సాక్షి, సిటీబ్యూరో: ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పీఏనని, ఆయన కార్యాలయంలో ఓఎస్డీనని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేస్తూ అనేక డిమాండ్లు చేస్తున్న వ్యక్తిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన పసుపులేటి నవీన్‌గా గుర్తించినట్టు డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. అక్కడి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న నవీన్ తన బంధువులు, స్నేహితుల వద్ద డాంభికాలకు పోయేవాడు. తనకు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంచి సంబంధాలు ఉన్నాయని, ఎలాంటి పనినైనా చేయించగలనంటూ ప్రగల్భాలు పలికేవాడు. దీంతో అనేక మంది ఇతడికి వివిధ రకాలైన సహాయాలు కోరేవారు.
ఇవి పూర్తి చేయకపోతే తన పరువు పోతుందని భావించిన నవీన్ ఉప రాష్ట్రపతి పీఏ అవతారం ఎత్తాడు. అనేక మంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేస్తున్న ఇతగాడు తన పేరు అర్జునరావు అని, తాను ఉప రాష్ట్రపతి కార్యాలయంలో పని చేస్తానంటూ పరిచయం చేసుకునేవాడు. ఆపై వీరిని ఉద్యోగుల బదిలీలు, కాలేజీలు సీట్ల కోసం డిమాండ్ చేసేవాడు. ఈ నేపథ్యంలోనే నవీన్ ఇటీవల బీజేపీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డికి కాల్ చేశాడు. ఇతడి వ్యవహారశైలిపై అనుమానించిన ఆయన ఉప రాష్ట్రపతి కార్యాలయంలో వాకబు చేశారు. అర్జునరావు పేరుతో ఎవరూ పని చేయట్లేదని తేలింది. దీంతో కిషన్‌రెడ్డి సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు చేసిన బృందం నిందితుడు నవీన్‌గా గుర్తిచింది. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సాయంతో నవీన్‌ను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment