16 రాష్ట్రాలకు చెందిన 600 మంది యువతులతో.. | Man Arrest in Cyber Crime in Hyderabad | Sakshi
Sakshi News home page

రిసెప్షనిస్ట్‌ ఉద్యోగాల పేరుతో వల

Published Sat, Aug 24 2019 8:51 AM | Last Updated on Sat, Aug 24 2019 8:51 AM

Man Arrest in Cyber Crime in Hyderabad - Sakshi

గచ్చిబౌలి/మియాపూర్‌ : రిసెప్షనిస్ట్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతులను ట్రాప్‌ చేసి నగ్న చిత్రాలు సేకరిస్తున్న చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను మియాపూర్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. 16 రాష్ట్రాలకు చెందిన 600 మంది యువతులు అతడి బారిన పడినట్లు గుర్తించారు. ఎస్‌ఐ రఘురాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరువాయూర్‌ బ్యాంక్‌ కాలనీకి చెందిన క్లెమెంట్‌ రాజ్‌ చెజియన్‌ అలియాస్‌ ప్రదీప్‌ అక్కడే టీసీఎస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. క్వికర్‌ డాట్‌ కామ్‌లో రిసెప్షనిస్ట్‌ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న యువతుల వివరాలు, ఫోన్‌ నంబర్లను సేకరించే అతను వారికి నేరుగా ఫోన్‌ చేసి తాను రాడిసన్‌ హోటల్‌ ప్రతినిధినని పరిచయం చేసుకునేవాడు. హెచ్‌ఆర్‌ ఆర్చన జగదీష్‌ వాట్సాప్‌  ఇంటర్వ్యూ తీసుకుంటుందని చెప్పే వాడు. అనంతరం మరో నంబర్‌ నుంచి ఫోన్‌ చేసి తానే అర్చన జగదీష్‌గా చెబుతూ యువతుల ఫుల్‌ ఫొటోతో పాటు వివిధ భంగిమల్లో ఫొటోలు సేకరించి మొదటి రౌండ్‌లో సెలక్ట్‌ అయ్యారని  చెప్పేవాడు.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఐ రఘురాం 
అనంతరం ఆఫీస్‌ రిసెప్షన్‌లో ఉండే వారి శరీరాకృతి అందంగా ఉండాలని చెబుతూ వారి నగ్న ఫొటోలు పంపాలని చెప్పడంతో పలువురు యువతులు అందుకు అంగీకరించి ఫొటోలు పంపారు. అనంతరం వారికి ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడమేగాక ఈ విషయం ఎవరికైనా చెబితే ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడేవాడు. వీడియో కాల్‌ చేసి వారిని వేధించేవాడు.  ఇదే తరహాలో 16 రాష్ట్రాలకు చెందిన 600 మంది యువతులతో చాటింగ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత ఏప్రిల్‌లో మియాపూర్‌కు చెందిన ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇప్పటి వరకు 600 మంది మహిళలను మోసం చేసినట్లు తెలిపాడు. 20 మంది యువతుల నగ్న చిత్రాలు సెల్‌ఫోన్‌లో ఉన్నాయని, మరో 2వేల మంది మహిళల ఫొటోలు ల్యాప్‌టాప్‌లో భద్రపరిచినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి రెండు సిమ్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని నిందితుడిని శుక్రవారం  రిమాండ్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement