కత్తిపోట్లకు గురైన వ్యక్తి మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ముంబయి సమీపంలోని నాలా సోపారాలో గత శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రవి భగవత్ అనే నలభై ఏళ్ల వ్యక్తి నాలా సోపారాలో నివాసం ఉండేవాడు. శనివారం అర్ధరాత్రి దగ్గర్లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు స్నేహితుడితో కలిసి వెళ్లాడు. బ్రెడ్ ఆమ్లెట్ కావాలని ఆర్డరిచ్చాడు భగవత్. ఏం జరిగిందో తెలియదు కానీ నాలుగు రూపాయల కోడిగుడ్డు విషయంలో భగవత్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వ్యక్తికి మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది.
కొద్దిసేపటికే పెద్ద గొడవగా మారగ.. ఆవేశంతో అరుస్తున్న కస్టమర్ భగవత్‌ను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేసే ఓ యువకుడు కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భగవత్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న తులిని స్టేషన్ పోలీసులు ఘటనాస్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ముగ్గురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భగవత్‌ను కత్తితో పొడిచిన ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తొలుత హత్యకేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులను పాల్ఘార్ ఎస్పీ సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment